Agriculture

వరిలో కలుపు నివారణ చిట్కాలు

Telugu Agriculture News-How To Remove Weeds In Paddy Fields

ఇప్పటికే నాటిన వరి పొలంలో కలుపు యాజమాన్యంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇస్తున్న సూచనలు…
ప్రధాన పొలంలో కలుపు నివారణకు నాట్లు వేసిన 3-5 రోజుల లోపు తేలికగా నీరు పెట్టి, 25 కిలోల పొడి ఇసుకలో ఎకరానికి 1.5 లీటర్లు బుటాక్లోర్‌/ 500 మి.లీ. ప్రిటిలాక్లోర్‌/ ఆక్సాడయర్జిల్‌ 35-50 గ్రా./ బెన్‌ సల్ఫ్యూరాన్‌ మిథైల్‌ + పిటలాక్లోర్‌ గుళికలు నాలుగు కిలోలు చొప్పున సమానంగా పడేలా చల్లాలి. కలుపు మందు వేసినపుడు తేలికగా నీరు ఉండేటట్లు, నీరు నిలబెట్టాలి.
*ఊడ్చిన 15-20 రోజులకు గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువ ఉంటే సైహలోఫాప్‌ బ్యుటైల్‌ 10% ద్రావకం 2 మి.లీ. ఒక లీటరు నీటికి లేదా బిస్పైరిబాక్‌ సోడియం 10% ద్రావకం లీటరు నీటికి 0.4 మి.లీ. చొప్పున ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలుంటే నాటిన 20-25 రోజులలోపు ఎకరానికి 400 గ్రా. 2,4 డి. సోడియం సాల్ట్‌ 80% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి, పిచికారీ చేయాలి.
**వెదజల్లు పద్ధతిలో :
కలుపు నివారణకు విత్తిన 3-5 రోజుల మధ్య ఎకరానికి ఆక్సాడయర్జిల్‌ 35 గ్రా. 25 కిలోల పొడి ఇసుకతో కలిపి, సమానంగా పడేలా చల్లాలి. విత్తిన 8-10 రోజుల మధ్య ఎకరానికి పైరాజోసల్ప్యురాన్‌ ఇథైల్‌ లీటరు నీటికి 80 గ్రా. లేదా ఇథాక్సి సల్ఫ్యురాన్‌ 40 గ్రా. మందును 200 లీటర్ల నీటితో కలిపి, పొలంలో పిచికారీ చేయాలి.
*విత్తిన 20 రోజులకు ఎకరానికి సైహలోఫాప్‌ బ్యుటైల్‌ 10% ద్రావకం, 400 మి.లీ లేదా బిస్పైరిబాక్‌ సోడియం 10% ద్రావకం 100 మి.లీ. చొప్పున ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.
వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలుంటే విత్తిన 20-25 రోజులలోపు ఎకరానికి 400 గ్రా. 2,4 డి. సోడియం సాల్ట్‌ 80% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి, పిచికారీ చేయాలి.
**జింకు లోప నివారణ :
దాళ్వాలో చలి ఎక్కువగా ఉండటం వల్ల జింకు మొక్కకు అందుబాటులో ఉండదు. నారుమడిలో ఆకులు మీద తుప్పు మచ్చలు కనిపిస్తే జింకు లోపంగా గుర్తించి, లీటరు 2 గ్రా. జింకు సల్ఫేట్‌ ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
*ప్రధాన పొలంలో ఎకరానికి 20 కిలోలు జింకు సల్ఫేట్‌ ఆఖరి దమ్ములో వేసుకోవాలి. సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, జింక్‌ సల్ఫేట్‌ కలిపి వేయరాదు. ఈ రెండింటికి మధ్య కనీసం 24 గంటల వ్యవధి ఉండాలి.
*ప్రధాన పొలంలో ఆకు ఈనెల మీద తుప్పు మచ్చలు ఉండి, మొక్క గిడసబారిపోయి, ఎరువులు వేసినా ఎదగక పోయినపుడు.. జింకు లోపంగా నిర్ధారించుకోవాలి. 2 గ్రా. జింకు సల్ఫేట్‌ 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.