DailyDose

తెలంగాణాకు నిధులు ఇస్తాము-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Nirmala Says Telangana Funds Will Be Released Soon

* 2020-21కు సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాదాపూర్‌లోని హోటల్ ట్రైడెంట్ లో బడ్జెట్ పై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామన్‌ మాట్లాడుతూ.. ‘బడ్జెట్ ప్రవేశపెట్టిన‌ తర్వాత ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరుతో పాటు అన్ని నగరాల్లో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసి వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల్ని కలవడం మొదలుపెట్టాం. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ప్రకారమే తెలంగాణకు నిధులు కేటాయించాం. ఏ ఒక్క రాష్ట్రాన్ని తగ్గించి‌ చూడాలన్నది మా ఉద్దేశం కాదు. మనం సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం.. మోదీ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లానే తెలంగాణతో కూడా కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులు తగ్గించాలా, పెంచాలా అనేది రాష్ట్రాల పనితీరుపై ఆధారపడి‌ ఉంటుంది.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా ఈ నెల 24,25న భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన టూర్‌పై దేశీ కార్పొరేట్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ‘మినీ’ వాణిజ్య ఒప్పందం కుదరగలదని, అమెరికా కంపెనీలు మరింత పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా ఒక చిన్న పాటి వాణిజ్య ఒప్పందమైనా కుదిరితే తదుపరి సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు పునాదిలాగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నట్లు దేశీ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ చెప్పారు. ఇరు దేశాల వాణిజ్య వర్గాలు దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయని అసోచాం సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వస్తున్న ట్రంప్‌.. ఈ సందర్భంగా రౌండ్‌ టేబుల్‌ సదస్సులో పలువురు కార్పొరేట్‌ దిగ్గజాలతో భేటీ కానున్నారు. అమెరికన్‌ దిగ్గజ సంస్థలు, భారత ప్రభుత్వ సీనియర్‌ అధికారులతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ, భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఏఎం నాయక్, బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా తదితరులు ఇందులో పాల్గొనున్నారు.

* భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌(బీపీఎస్‌ఎల్‌)ని రూ. 19,700 కోట్లకు చేజిక్కించుకునేందుకు జేఎస్‌డబ్ల్యూకు నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ నుంచి రక్షణ కల్పించింది. బీపీఎస్‌ఎల్‌ మాజీ ప్రమోటర్లు చేసిన అక్రమాలతో జేఎస్‌డబ్ల్యూకు సంబంధం లేదని అభిప్రాయపడింది. అయితే, అక్రమ నగదు చెలామణి కింద కేసులు నమోదైన ప్రమోటర్లపై మాత్రం విచారణ కొనసాగించాలని తీర్పులో స్పష్టం చేసింది. కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రెజల్యూషన్‌ పీరియడ్‌లో బీపీఎస్‌ఎల్‌కు వచ్చిన ఆదాయం జేఎస్‌డబ్ల్యూకే చెందుతుందని పేర్కొంది.

* ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ను ఏ సంస్థతోనూ విలీనం చేయడం లేదని ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను, ఐడీబీఐ బ్యాంకులో విలీనం చేస్తారంటూ వచ్చిన వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని, అవాస్తవాల ఆధారంగా చేసుకుని వచ్చిన వార్తలని ఎల్‌ఐసీ ఖండించింది. ఐడీబీఐ బ్యాంకు సైతం అలాంటి ప్రతిపాదనేదీ తమ బోర్డు మీటింగ్‌లో చర్చకు రాలేదని పేర్కొంది. విలీనం వార్తల నేపథ్యంలో సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఎల్‌ఐసీ హౌసింగ్‌ షేరు విలువ పడిపోయింది. దాదాపు 7.71 శాతం కోల్పోయి రూ.380.30 వద్ద ముగిసింది. ఐడీబీఐ షేరు విలువ కూడా 2.54 శాతం క్షీణించి రూ.34.50 వద్ద స్థిరపడింది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి 51 శాతం వాటా ఉంది.

* దేశీయ మార్కెట్లు సోమవారం ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. ఉదయం 9.56 గంటల సమయంలో సెన్సెక్స్ 24 పాయింట్లు నష్టపోయి 41,233 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 11 పాయింట్లు కుంగి 12,101 వద్ద ట్రేడవుతోంది. తొలుత నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో కోలుకొని లాభాల్లోకి ఎగబాకినప్పటకీ.. తిరిగి నేలచూపులు చూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 71.34 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కరోనా భయాలు, దేశీయంగా టెలికాం కంపెనీల ఏజీఆర్‌ ఛార్జీల చెల్లింపు వంటి పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టైటాన్ కంపెనీ, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, నెస్లే షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. యస్‌బ్యాంక్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ, సిప్లా, హీరో మోటోకార్ప్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

* ఇప్పటికే కరోనా వైరస్‌(కొవిడ్‌-19)తో జనజీవనం స్తంభించిపోయిన చైనాలో ఆర్థిక రంగం కూడా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోరంగ విపణియైన చైనాలో ఈ సంవత్సరం తొలి అర్ధభాగంలో విక్రయాలు 10 శాతం పడిపోయే అవకాశం ఉందని చైనా అసోసియేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్(సీఏఏఎం) అంచనా వేసింది. ఈ మేరకు నిర్వహించిన ఓ సర్వే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. గత నెల అంచనా వేసిన రెండు శాతాన్ని అది సవరించింది. పరిస్థితులు దిగజారుతుండటమే అంచనాలను తగ్గించడానికి కారణమని తెలిపింది. ఫోక్స్‌వ్యాగన్‌ నుంచి జెనరల్‌ మోటార్స్ వరకు అన్ని రకాల కార్ల విక్రమయాలకు చైనా అనువైన మార్కెట్‌గా భావిస్తారు. టెస్లా కూడా ఈ మధ్య షాంఘై ఫ్యాక్టరీలో ఉత్పత్తి పెంచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఏఏఎం అంచనాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి.