Movies

జాతీయ పురస్కారం తెచ్చుకున్నా…

A glimpse into the life story of Sada in movie industry

వెళ్లవయ్యా వెళ్లూ… అంటూ తన తొలి సినిమా ‘జయం’తోనే బోలెడంత సందడి చేసింది సదా. ఆ సందడి కుర్రాళ్లకి భలే నచ్చేసింది. అందులోని ‘రాను రానంటూనే చిన్నదో…’ అనే పాట విశేష ప్రాచుర్యం పొందింది. ఈ పాటతో పాటు… వెళ్లవయ్యా వెళ్లూ… అనే సంభాషణ కొన్నాళ్లపాటు జనం నోళ్లలో నానింది. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో సదాకి అవకాశాలు వెల్లువెత్తాయి. మరుసటి యేడాదే ఎన్టీఆర్‌తో కలిసి ‘నాగ’లో నటించే అవకాశం అందుకొంది. అల్లరి నరేష్‌తో కలిసి ‘ప్రాణం’లో నటించింది. మరోపక్క ‘జయం’ రీమేక్‌తో తమిళంలోకీ అడుగుపెట్టి విజయాన్ని సొంతం చేసుకొంది. ‘మోనాలీసా’ అనే చిత్రంతో కన్నడలోకీ అడుగుపెట్టింది. అలా ఆమె దక్షిణాది భాషలన్నింటిలోనూ అవకాశాలు అందుకొని, ‘లవ్‌ కిచిడీ’ చిత్రంతో హిందీలోనూ మెరిసింది. విక్రమ్‌తో కలిసి నటించిన ‘అపరిచితుడు’ చిత్రంతో ఆమెకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆ తర్వాత మరిన్ని అవకాశాలు దక్కినప్పటికీ ‘అపరిచితుడు’ స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. 2014లో ‘యమలీల2’లో ఒక ప్రత్యేకపాత్రలో సందడి చేశాక ఆమె మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ బుల్లితెరపై రియాలిటీ షోలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ గ్లామర్‌ రంగంలో కొనసాగుతున్నారు. ఈ రోజు సదా పుట్టినరోజు.