Sports

సాధించాల్సింది చాలా ఉంది

Chateswar Pujara On Being Compared To Dravid

టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌తో పోల్చడం తనకు పెద్ద గౌరవమే అయినా అది సరైన పోలిక కాదని టెస్టు బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. ఇండియాటుడే ఇన్‌స్పిరేషన్‌ కార్యక్రమంలో మాట్లాడిన పుజారా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టెస్టు క్రికెట్‌లో దిగ్గజ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో పోల్చడం గొప్పగా ఉన్నా అది సరైన పోలిక కాదు. నా జీవితంలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అన్ని ఫార్మాట్లు ఆడిన ద్రవిడ్‌ లాంటి వ్యక్తి వన్డేల్లో, టెస్టుల్లో పదివేలకు పైగా పరుగులు సాధించాడు. కాబట్టి నేను సాధించాల్సింది చాలా ఉంది. నేనింకా నేర్చుకుంటూనే ఉన్నా. ప్రస్తుతం అతడి వద్ద నుంచి సలహాలు స్వీకరించే స్థితిలో ఉన్నా. అదృష్టం కొద్ది ద్రవిడ్‌ భాయ్‌ ఎప్పుడూ నాకు అందుబాటులోనే ఉన్నాడు’ అని పేర్కొన్నాడు. రాహుల్‌ భాయ్‌ని తొలిసారి రంజీ సమయంలో కలిశాను. అతను టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు రాజ్‌కోట్‌కు వచ్చారు. అప్పుడే తొలిసారి కలిసి మాట్లాడాను. అప్పుడు ద్రవిడ్‌ చాలా సౌమ్యంగా ఉన్నాడు. అప్పటికీ నేను ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడలేదు. రంజీ ఆటగాడి నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎలా మారాలనేదానిపైనే తొలిసారి మాట్లాడా. తర్వాత నేను జట్టులోకి వచ్చాక ఇప్పుడేం చేయాలని అడిగాను. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగే అంశంపై అతనికి అమితమైన పరిజ్ఞానం ఉంది. నేను వరుస వైఫల్యాలతో సతమతమౌతున్నప్పుడు విలువైన సూచనలు చేశాడు. నాలో మంచి నైపుణ్యం ఉందని చెప్పాడు. నాకు సరైన అవకాశాలొస్తాయని చెప్పాడు. చివరికి అలాగే జరిగింది. అలాగే నా ఆటలో పెద్ద మార్పులేవీ చేసుకోవద్దని, కొన్ని అంశాల్లో చిన్నపాటి మెళకువలు సరిచేసుకుంటే సరిపోతుందని తెలిపాడు’ అని పుజారా.. రాహుల్‌ ద్రవిడ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.