జంటగా ఉన్న క్రౌంచ పక్షుల్లో ఒకదాన్ని వేటగాడు బాణంతో నేలకూల్చాడు. విలవిల్లాడుతూ ప్రాణం విడిచిందా పక్షి. తమసా నదిలో స్నానం చేసి శిష్యుడు భరద్వాజుడితో ఆశ్రమానికి తిరిగివస్తుండగా ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి మహర్షి హృదయం తల్లడిల్లింది. మహర్షి హృదయ విషాద స్పందనగా శ్లోకం వెలువడింది. అది శ్రీమద్రామాయణ మహా రచనకు బీజరూపమైంది.
శరీరంలోని ప్రతి అణువుకు స్పందించే గుణం ఉంది. అన్ని స్పందనలూ ఒకేతీరుగా ఉండవు. హృదయస్పందనల ప్రభావం శరీరం, మనసులపై ఉంటుంది. శరీరం ఒక సజీవ దేవాలయమైతే, హృదయం గర్భాలయం లాంటిది.
బాహ్యాంతరాల్లోని దృశ్య శ్రవణాదులకు అనుగుణంగా హృదయం స్పందిస్తుంది. మనోవాక్కాయ కర్మలకు మూలహేతువు స్పందనే.
స్పందించే గుణం ఓ ఉత్ప్రేరకం. అది మనసును సువ్యవస్థీకృతంగా ఉంచుతుంది. ధ్యానం, జపం, అర్చనలు, పూజలు, ఉత్సవ సంప్రదాయాల నిర్వహణ, వీక్షణ, నామస్మరణ వంటివాటివల్ల కలిగే స్పందనలు భగవత్ తత్వాన్ని తెలుసుకొనేలా చేస్తాయి. యోగులకు, ధ్యానులకు, సాధకులకు ఏకాగ్రత ప్రసాదిస్తాయి. హృదయకోశంలో కాంతిక్షేత్రాన్ని ఆవిష్కరింపజేస్తాయి.
అనంతమైన ప్రకృతి నిరంతరం స్పందనలకు గురవుతూనే ఉంటుంది. విశ్వంలోని గ్రహరాశుల గమనప్రభావం జీవరాశిపై స్పందన కలగజేస్తుందని విజ్ఞానశాస్త్రాలు చెబుతున్నాయి.
వెన్నెలకు ప్రకృతి పరవశిస్తుంది. చలువరాత్రిళ్లకు స్పందించని హృదయం ఉండదు. వాన మబ్బులను చూసి నెమలి పురివిప్పి నాట్యమాడుతుంది. వాన చినుకుతో పుడమి పులకరిస్తుంది. చైత్రంలో మావిచివుళ్లు తినే కోయిలమ్మ గళాల స్పందన మధురాతిమధురం.
శబ్దం నుంచి నాదం ఆవిర్భవించింది. శ్రావ్యమైన నాదం ఎంతో మనోహరమైన స్పందననను ఇస్తుంది. మనసును పులకింపజేస్తుంది. శరీర అలసటను సేదదీరుస్తుంది.
చేలగట్లమీద చెట్టుకొమ్మకు వేలాడే గుడ్డ ఉయ్యాల్లోని పసిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తుంది. పక్కనే పనిపాటల్లో మునిగిపోయిన తల్లి అక్కడినుంచే జోలపాట అందుకుంటుంది. ఆ పాటలోని మంద్ర, మధ్యమ, తారస్థాయులు, గాలితరంగాల్లో కలిసి బిడ్డ కర్ణపుటాలను తాకుతాయి. బిడ్డ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. స్పందన, ప్రతిస్పందనలకు ఇదొక అద్భుత నిదర్శనం.
స్వరభరితమైన సంగీతం తన్మయులను చేస్తుంది. ప్రాతఃకాలంలోని రాగాలు ప్రశాంతచిత్తాన్ని, బుద్ధివికాసాన్ని పెంచుతాయి. మధ్యాహ్న రాగాలు ఉదరకోశ వ్యాధులను తమ స్పందనలతో ఉపశమింపజేస్తాయి. సాయంకాల రాగాలు హృదయకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రాత్రివేళల్లోని రాగాలు ఆయుర్‌వృద్ధిని ఇస్తాయని సంగీతశాస్త్రాలు చెబుతున్నాయి.
మనిషికి ఆహారపానీయాలు మాత్రమే అవసరాలు కావు. స్పందించే హృదయం ఉండాలి. స్పందనకు ప్రతిస్పందించే స్వభావం ఉండాలి. స్పందించే హృదయం జీవితాన్ని ఫలవంతం చేసుకుంటుంది. మనిషి అంతరంగంలోని ద్వేషభావాలు, ఈర్ష్యఅసూయలు, కామక్రోధాదులవల్ల హృదిలో రగిలే విపరీత స్పందనలు జీవితాలను కల్లోలితం చేస్తాయి. ఏ హృదయం అలజడులకు, ఆందోళనలకు గురికాకూడదు.
సమదృష్టి, సమభావన, సజ్జన సాధుసాంగత్యం సత్వగుణాన్ని పెంచుతాయి. హృదయం సద్భావనలకు నిలయం కావాలి. గర్వాహంకారాల ఇనుపతెరలు తొలగాలి. మనిషి సదా జాగరూకుడై మెలగాలి. అప్పుడు జీవనగమనం ఒడుదొడుకులు లేకుండా సుస్పందనల సమాహారంగా సాగుతుంది.