DailyDose

తెదేపా దావాలకు మేము బెదిరేది లేదు-తాజావార్తలు

We are not afraid of TDP's lawsuits says Botsa-Telugu Breaking News Roundup Today

* తెదేపా అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో రూ.2వేల కోట్ల నగదు దొరికిందని తాము అనలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పన్ను ఎగవేత, అక్రమాలకు సంబంధించిన పత్రాలు దొరికాయని చెప్పామన్నారు. ఇదే విషయాన్ని ఐటీ అధికారులు చెప్పారని.. ఈ మేరకు ఆ పత్రాలను సీజ్‌ చేశారన్నారు. తెదేపా నేతలు పరువునష్టం దావా వేస్తామంటే భయపడే వారెవరూ లేరని ఆయన వ్యాఖ్యానించారు.

* ఇటీవల ఐటీ దాడులు జరిగిన 3 ఇన్‌ఫ్రా కంపెనీల గురించి మంత్రి బొత్సతో పాటు ఇతర మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. రాజకీయాల్లో తనకంటే జూనియర్‌ అయిన సీఎం జగన్‌ ముందు బొత్స చేతులు కట్టుకుని అవమానంతో ఉండే కంటే ధైర్యంగా నిజాలు మాట్లాడాలని వ్యాఖ్యానించారు. విశాఖలోని వెంకోజీపాలెం జ్ఞానానంద ఆశ్రమంపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కన్ను పడిందని దేవినేని ఆరోపించారు.

* కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. అధికార తెరాస అండదండలతోనే ఎంఐఎం పార్టీ అల్లర్లు సృష్టిస్తోందని విమర్శించారు. మతఘర్షణలు సృష్టించిన ఘనత మజ్లిస్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. గల్లీలకు పరిమితమైన మజ్లిస్‌ పార్టీ అల్లర్లను భైంసా వరకు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆరోపించారు.

* పన్నుల్లో రాష్ట్రాలకు వాటాను 42 నుంచి 41 శాతానికి తగ్గింపు నిర్ణయం పూర్తిగా తమది కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నడుచుకుంటున్నామని చెప్పారు. పన్ను వసూళ్లు, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ మెరుగ్గా ఉందని…కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయంలో రాష్ట్ర వాటా అధికంగానే ఉందని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో సామరస్యంగా ఉండటమే ఎన్డీయే ప్రభుత్వ విధానమన్నారు.

* భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మోదీ దాదాపు ₹1254కోట్ల వ్యయంతో ఇక్కడ చేపట్టనున్న 50 ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశ ప్రయోజనాల కోసమే ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. ఆ విషయంలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తాము తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

* సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సామజవరగమన’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది. ‘సామజవరగమన’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోన్న నేపథ్యంలో తాజాగా ఆ పాటకు సంబంధించిన సాంగ్‌ ఫుల్‌ వీడియోను ఆదివారం చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. పారిస్‌లో చిత్రీకరించిన ఈ వీడియో సాంగ్‌లో బన్నీ స్టైల్‌.. పూజా హెగ్డే అందం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి.

* ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మూలంగా రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కొందరి స్వార్థం వల్లే అధికారానికి దూరమయ్యామని, భవిష్యత్‌లో రాష్ట్రంలో ఒంటరి పోరుకు సిద్ధమవ్వాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇకపై మహారాష్ట్రలో జరగబోయే భవిష్యత్‌ ఎన్నికలన్నింట్లోనూ ఒంటరిగానే పోటీచేస్తామన్నారు.

* ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు ‘మొబైల్స్‌ బొనాంజా’ పేరిట సేల్‌ను ప్రకటించింది. ఇందులో మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. మరికొన్ని మొబైల్స్‌ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు అందనున్నాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

* పోలీసుల నుంచి అనుమతి లభించాక కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తామని షహీన్‌బాగ్‌ నిరసనకారులు తెలిపారు. ఆదివారం షా నివాసానికి వెళ్లేందుకు ర్యాలీగా బయల్దేరగా.. అనుమతి లేని కారణంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు తమ నిరసన శిబిరానికి వెనుదిరిగారు. నిరసనకారుల మార్చ్‌ ఉండడంతో అప్పటికే మోహరించిన పోలీసులు బారికేడ్లను అడ్డుగా పెట్టారు.

* పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఆడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఆటగాడు, దక్షిణాఫ్రికా పేస్ దళపతి డేల్‌ స్టెయిన్‌ అన్నాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆదివారం ట్విటర్‌లో ఒక వీడియో పోస్టు చేశాడు. పీఎస్‌ఎల్లో రెండుసార్లు ఛాంపియన్‌ అయిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ తరఫున స్టెయిన్‌ ఆడనున్నాడు.

* తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఆయా అంశాలపై చర్చించిన అనంతరం వాటికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రభుత్వ విధానాన్ని కేసీఆర్‌ వెల్లడించనున్నట్లు తెలిసింది.

* అమరావతి ఆందోళనల నేపథ్యంలో విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల జరిగే శుభకార్యాలూ నిరసన వేదికలుగా మారుతున్నాయి. ఎక్కడ ఏ వేడుక జరిగినా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మొన్నటికిమొన్న ఓ పెళ్లి వేడుకలో వధూవరులిద్దరూ వివాహ సమయంలో ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు’ అని ప్లకార్డులతో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇదే తరహాలో విజయవాడలో ఓ కుటుంబం ఏర్పాటు చేసిన వేడుకలో అతిథులు తమదైన రీతిలో నిరసన తెలియజేశారు.

* ఇటీవల పలువురు వ్యాపారవేత్తలపై జరిగిన ఐటీ దాడులను తెదేపాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. దాడులు ఎవరిపై జరిగాయో వారికే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా సీఎం జగన్‌ పోలవరం పనులు కట్టబెట్టారని..దీనిబట్టి చూస్తే ఎవరేంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు.. సీఎం జగన్‌ను త్వరలో ఇంటర్‌పోల్‌ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.

* మెట్రో రైలు వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ మెట్రో ప్రారంభోత్సవంలో పాటించాల్సిన ప్రొటోకాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిందన్నారు. మెట్రో వ్యవహారంలో విషయాలు సరిగా తెలుసుకొని.. హుందాగా ప్రవర్తిస్తే మంచిదని కిషన్‌రెడ్డికి కర్నె హితవు పలికారు.

* దిల్లీని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అరవింద్ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రచారంలో భాగంగా తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రత్యర్థుల్ని క్షమించేస్తున్నామన్నారు. దిల్లీ అభివృద్ధికి ఇదే వేదికపై నుంచి ప్రధాని మోదీ ఆశీస్సులు కోరుతున్నానన్నారు. ప్రమాణస్వీకారానికి మోదీని ఆహ్వానించామని.. ఆయన వేరే పనుల్లో తీరిక లేకుండా ఉన్నట్లున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా మూడోసారి ఆదివారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు.

* ఐపీఎల్‌ 13వ సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది. వివరాలను ఐపీఎల్‌ నిర్వాహకులు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గతేడాది ఫైనల్‌కు చేరిన ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మార్చి 29న వాంఖడేలో తొలి మ్యాచ్‌ జరగనుంది. రెండో మ్యాచ్‌ 30న దిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ Xఈ పంజాబ్‌ జట్ల మధ్య, 31న రాయల్‌ ఛాలెంజర్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరగనుంది. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి మ్యాచ్‌ ముంబయి ఇండియన్స్‌తో ఏప్రిల్‌ 1న ఆడనుంది.

* బాధ్యతలను, నిర్వహణ వంటి కీలక అంశాలను దృష్టిలోపెట్టుకొనే బడ్జెట్‌ తయారు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌బీఎం(ఫైనాన్షియల్‌ రెస్పాన్స్‌బిలిటీస్‌, బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) అంశాలను దృష్టిలోపెట్టుకొనే దీనిని తయారు చేశామన్నారు. తనను అత్యధిక సేపు బడ్జెట్‌ చదవిన ఆర్థిక మంత్రిగా కంటే అత్యధిక కాలం బడ్జెట్‌ను ప్రిపేర్‌ చేసిన ఆర్థిక మంత్రిగా గుర్తుంచుకోవాలన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఎక్కడా తాము దాటలేదన్నారు.

* దిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై వర్సిటీలోనే పోలీసులు లాఠీఛార్జీ చేసిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కర్రలతో కొడుతున్న దశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. వీటిని జామియా సమన్వయ సమితి విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత ఏడాది డిసెంబరులో వర్సిటీలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

* కరోనా(కొవిడ్‌-19) వైరస్‌ ప్రభావం భారత వ్యాపార రంగంపై కూడా పడనుంది. ఈ ప్రభావం వచ్చే 15రోజుల్లో కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్లు, ఫ్యూచర్‌ ఫోన్ల విడిభాగాల ధరలు పెరగనున్నాయి. ఫీచర్‌ ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని మెగ్‌అజ్‌ మొబైల్స్‌ సంస్థ సీఈవో నిఖిల్‌ చోప్రా తెలిపారు.

* దేశాల సరిహద్దులకు సంబంధించి గూగుల్‌ మ్యాప్స్‌ కొత్తగా తీసుకొచ్చిన మార్పులు వివాదాస్పదంగా మారాయి. కశ్మీర్‌ సరిహద్దు విషయంలోనూ ఆ మార్పులు కనిపించాయి. మన దేశం నుంచి చూసినప్పుడు భారత్‌లో కశ్మీర్‌ అంతర్భాగంగానే కనిపించినా…..పాక్‌ నుంచి చూసినప్పుడు మాత్రం వివాదాస్పద సరిహద్దును సూచించే డాట్ లైన్‌తో సూచిస్తోంది.