WorldWonders

కళ్యాణంలో కోడికూర కొట్లాట

People Fight Over Chicken Curry In Srikakulam

పెళ్లి విందులో చికెన్‌ కూర కోసం ప్రారంభమైన తగాదా చినికి చినికి గాలివానలా మారి కేసుల నమోదు వరకు దారి తీసిన సంఘటన సారవకోటలో బుధవారం చోటు చేసుకుంది. సారవకోట ఎస్‌ఐ తెలియజేసిన వివరాల మేరకు..శ్రీకాకుళం జిల్లా సారవకోట రెల్లి వీధికి చెందిన సురేష్‌తో బూర్జ మండలం ఉప్పెనవలస గ్రామానికి చెందిన యువతితో వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. వివాహ వేడుకలో భాగంగా సారవకోట లోని వరుడు ఇంటి వద్ద మధ్యాహ్నం విందు భోజనం జరిగింది. విందు భోజన సమయంలో చికెన్‌ కూర ఎక్కువగా వేయాలని పెళ్లి కుమార్తె తరపు నుంచి వచ్చిన గన్నిరాజు కోరారు. అప్పటికే కూర తక్కువగా ఉండటంతో పళ్లెంలో ఉన్న కూర తిన్న తరువాత ఇంకా ఇస్తానని వడ్డిస్తున్న ప్రకాష్‌ తెలియజేశారు. కూర వేయలేదనే అక్కసుతో గన్నిరాజు తింటున్న పళ్లాన్ని ప్రకాష్‌ ముఖంపై విసిరాడు. దీంతో తగాదా ప్రారంభమైంది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రెల్లివీధి వెళ్లి కొందరిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. పెళ్లి కుమార్తె తరపున వచ్చిన వారినే పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడమేమిటని పెళ్లి కుమార్తె తరపున వచ్చిన వారందరూ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ నేపధ్యంలో వరుడు తరపున కొందరు పోలీస్‌ స్టేషన్‌కు రావడంతో మాటల యుద్ధం ప్రారంభమై ఒకరికి ఒకరు కొట్టు కొని చివరకు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి విషమించే పరిస్థితికి చేరడంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు. అప్రమత్తమైన ఎస్‌ఐ వై.రవికుమార్‌ ఇరువర్గాలతో మాట్లాడి తగాదాను సద్దుమణిగించారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.
స్వల్ప గాయాలు: పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. తవ్వకం పనుల వల్ల రాళ్లు ఉండటంతో వాటిని పెళ్లివారు విసురుకున్నారు. సంఘటనలో గన్నిరాజు తో పాటు పలువురికి గాయాలయ్యాయి.

యథావిధిగా వివాహం : వివాహ విందు సమయంలో తగాదా జరిగినప్పటికీ యథావిధిగా వివాహం జరిపించినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు