Editorials

భయంకరమైన రణగొణ ధ్వనికి కేరాఫ్ అడ్రస్…భాగ్యనగరి

Hyderabad ranked no.1 in sound pollution

రోడ్డుపై రెడ్‌ సిగ్నల్‌ పడిన వెంటనే ఎక్కడివారు అక్కడ ఆగిపోతారు. ఇక గ్రీన్‌ సిగ్నల్‌ పడితే చాలు.. వాహనాలను పోనీయమంటూ వెనుక ఉన్న వాళ్లు ఆపకుండా హారన్లు కొడుతూనే ఉంటారు. హారన్ల వల్ల విడుదలయ్యే భరించలేని శబ్దకాలుష్యానికి విరుగుడుగా ముంబయి పోలీసు శాఖ ‘హాంక్‌ మోర్‌.. వెయిట్‌ మోర్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని వల్ల సిగ్నళ్ల వద్ద వాహనాల హారన్లు అధికమయ్యే కొద్దీ … వారు వేచి ఉండాల్సిన సమయం మరింత పెరుగుతుంది. వినటానికి వింతగా ఉన్నా అక్కడి శబ్ద కాలుష్య తీవ్రతను ఈ చర్య సూచిస్తోంది. కేంద్ర కాలుష్య నివారణ మండలి దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఉన్న శబ్ద స్థాయిలపై ఒక సర్వే నిర్వహించింది. దీనిలో 2018 చివరి వరకూ అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక శబ్దకాలుష్య నగరంగా హైదరాబాద్‌ టాప్‌లో నిలిచింది. ఇక్కడ శబ్దకాలుష్యం 79 డెసిబల్స్‌గా నమోదైంది. ముఖ్యంగా పారడైజ్‌ జంక్షన్‌లో అత్యధిక శబ్దకాలుష్యం వెలువడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత చెన్నైలో పగటి పూట ధ్వనుల స్థాయి 67.8 డెసిబల్స్‌గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో సగటు శబ్ద స్థాయి 61 డెసిబల్స్‌గా ఉంది. నగరాల్లో సాధారణంగానే ఉండే రణగొణ ధ్వనులకు తోడు వాహనాల హారన్లు శబ్ద కాలుష్యానికి మరింత దోహదం చేస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రజలకు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పరిమితికి మించిన శబ్దకాలుష్యానికి లోనవటం అనేక అనర్థాలకు దారి తీస్తుంది. ఇది నిద్రపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడిని పెంచుతుంది. పిల్లల్లో తెలివితేటల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా హృదయ సంబంధ సమస్యలకూ దారి తీయవచ్చు.