Kids

కోటి మందికి ప్రేరణగా

Telugu Kids Inspiring Stories-Be A Leader Not A Follower

కోటి మందిలో ఒకరుగా జీవించడానికి, కోటి మందికి ఒక్కరై జీవించడానికి మధ్య హస్తి మశకాంతరం ఉంది. భువిపై నడయాడిన కారణ జన్ములంతా జగతికి ప్రయోజనాన్ని, జాతికి ఆనందాన్ని కలిగించినవారే.
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమైనట్టు, కోటి అంకెల గణితమైనా ఒకటితోనే లెక్కించడం ప్రారంభించినట్టు గొప్ప కార్యాలను దైవీభూతులు ఒక్కరే ప్రారంభించి అనేకులకు చేర్చారు. ‘నిక్కమైన మంచి నీలమొక్కటి చాల’న్నట్టు, ఎందరికో అసాధ్యమైన కార్యాలను అవలీలగా సాధించి జాతి ఘనత చాటారు. ‘నూటికో కోటికో ఒక్కరు, ఎప్పుడో ఎక్కడో పుడతారన్నట్టు’ ఒక్కరే అనేకులకు సమానంగా ఎదిగి, విజేతలై నిలిచిన ఉదంతాలను చరిత్ర నిక్షిప్తం చేసింది. అర్ధశాస్త్రానికి కౌటిల్యుడు, కామసూత్రాలకు వాత్సాయనుడు, గణిత, ఖగోళ పరిశోధనలకు ఆర్యభట్టు, యోగ శాస్త్రానికి పతంజలి, ఆయుర్వేదానికి చరకుడు, జ్యోతిషానికి వరాహమిహిరుడు, పూర్ణాంశానికి భాస్కరాచార్యులు , నాట్య శాస్త్రానికి భరతముని పేర్లు ఠక్కున జ్ఞప్తికి రావడానికి వారి కృషి, అంకిత భావాలే కారణం. ‘ఆకాశంలో తారాలెన్నున్నా పగటి వెలుగుకు సూర్యుడు, రాత్రి వెన్నెలకు చంద్రుడు ఆధారమైనట్టు’, నేలపై నడయాడిన వారెందరున్నా స్వల్పకాలమే జీవించిన శంకరాచార్యుడు, వివేకానందుడు, శ్రీనివాస రామానుజన్లు గడించిన కీర్తి వెలుగులతో జగతి పులకించింది. మహనీయుల అడుగుజాడల్ని నిత్యం జాతి అనుసరిస్తున్నా ధర్మమార్గానికి బుద్ధుడు, సత్యాగ్రహానికి గాంధీజీ, మానవసేవకు మదర్ థెరీసాలు గుర్తు రావడానికి వారందించిన స్ఫూర్తి సందేశాలే కారణం. భగవద్గీత విభూతి యోగంలో శ్రీకృష్ణుడు “అక్షరాలలో అకారము, వేదాలలో సామవేదము, పురోహితులలో బృహస్పతి, మహర్షులలో భృగువు, వృక్షాలలో అశ్వత్థము, ఆయుధాలలో వజ్రాయుధము, పాడి ఆవులలో కామధేనువు తానేనంటూ” ప్రకటించడంలో ఉత్తమమైన ఒక్క అంశ చాలన్న’ భావం ఇమిడి ఉంది. “బలప్రయోగంతో చేయాల్సిన కార్యాలకు జనావసరం ఉండొచ్చు. బుద్ధితో చేయాల్సిన కార్యాలకు సమర్ధుడు ఒక్కరున్నా చాలన్నట్టు” సనాతన ధర్మశాస్త్రములో ప్రముఖమైన గ్రంథాలు ఒక్కరికే బోధించగా ప్రయోజనకరాలై జాతి వికాసానికి దారులు పరిచాయి. సంక్షేప రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు, ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి అగస్త్యుడు, పరీక్షిత్ మహారాజుకి విష్ణు లీలలతో కూడిన భాగవతాన్ని శుకబ్రహ్మ, అర్జునుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసిన భగవద్గీతను శ్రీకృష్ణుడు బోధించగా, అలరించి అలంకరించిన హృదయ సీమ లెన్నో. శ్రోత యొక్క అవసరాన్ని, సామర్ధ్యాన్ని గుర్తించి ఒక్కరికే బోధించినా యావత్ప్రపంచానికి మార్గదర్శకాలై , మరపురాని రీతిన నిలిచాయి. ధ్రువతారలుగా నిలిచిన మహాపురుషు లందించిన స్ఫూర్తితో ఉత్తమ ప్రవర్తన అలవరచుకుని జన్మకు సార్ధకత, జగతికి ప్రయోజనం కలిగేలా ప్రయత్నించాలి మానవులు .