Kids

అతి తెలివి ప్రదర్శించవద్దు

Telugu Kids Stories-Do Not Act Over Smart

మిట్టమధ్యాహ్నం వరకు పొలం దున్నిన సీతన్న అన్నం తిందామని చెట్టు నీడకు వచ్చాడు. కాళ్లు కడుక్కోడానికి పక్కనే ఉన్న బావి నుంచి నీళ్లు తోడేసరికి ‘దాహానికి కాస్త నీళ్లు పోస్తావా నాయనా?’ అనే మాట వినిపించింది. ఎవరో సాధువు ఎండలో నడిచి వస్తున్నాడు. సీతన్న ఆ సాధువుకి నీళ్లు అందించి ‘సామీ… ఎక్కడికి వెళ్తున్నారు? ఎండలో ఈ నడకేమిటి?’ అని అడిగాడు.

‘కంచికామాక్షి దర్శనానికి వెళ్తున్నాను. కాలి నడకన వెళ్లడం నాకు అలవాటే’ అన్నాడా సాధువు.

సీతన్న చెట్టుకింద గడ్డీగాదం తుడిచి తన తలకి కట్టుకున్న తుండు గుడ్డ పరిచి సాధువుని కూర్చోమన్నాడు.

సాధువు సేదతీరగానే సీతన్న సద్దిమూట విప్పుతూ ‘మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడా ఎంగిలి పడ్డట్టు లేదు. నా భార్య రాగి ముద్ద, జొన్నరొట్టెలు కట్టింది. రొట్టెలు మీరు తినండి’ అంటూ సాధువుకి అందించాడు.

సాధువు అవి తింటూ సీతన్న పొలం కేసి చూసి

‘అదేంటి నీ పొలంలో కాడికి ఒక ఎద్దే కట్టి ఉంది? రెండోది ఏదీ?’ అని అడిగాడు.

సీతన్న నిట్టూర్చి ‘నాకున్న రెండెద్దుల్లో, ఒకదాన్ని మా అమ్మ వైద్యానికి అమ్మాల్సి వచ్చింది. ఉన్న ఒక్క ఎద్దుతో కలిసి కాడి రెండో వైపు నేనే మోస్తున్నా. మెడ చూడండి ఎలా వాచిపోయిందో?’ అన్నాడు.

రొట్టెలు తిని వెళ్లిపోతూ సాధువు ‘అడక్కుండానే ఆకలి తీర్చే వాడి బాధలు అట్టే ఎక్కువ కాలం ఉండవు.’ అనేసి వెళ్లిపోయాడు.

రాగిముద్ద తిని చేతులు కడుక్కుని, తుండు తీసి తలకు చుట్టుకుని పొలంలోకి వెళ్లిన సీతన్న ఆశ్చర్యానికి అంతేలేదు. అక్కడ కాడికి రెండు ఎడ్లు కట్టి ఉన్నాయి. తన మెడ మీద వాపు లేనే లేదు. ‘అంతా సాధువు మహిమ’ అనుకున్నాడు సీతన్న.

ఇంతలో పక్క పొలం వీరన్న వచ్చి ‘పొద్దున కాడి పట్టిన వాడివి. మధ్యాహ్నానికి ఎడ్లు కట్టావే. ఏంటి కథ?’ అని అడిగాడు. సీతన్న జరిగిందంతా చెప్పాడు. వీరన్న ఈర్ష్యతో కుతకుతలాడిపోయాడు.

అప్పట్నుంచి వీరన్న ఆ సాధువు తిరిగి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూడసాగాడు. ఓ పదిరోజులు గడిచాక దూరంగా ఓ సాధువు వస్తూ వీరన్నకి కనిపించాడు. తన పంట పండిందనుకున్న వీరన్న వెంటనే పొలంలో రెండెడ్లనూ పొదల మాటున కట్టేసి, పరుగుపరుగున సాధువు దగ్గరకి వెళ్లి ‘కంచి కామాక్షి దగ్గరకి వెళ్లి వస్తున్నది మీరేనా?’ అన్నాడు. ఆ సాధువు అవునన్నాడు.

‘అయితే రండి సామీ! బావిలో నీరు తోడతా… దాహం తీర్చుకోండి’ అన్నాడు.

‘నాకు దాహంగా లేదు నాయనా’ అన్నాడా సాధువు ఆశ్చర్యపోతూ.

‘భలే వారే… అలా అంటే కుదరదు. భోజనం కూడా చేయాల్సిందే’ అన్నాడు వీరన్న ఆత్రుతగా.

‘నేను ఇప్పుడే ఒకరింట్లో భోజనం చేశాను నాయనా… భుక్తాయాసంగా కూడా ఉంది’ అన్నాడు సాధువు.

‘ఆ సీతన్నకి మించి ఆతిథ్యం ఇస్తా సామీ. మీరిలా కూర్చోండి చెబుతాను’ అంటూ వీరన్న, వద్దంటున్నా వినకుండా సాధువు ముందు మంచి నీళ్లు, భోజనం పెట్టాడు. అంతా అర్థమైన సాధువు అవేమీ ముట్టకుండా ‘సీతన్న ఈ రోజు పొలానికి రాలేదా?’ అని అడిగాడు. ‘రాలేదు సామీ వాడొట్టి అబద్ధాల కోరు. మీకు ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పాడు. వాడి కన్నా నా పరిస్థితి ఇంకా ఘోరం. నా పొలం కేసి చూడండి. ఎడ్లు లేకపోయినా నేనే లాగి దున్నుతున్నా. నడుం వంగిపోతోందంటే నమ్మండి. మీరివాళ నా భోజనం తిని నన్ను దీవించాల్సిందే’ అంటూ ఏకరువు పెట్టాడు.

సాధువు ‘వద్దన్నా పెట్టే వాడిని ఆ విధి చూడకుండా ఉంటుందా?’ అనేసి లేచి వెళ్లిపోయాడు.

సాధువు వెళ్లగానే ‘తినకపోతే మానె… దీవించాడు అంతే చాలు. రెండెడ్లకి తోడు మరో రెండొస్తే వాటిని అమ్మి సొమ్ము చేసుకోనూ?’ అనుకుంటూ పొదల చాటుకి పరిగెత్తాడు.

అక్కడ ఎడ్లు లేవు సరికదా…ఇంతలో వీరన్న నడుమూ వంగిపోయింది!