DailyDose

ఏపీ భాజపా సారధిగా మాధవ్-రాజకీయం

Telugu Political News Roundup Today-PVN Madhav To Lead AP BJP

* భాజపా అద్యక్షుడిగా సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కు అప్పగించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పదవీకాలం త్వరలోనే ముగియబోతుంది. ఆయన స్తానంలో పార్టీ అధిష్టానం మాధవ్ ను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. కన్నా లక్ష్మినారాయణనే కొనసాగించాలని డిమాండ్ ఉన్నప్పటికీ నాయకత్వ మార్పిడి వైపే మొగ్గు చూపిండానే అభిప్రాయాలు వ్యకతమవుతున్నాయి.
* 9 పద్దులు..9 భారాలతో వైకాపా పాలన:కళా
వైకాపా నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. రేపటి నుంచి 45 రోజుల పాటు జరగనున్న ప్రజా చైతన్య యాత్ర కరపత్రాలను మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ యాత్రను తెదేపా అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. వైకాపా 9 నెలల పాలన 9 పద్దులు, 9 భారాలతో గడిచిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలనూ రద్దు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ, విద్యుత్‌, పెట్రో ఛార్జీలను పెంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే అర్హుల పింఛన్లు తొలగించారని.. మరిన్ని తొలగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు బలవంతంగా జె-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని విమర్శించారు. జె-ట్యాక్స్‌ కింద అధికార పార్టీకి రూ. 20 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు.
*ధాన్యం డబ్బులింకా చెల్లించరేం?: పవన్‌
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రైతులు పంట అమ్ముకొని వారాలు గడుస్తున్నా ఇప్పటికీ సొమ్ము రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో రైతు సంక్షేమమంటూ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక బకాయిలు కూడా చెల్లించడంలేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు ఈరోజు వరకు రూ.206 కోట్లు చెల్లించాల్సి ఉందనీ.. ఈ మొత్తం రోజురోజుకీ పెరుగుతూ వస్తోందని పేర్కొన్నారు.
* కక్షపూరితమే..అభివృద్ధి ఏదీ?: పురందేశ్వరి
వైకాపా, తెదేపా ప్రజల విశ్వాసం కోల్పోయాయని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. ప్రస్తుతం కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరం పనులు కుంటుపడ్డాయన్న ఆమె.. ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆర్థిక లోటులో పథకాలు ఎలా అమలుచేస్తారో వాళ్లే చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల అంశంతో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాజధాని రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మండలి వల్ల ఉపయోగం లేదని అంటున్నారనీ.. తొలి భేటీలోనే రద్దు కోరుతూ తీర్మానం ఎందుకు చేయలేదని పురందేశ్వరి ప్రశ్నించారు.
* పురపాలికల్లో అవినీతి మచ్చ పోవాలి:కేసీఆర్‌
ప్రగతిభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ముగిసింది. పట్టణ ప్రగతి నిర్వహణకు సంబంధించిన విధివిధానాలతో పాటు కార్యాచరణను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. 10 రోజుల పట్టణ ప్రగతిలో ఏం చేయాలనే విషయమై అవగాహన కల్పించారు. మున్సిపాల్టీల్లో అన్ని హంగులు ఉన్నాయా.. లేదా? నర్సరీలు ఇంకా ఎన్ని అవసరం? చెత్తసేకరణకు ఎన్ని వాహనాలు ఉన్నాయి? ఇంకా ఎన్ని కావాలి? ఇళ్లల్లో తడి, పొడి చెత్తబుట్టలు ఉన్నాయా.. లేదా? తదితర అంశాలతో పాటు పట్టణ ప్రగతికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను రూపొందించారు. వాస్తవ పరిస్థితులకనుగుణంగా వెళ్లాలి తప్ప అతిగా ఊహించుకోవద్దని సూచించారు. పక్కా ప్రణాళిక రూపొందించి అవగాహనతో పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
* బాత్ బీహార్ కీ.. ప్ర‌శాంత్ కిషోర్ ఉద్య‌మం
బాత్ బీహార్ కీ.. ప్ర‌శాంత్ కిషోర్ ఉద్య‌మం హైద‌రాబాద్‌: బీహార్‌లోని జేడీయూ పార్టీ నుంచి వెలివేత‌కు గురైన ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఇప్పుడు ప్ర‌త్యేక ఉద్య‌మాన్ని న‌డిపించ‌నున్నారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, జాతీయ పౌర ప‌ట్టిక(ఎన్ఆర్సీ)కి వ్య‌తిరేకంగా ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. బాత్ బీహార్ కీ పేరుతో ఈనెల 20వ తేదీ నుంచి ఆ ప్ర‌చారం సాగ‌నున్న‌ది. బీహార్‌కు కొత్త నేత అవ‌స‌రం అన్న ల‌క్ష్యంతో ఈ ఉద్య‌మం చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. రానున్న వంద రోజుల్లో కోటి మంది యువ‌త‌ను త‌మ ఉద్య‌మంలో భాగం చేస్తామ‌న్నారు. సీఎం నితీశ్ కుమార్‌.. బీజేపీతో క‌లిసి ఉండడాన్ని ప్ర‌శాంత్ తప్పుప‌ట్టారు. పార్టీ ఐడియాల‌జీని బీజేపీకి స‌మ‌ర్పించ‌డాన్ని కిషోర్ అంగీక‌రించ‌లేదు. నితీశ్‌తో త‌న‌కు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాన్ని గౌర‌విస్తాన‌ని, కానీ ప్ర‌శ్నంచ‌లేన‌న్నారు.
* బాధితులకు భరోసా కల్పించాలి: చంద్రబాబు
రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్యయాత్రను చేపడుతున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వైకాపా అరాచక, అసమర్థ, అవినీతి పాలనపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వ పాలనా విధానాలు, ప్రజలను మోసగిస్తున్న తీరుపై ప్రజల్లో చైతన్యం తెస్తామని ఆయన అన్నారు. తెదేపా నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు ఈ ప్రజా చైతన్యయాత్రలో పాలుపంచుకుని వైకాపా ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ బాధితులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రజా చైతన్యయాత్రను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
* దిల్లీ పోలీసులపై కేసులు పెట్టరేం-ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్న
దిల్లీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ అక్కడి పోలీసులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. విద్యార్ధినుల పట్ల కూడా పోలీసులు కఠినంగా వ్యవహరించి వసతి గృహాల నుంచి తరిమికొట్టిన ఘటనల సాక్ష్యాధారాలను వీడియో రికార్డుల ద్వారా సమర్పించినా.. ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఆయన సోమవారం సాయంత్రం దారుస్సలాంలోని ఎంఐఎం కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
*బలహీన వర్గాలను అణగదొక్కే కుట్ర..:భట్టి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. భాజపా ద్వారా జరుగుతున్న ఈ కుట్ర ప్రమాదకరమైందన్నారు. ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో భట్టి మాట్లాడారు. తాము కూడా భారతీయులమేనంటూ జాతీయ జెండా పట్టుకుని చెప్పాల్సిన పరిస్థితి దేశంలో నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఆందోళన చెందేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. దేశంలోని మైనారిటీలు తమ బతుకేంటని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితులు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
*సీఏఏపై రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం సరికాదు: లక్ష్మణ్‌
పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ మంత్రి మండలి తీర్మానం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. మిత్రపక్షమైన మజ్లిస్‌ పార్టీని సంతృప్తి పరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఏఏపై ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. 85 వేల పుస్తకాలను చదివానని చెప్పుకుంటున్న సీఎం పౌరసత్వ సవరణ చట్టాన్ని చదివారా? అని ప్రశ్నించారు. సీఏఏతో ముస్లింలకూ పౌరసత్వం ఇవ్వాలని చెబుతున్న కేసీఆర్‌ అది పాకిస్థాన్‌ ముస్లింలకా, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ ముస్లింలకా అన్నది స్పష్టం చేయాలన్నారు.
*కమలం గూటికి ఝార్ఖండ్‌ మాజీ సీఎం బాబూలాల్‌ మరాండీ
ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ మరాండీ భాజపాలో చేరారు. తన పార్టీ ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా (జేవీఎం-ప్రజాతాంత్రిక్‌)ను కమలదళంలో విలీనం చేశారు. సోమవారం రాంచీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జె.పి. నడ్డా సమక్షంలో బాబూలాల్‌ కాషాయం కండువా కప్పుకొన్నారు.బాబూలాల్‌ 2000 నుంచి 2003 వరకు ఝార్ఖండ్‌ రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్నారు. 2006లో భాజపా నుంచి బయటకొచ్చి జేవీఎం(పి)ని స్థాపించారు.
*త్వరలో రాజ్యసభ, మండలి స్థానాలకు నోటిఫికేషన్‌
రాష్ట్రంలో ఖాళీకానున్న రాజ్యసభ, శాసనమండలి స్థానాలకు నిర్వహించాల్సిన ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర సీఈవో స్థానం భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టనుంది. ఇటీవలి వరకు సీఈవోగా ఉన్న రజత్‌కుమార్‌ను నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
*రైతుల బలవన్మరణాలకు సీఎం బాధ్యత వహించాలి-కేసీఆర్కు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోవడం వల్లే వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉందని, సగటున రోజుకు ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు నేషనల్ క్రైం బ్యూరో రికార్డు నివేదిక స్పష్టం చేసిందన్నారు. దీన్ని సామాజిక రుగ్మతగా పరిగణించి తక్షణ చర్యలకు సిద్ధం కావాలన్నారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్కు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైతు సమన్వయ సమితులతో రైతులకు ఒరిగిందేమీ లేదని, వాటిని తెరాస నాయకుల పునరావాస కేంద్రాలుగా మార్చేశారన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. రైతుబంధును ఎన్నికల పథకంగా మార్చేశారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని.. ఇవన్నీ కలగలిసి రైతుల ఉసురు తీస్తున్నాయని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటికీ ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
*రైతుల కోసం జైలుకైనా వెళ్తాం: తెదేపా ఎమ్మెల్సీలు
మూడు రాజధానుల బిల్లును శాసనమండలి సెలక్టు కమిటీకి పంపితే, ఆ కమిటీనే రద్దు చేసేందుకు వైకాపా నేతలు కుయుక్తులు పన్నుతున్నారని తెదేపా ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాజధానిని అమరావతి నుంచి అంగుళం కూడా కదల్చలేరని అన్నారు. తరలించే ప్రయత్నం చేస్తే..తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటానికి దిగుతామని..వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలను ముట్టడిస్తామని..జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని ప్రకటించారు. అమరావతి పోరాటానికి మద్దతుగా తెదేపా ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్బాబు, నాగజగదీశ్వరరావు, దొరబాబు, వీవీవీ చౌదరి, గుమ్మడి సంధ్యారాణి, నేతలు రాజధాని గ్రామాల్లో బుధవారం పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు.
*సీఏఏకి వ్యతిరేకంగా ‘పుదుచ్చేరి’ తీర్మానం
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పుదుచ్చేరి శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయనున్నట్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఇటీవల ప్రకటించగా.. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఆ అధికారం లేదంటూ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ సీఎంకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పుదుచ్చేరి శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటైంది. ఇందులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నారాయణస్వామి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఓటింగ్ ద్వారా ఆమోదించారు.
*సమాచార కమిషన్ నియామకాల్లో బీసీలకు అన్యాయం: ఆర్ కృష్ణయ్య
తెలంగాణ సమాచార కమిషన్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అందులో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కమిషనర్ నియామకాల్లో బీసీలకు అన్యాయం జరిగిందనీ, ప్రభుత్వం వెంటనే కమిషన్లో మరో ఇద్దరు బీసీలను నియమించాలన్నారు.దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి జరిగే జనగణనలో బీసీల జనాభాను లెక్కించాలనే డిమాండ్తో ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, దీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు
*కియాపై వాస్తవాలు ప్రజలకు తెలియొద్దా?
అనంతపురం జిల్లా సీపీఐ నేతల గృహ నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు ప్రతిపక్షనేత చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘కియా పరిశ్రమకు వెళ్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కారును పోలీసులు వెంబడించి అరెస్టు చేయడం ఏంటి? ఆయనేమైనా నేరస్థుడా? వాస్తవాలను నిర్ధారించుకోవడానికి వెళ్తున్న నేతలను అరెస్టు చేశారంటే.. ఇందులో ప్రభుత్వం దాస్తున్న అంశాలేంటి? కియా పరిశ్రమ గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందే. కియా తమిళనాడుకు తరలిపోయిందని వార్త రావడం.. ఆ వెంటనే కియా ప్రతినిధులతో వైకాపా నేతలు ఇది నిజం కాదని చెప్పించడం..మరుసటి రోజే మేము రాసింది నిజమే.. అంటూ ఆ మీడియా సంస్థ చెప్పడం.. ఇవన్నీ ఏంటి? తెరవెనక జరిగిందేమిటి? కియా సంస్థను ఎవరు బెదిరించారు? ఎవరు వేధించారు? వార్తల్లో నిజానిజాలేంటి? ప్రజలకు తెలియొద్దా? ప్రభుత్వం వెంటనే సీపీఐ నేతలను విడుదల చేయాలి’’ అని బుధవారం ఆయన ట్వీట్ చేశారు.
*కాంగ్రెస్ దుకాణం మూసేద్దామా?-చిదంబరం ట్వీట్పై శర్మిష్ఠా మండిపాటు
హస్తినలో ఆప్ ఘన విజయాన్ని కీర్తిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం చేసిన ట్వీట్ సొంత పార్టీలో కాక పుట్టించింది. ఈ ట్వీట్ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ఠా ముఖర్జీ తప్పుపట్టారు. ‘‘సర్, రాష్ట్రాల్లో భాజపాను ఓడించే బాధ్యతను కాంగ్రెస్ ఏమన్నా ప్రాంతీయ పార్టీలకు అప్పగించిందా? మన గురించి ఆలోచించడం మాని ఆప్ను పొగడటం దేనికి? రాష్ట్రాల్లోని దుకాణాలను (పీసీసీ) మూసేద్దామా?’’ అని ఆయనను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. పార్టీ ఓటమిలో ఉన్నప్పుడు ఒకరి విజయాన్ని గర్వకారణంగా భావించడమేంటంటూ మరో సీనియర్ నేత శశిథరూర్ ఆక్షేపించారు.
*ఏపీలో ఇక వరుసగా ఎన్నికలు!
ఏపీలో వరుసగా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. తొలుత పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికలు.. ఆ తర్వాత పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల అంశంపై న్యాయస్థానం ఆదేశాలు వెలువడగానే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15లోపు స్థానిక ఎన్నికల్ని పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 15 తర్వాత రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో ఆలోపే పంచాయతీ, జడ్పీ, పురపాలక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పంచాయతీలు, జడ్పీలు, పురపాలికల్లో ఓటరు జాబితాలు, వార్డులు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తికావడంతో ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. కోర్టు ఆదేశాలు వెలువడగానే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
*జగ్లక్ ప్రభుత్వాన్ని తరిమికొడతారు-తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్
దేశం నుంచి బ్రిటీష్ పాలకుల్ని తరిమేసినట్లుగా రాష్ట్రం నుంచి ఐదు కోట్ల మంది ప్రజలు జగ్లక్ ప్రభుత్వాన్ని తరిమికొడతారని తెదేపా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో కృష్ణా జిల్లా నందిగామ ఉపకారాగారంలో రిమాండ్లో ఉన్న టీఎన్ఎస్ఎఫ్, తెదేపా నాయకులను బుధవారం మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అమ్మినేని శ్రీరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్యలతో కలసి లోకేశ్ పరామర్శించారు. అండగా అంటామని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం రాజధాని అమరావతికి మద్దతుగా చేపట్టిన నిరసన దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఐకాస కన్వీనర్ నీరుకొండ నరసింహారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో లోకేశ్ మాట్లాడారు.
*మూడు రాజధానులకు దళితుల ఆమోదం-వైకాపా ఎమ్మెల్యే నాగార్జున వెల్లడి
పాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులను రాష్ట్రంలోని దళితులంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నారని వైకాపా ఎస్సీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తెలిపారు. ఆ విభాగం రాష్ట్రస్థాయి సమావేశాన్ని వైకాపా కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించారు.
*రామకృష్ణ కియాను సందర్శిస్తే మీకెందుకు ఉలుకు: కళా
రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొట్టడం, దాడులకుపాల్పడటం, ఆర్థిక మూలాలు నాశనం చేయడం అన్న 3 సిద్ధాంతాలతో పనిచేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.కళావెంకటరావు ధ్వజమెత్తారు. కియా కార్ల పరిశ్రమను పరిశీలించేందుకు వెళుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘144 సెక్షన్ను విచ్చలవిడిగా వాడుతూనియంతృత్వ పోకడలకు పోవడం బాధాకరం, ఒక పార్టీ ముఖ్య నేత కియా పరిశ్రమను పరిశీలిస్తే తప్పేంటి? మీకెందుకంత ఉలుకు? ఏ తప్పూ చేయని మాజీ ఎంపీ హర్షకుమార్ని అన్యాయంగా 42 రోజులు జైల్లో ఉంచి మనోవ్యధకు గురిచేశారు. అమరావతికి మద్దతివ్వాలని వైకాపా ఎంపీ నందిగం సురేష్కి గులాబీలు ఇచ్చి విన్నవించినందుకు విద్యార్థుల్ని జైల్లో పెట్టి హింసించారు’’ అని మండిపడ్డారు.
*ప్రధానితో కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలి: వర్ల
దిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలని సీఎం జగన్ను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఎజెండా ప్రకటించకుండా ప్రధానితో సమావేశమవ్వడమేంటని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.