Agriculture

కోతదశలో మిరప సస్యరక్షణ

Telugu Agriculture News-Chilli Growing Tips And Tricks

తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రస్తుతం మిరప కోత దశలో ఉంది. ఈ సమయంలో అనేక ప్రాంతాల్లో మిరపలో కాయకుళ్లు, బూడిద తెగులు ఆశించి నష్టం కలిగిస్తోంది. ఈ తెగుళ్ల లక్షణాలను గుర్తించి, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జే.హేమంత్‌కుమార్‌ (సెల్‌: (99896 23831) శాస్త్రవేత్తలు డాక్టర్‌ కె.రవికుమార్‌, డాక్టర్‌ పి.రంజిత తెలిపారు.
**కొమ్మ ఎండు/ కాయకుళ్లు తెగులు
ఇది లేత కొమ్మలను, పూతను ఆశించటం వల్ల పూత రాలిపోతుంది. కొమ్మల మీద గోధుమరంగు మచ్చలు ఏర్పడి క్రమేణా పొడవుగా సాగి వాటి మధ్య నల్లటి చుక్కలు ఏర్పడతాయి. కొమ్మలు చివర్ల నుంచి కిందకు ఎండటం.. ఈ తెగులు ముఖ్య లక్షణం. తెగులు కాయలను ఆశించినప్పుడు కాయలు కుళ్లిపోతాయి. నివారణ
* కాప్టాన్‌ 1.5 గ్రా. లేదా మాంకోజెబ్‌ 2.5 గ్రా. లేదా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. లేదా ప్రోపికొనజోల్‌ ఒక మి.లీ. లేదా అజాక్సీస్ట్రోబిన్‌ ఒక మి.లీ. లేదా పైరాక్లోస్ట్రోబిన్‌ + మెటిరం 3 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో మందులను మార్చుతూ 2-3 సార్లు పైరుపై పిచికారీ చేయాలి.
* విత్తనాన్ని తెగులు సోకని కాయల నుంచి సేకరించారు.
* విధిగా విత్తనశుద్ధి చేయాలి. కిలో విత్తనానికి క్యాప్టాన్‌ 2.5 గ్రా. లేదా కార్బండజిమ్‌ ఒక గ్రాముతో విత్తనశుద్ధి చేస్తే నారుమడి ఆరోగ్యంగా పెరుగుతుంది.
* కాయకుళ్లు లేదా కొమ్మకుళ్లు ఆశించిన భాగాలను/మొక్కలను తీసి కాల్చివేయాలి. ఇలా చేస్తే మిగతా భాగాలకు తెగులు సోకదు.
* నేలలో అధిక తేమ లేకుండా చూసుకోవాలి. బూడిద తెగులు
ఈ తెగులాశించిన ఆకుల పైభాగం ఆకుపచ్చరంగు కోల్పోతుంది. ఆకు కింది భాగంలో తెల్లటి బూడిద లాంటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతంగా ఉంటే.. పూత, కాయలపై బూడిద మచ్చలు ఏర్పడతాయి.నివారణకు 10 లీటర్ల నీటికి గంధకం (నీటిలో కరిగేది) 30 గ్రా. లేదా డైనోకాప్‌ 10 మి.లీ. లేదా అజాక్సీస్ట్రోబిన్‌ 10 మి.లీ. లేదా మైకోబుటానిల్‌ 4 గ్రా. చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి.