Kids

లీప్ సంవత్సరం విశేషాలు తెలుసుకుందామా?

లీప్ సంవత్సరం విశేషాలు తెలుసుకుందామా?-Leap Year 2020

ఈ నెల పేరు? ఫిబ్రవరి అనే చెప్పేస్తారు వెంటనే… మరి ఎన్ని రోజులుంటాయి? కొంచెం ఆలోచించి ఈసారి 29 రోజులొస్తాయ్ అని జవాబిస్తారు… కానీ ఒకప్పుడు ఈ నెలలో 30 రోజులు ఉండేవని తెలుసా? ఇప్పుడు మాత్రం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేస్తారు కదూ… ఇంకా లీపు ఇయర్ సంగతులెన్నో ఉన్నాయ్… అవేంటో చదివేయండి!
***అదనపు రోజు ఎందుకు?
మామూలుగా సంవత్సరానికి 365 రోజులే. కానీ లీపు సంవత్సరానికి 366 రోజులు ఎందుకుంటాయో తెలుసా? భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 365.25 రోజులు. కాబట్టి సంవత్సరానికి దాదాపు ఆరు గంటలు మిగులుతుంది. అదే నాలుగేళ్లకయితే 24 గంటలు. అంటే ఒక రోజన్నమాట. అలా లీపు ఇయర్లో నాలుగేళ్లకోసారి క్యాలెండర్లో ఒక రోజు అదనంగా వచ్చి చేరింది. ఫిబ్రవరి నెలకు సాధారణంగా 28 రోజులే ఉంటే లీపు సంవత్సరంలో మాత్రం 29 రోజులుంటాయన్నమాట.
****లీపు సంవత్సరం మొదలైంది ఇలా..
ఇంతకీ ఈ లీపు సంవత్సరాన్ని ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు అంటే? రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్. క్రీస్తుపూర్వం 46లో. జూలియస్ సీజర్ 365 రోజుల క్యాలెండర్ను రూపొందించారు. ఏటా నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు ఎక్కువ వస్తుందనీ, అందువల్ల ఆ రోజును ఒక నెలలో కలపాలనీ అనుకున్నారు. మొత్తం మీద రోమన్ క్యాలెండర్లో ఫిబ్రవరి నెలకు 30 రోజులు, జులై నెలకు 31 రోజులు, ఆగస్టు నెలకు 29 రోజులు ఉండేలా నిర్ణయించారు. అయితే కొన్నాళ్లకు జూలియస్ ఆగస్టస్ చక్రవర్తి ఈ క్యాలెండర్లో మళ్లీ మార్పులు చేసి ఫిబ్రవరిలో 28 రోజులు ఆగస్టు నెలకు 31 రోజులు ఉండేట్లు మార్పులు చేయించారట. లీపు సంవత్సరంలో వచ్చే అదనపు రోజును ఫిబ్రవరి నెలలోనే కలిపారు. ఆ తర్వాత మళ్లీ కొంతకాలానికి కొన్ని మార్పులు చేసి గ్రెగొరియన్ క్యాలెండర్ని కని పెట్టారు. ఇదే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
****మూడేళ్లకొకటి…
* లీప్ అంటే దూకడం. ఆస్ట్రేలియన్ రాకెట్ ఫ్రాగ్ ఫిబ్రవరి 29కి చిహ్నం. ఈ కప్ప ఒకేసారి దాదాపు రెండు మీటర్ల పొడవు దూకేస్తుంది.
* నాలుగేళ్లకోసారి లీపు సంవత్సరం వస్తుంది కదా. కానీ ప్రతి 100 సంవత్సరాలకు లీపు సంవత్సరం రాదు. ఉదా: 2100, 2200. అయితే ప్రతి 400 సంవత్సరాలకు లీప్ ఇయర్ వస్తుంది. ఉదా: 2000, 2400
* ఫిబ్రవరి 29న పుట్టినవారిని లీప్లింగ్స్, లీపర్స్ అంటూ పిలిచేస్తారు.
* ఈ నెల 29న పుట్టిన వాళ్లు నాలుగేళ్లకోసారి పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉంటుంది కదా. అందుకే వారికి కొన్నిదేశాల్లో చట్టబద్ధంగా 28 నుంచి వయసు మారుతుంది. ఇంకొన్ని దేశాల్లో మార్చి ఒకటి నుంచి వయసు మారుతుంది.
* ఇంచుమించు 1500 మందిలో ఒకరు ఫిబ్రవరి 29న పుట్టే అవకాశం ఉంది.
* చైనీయుల క్యాలెండర్లో లీపు సంవత్సరం మూడేళ్లకోసారి వస్తుంది. ఎందుకంటే వాళ్లు చంద్ర సంవత్సరాన్ని లెక్కిస్తారు. చైనాకి కొత్త సంవత్సరం కూడా వేరుగానే ఉంటుంది.
* గ్రీసు వంటి దేశాల్లో లీపు సంవత్సరాన్ని దురదృష్టకరమైన రోజుగా భావిస్తారు. వివాహాలు చేసుకోరు.
* ఫిబ్రవరి 29న పుట్టినవారు ప్రత్యేకంగా క్లబ్లూ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో దేశదేశాల సభ్యులూ ఉంటారు.
* అమెరికా న్యూమెక్సికోలోని ఆంథోనీలో లీప్ ఇయర్ వేడుకలు ఘనంగా చేసుకుంటారు. ‘లీప్ ఇయర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్’ అని ఈ నగరానికి పేరు.
* లీపు సంవత్సరాన్నే ఇంటర్కాలరీ, బైసెక్స్టిల్ ఇయర్ అనీ పిలిచేస్తారు.