Kids

పిల్లలూ…బంగారం కథ ఇది

Telugu Kids Interesting Info-The Story Of Gold And Its Features

హాయ్ ఫ్రెండ్స్… నా గురించి కొన్ని విషయాలు చెబుతా…నేను ఎవరో కనిపెట్టండి…మిమ్మన్ని ప్రేమగా నా పేరుతోనే పిలుస్తుంటారు… నన్ను కచ్చితంగా చూసే ఉంటారు… ఎందుకంటే ఆభరణాల్లో ఎక్కువగా ఉండేదాన్ని నేనే… ఒక్కమాటలో చెప్పాలంటే నేనో ఖరీదైన లోహాన్ని. ఇప్పటికైనా అర్ధమైందా? మీ బంగారాన్ని!
***నిజానికి నేను మీకు పరిచయం అక్కర్లేని లోహాన్నే. పురాతనకాలం నుంచి నేను మీకు తెలుసు. కానీ నా సంగతులన్నీ తెలియవు కదా అని అవేంటో చెప్పడానికి ఇలా వచ్చా. నన్ను ఆంగ్లంలో గోల్డ్‌ అంటారు. Au సంకేతంతో సూచిస్తారు. లాటిన్‌ పదం ఆరమ్‌ నుంచి ఈ సంకేతం వచ్చింది. నా పరమాణు సంఖ్య 79.
* మీకు తెలిసే ఉంటుంది. నా విలువ చాలా ఎక్కువ. దానికి కారణం నేను ఆకర్షణీయమైన మెరుపుతో ఉండడమేగాక ప్రకృతిలో స్వచ్ఛమైన స్థితిలో లభిస్తుంటా. పైగా ఎంతకాలం ధరించినా నా వన్నె తగ్గదు.
* నేను తుప్పుపట్టను. నశించను. రుచీ, వాసనాలేని లోహాన్ని.
****ఎంతలా సాగుతానంటే…
* నేనో మెత్తని లోహాన్ని. తీగలుగా, రేకులుగా సాగుతుంటా. గమ్మత్తయిన విషయం చెప్పనా? ఒక ఔన్సు బంగారం అంటే దాదాపు 28గ్రాముల్ని 8 కిలో మీటర్ల పొడవున్న సన్నని దారంలా సాగదీయవచ్చు. ఈ పోగులను ఎంబ్రాయిడరీలో వాడుతుంటారు. ఇంకా ఒక ఔన్సు బంగారాన్ని 300 చదరపు అడుగుల విస్తీర్ణం మేర రేకులుగా సుత్తితో కొట్టి తయారుచేయవచ్చు.
* నన్ను ఎంత పలుచటి రేకుగా తయారు చేయవచ్చంటే పారదర్శకంగా తయారయ్యేవరకు సాగదీయవచ్చు.
* ఒక మిశ్రమలోహంలో ఉండే నా పరిమాణాన్ని కేరట్‌ అనే ప్రమాణంలో చెబుతారు.
***ఎలా పుట్టానంటే?
* ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ నేను దొరుకుతా.
* దాదాపు 200 మిలియన్‌ సంవత్సరాలుగా భూగ్రహాన్ని ఢీకొడుతున్న ఉల్కల వల్లే ఇప్పటి బంగారం ఏర్పడింది.
***మీ ఒంట్లోనూ ఉంటా!
* నేను తినదగిన పదార్థాన్నే. నా పొరల్ని ఆహారం లేదా డ్రింక్‌ల ద్వారా తీసుకుంటారు.
* మీ శరీరంలో దాదాపు 0.2 మిల్లీగ్రాములంత ఉంటా. ఇందులో ఎక్కువ భాగం రక్తంలో ఉంటుంది.
* యూకలిప్టస్‌ చెట్ల ఆకుల్లో స్వల్పంగా నా జాడలు కన్పిస్తాయి.
* కరిగే నా సమ్మేళనాలు కాలేయం, మూత్రపిండాలకు విషపూరితం.
* నన్ను పూర్తిగా ఆక్సిజన్‌ వాతావరణంలో ఉంచినా మండను. పొడిరేణువులుగా ఉన్నా మండను.
* రసాయనాలతో నేను చర్య పొందను.
***వ్యాపారంలో !
* సైనైడ్‌ సాయంతో నన్ను వ్యాపారపరంగా ఉత్పత్తి చేస్తారు. ఈ సైనైడ్‌ విషపదార్థం. ఉత్పత్తి పూర్తయిన తరువాత దీన్ని నాశనం చేస్తారు. అంటే ఆ తర్వాత నాలో సైనైడ్‌ ఉండదు.
* కానీ పాపం నన్ను ఉత్పత్తి చేసే పరిశ్రమలో పనిచేసే కార్మికులకు మాత్రం ఈ సైనైడ్‌ ప్రభావం ప్రమాదం కలిగిస్తుంది.
* నేను మంచి విద్యుత్తు వాహకాన్ని. అందుకే విద్యుత్తుతో పనిచేసేవారు నాతో తయారైన నగలు ధరించడం మంచిది కాదు.
****ఇవే ఉపయోగాలు!
* నాతో మెడల్స్‌ తయారుచేసి ఆటలు, క్రీడలు, విద్యారంగంలోని విజేతలకు బహుమతిగా ప్రదానం చేస్తారు. ఇంకా విగ్రహాలు, ప్రతిమలు తయారుచేస్తున్నారు.
* మీకు అందుబాటులో ఉన్న బంగారంలో 80శాతం ఆభరణాలుగా తయారవుతోంది. గాజులు, ఉంగరాలు, హారాలు వంటి బంగారు ఆభరణాలు స్త్రీలు ధరిస్తుంటారు.
* ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ వైరింగ్‌, దంత వైద్యచికిత్స, ఔషధాల తయారీ, వికిరణ రక్షణ పరికరాల్లో గాజుకు రంగును కల్పించడంలో నన్ను ఉపయోగిస్తారు.
* నన్ను నాశనం చేయగల ఏ పదార్థం ప్రకృతిలో లేదు. అక్వారీజియాలో నేను కరిగినా విక్షేపణ స్థితిలో ఉంటా.
* నన్ను ధరిస్తే మనిషి ఆరోగ్యం బాగా వృద్ధి చెందుతుందట. శరీరంలోని రక్త ప్రసరణ అభివృద్ధి చెందుతుందని చెబుతుంటారు.
****నా ప్రత్యేకతలు!
* నా నిల్వలు మీ ప్రభుత్వాలకు ఒక పెద్ద ఆస్తిగా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న నా నిల్వల్లో 45శాతం బంగారం ఇలా ప్రభుత్వాల అధీనంలో ఉన్నాయట.
* అంతర్జాతీయంగా ఇప్పటికీ నన్ను చెల్లింపులకు ఒక మాధ్యమంగా భావిస్తారు.
* నేను మాత్రమే పసుపు రంగులో మెరుస్తూ ఉంటా. ఇతర లోహాలు ఆక్సీకరణం చెందినపుడుగానీ ఇతర రసాయనాలతో చర్యపొందినపుడుగానీ ఇటువంటి రంగు పొందుతాయి.
* 24 కేరట్లు అంటే నా స్వచ్ఛమైన రూపం. 18 కేరట్ల బంగారంలో కేవలం 75శాతం స్వచ్ఛం. 14 కేరట్ల బంగారంలో అయితే స్వచ్ఛత 58.5శాతం. అలాగే 10 కేరట్‌ల బంగారంలో స్వచ్ఛమైన బంగారం 41.7శాతం.
* ఆభరణాల తయారీలో బంగారంలో ఇతర లోహాలైన వెండి, ప్లాటినం, రాగి, పల్లాడియం, జింక్‌, నికెల్‌, ఇనుము, కాడ్మియం వంటి లోహాలు మిశ్రమం చేయడం వల్ల ఆభరణం ఎన్ని కేరట్ల బంగారంతో తయారైందో తెలుస్తుంది.