DailyDose

వారి కడుపు నిండా నాపైనే కక్ష-తాజావార్తలు

YSRCP's SIT Proves Their Grudge On Me - Says Chandrababu- Breaking News

* తెదేపాతో పాటు తనపై వైకాపా ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో చెప్పడానికి కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌ మరో ఉదాహరణ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 9 నెలల్లో మూడు సిట్‌లు.. ఐదారు కమిటీలు వేసి తెదేపానే కాదు.. ఏకంగా ఏపీనే టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. అడ్డగోలు చర్యలతో భావితరాలకు తీరని నష్టం చేస్తున్నారని ట్విటర్‌లో దుయ్యబట్టారు. ఎనిమిది నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేసి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారని ప్రశ్నించారు.

* గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే తెదేపా నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గుంటూరులో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. రాజధానిలో మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్లతో చిత్రీకరించారనేది అవాస్తవమన్నారు. పోలీసుల పనితీరుపై దుష్ప్రచారం చేయడం సరికాదని హితవుపలికారు. రాజధానిలో భూములు అభివృద్ధి చేసి ఇస్తామనీ.. ఎవరికీ ఆందోళన అవసరం లేదని సుచరిత చెప్పారు.

* పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల కారణంగా 70 రోజులుగా నిలిచిపోయిన జామియా, నోయిడాల మధ్య రహదారి ఎట్టకేలకు తెరుచుకుంది. దిల్లీలోని జామియా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు, హరియాణాలోని ఫరీదాబాద్‌కు వెళ్లే ఈ రహదారిని తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు. నిరసనకారులు తీసుకున్న ఈ నిర్ణయానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. ఏదేమైనప్పటికీ వారు తీసుకున్న నిర్ణయానికి పోలీసులు కూడా కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

* జపాన్‌కు చెందిన విహారనౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’లో ఉన్న భారతీయులు సహా ఇతర ప్రయాణికులకు జపాన్ అధికారులు మళ్లీ కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జపాన్‌లోని భారత రాయబార అధికార కార్యాలయం శనివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.శుక్రవారం కొవిడ్‌ లక్షణాలు లేవని నిర్ధారణ అయిన కొందరు ప్రయాణికుల్ని నౌక నుంచి విడుదల చేసిన విషయం తెలిసిందే.

* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపులేని కళాశాలలకు ఇంటర్‌ బోర్డు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రైవేటు కళాశాలలకు శనివారం నోటీసులు ఇచ్చింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని 79 కళాశాలలకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. తమ నోటీసులకు సకాలంలో స్పందించకపోతే కళాశాలల్ని మూసివేస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ హెచ్చరించారు.

* తన ఆరోగ్యంపై నిర్భయ దోషి వినయ్‌ శర్మ చెబుతున్నవన్నీ అవాస్తవాలేననే తిహాడ్‌ జైలు అధికారులు శనివారం దిల్లీ కోర్టుకు వివరించారు. వినయ్‌ శర్మ మానసిక స్థితి సరిగా లేదని, తనకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ దోషి తరఫు న్యాయవాది ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా జైల్లో వినయ్‌ ఆత్మాహత్యాయత్నాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వినయ్ శర్మ పిటిషన్‌ను కొట్టివేసింది.

* తెలంగాణలో రైతుబంధు పథకం అమలు కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రైతుబంధు నిధులు అందరికీ జమ అవుతున్నాయన్నారు. కానీ కొన్ని చోట్ల సాంకేతిక లోపాలతో నిధులు బదిలీ కావడంలేదని చెప్పారు. రైతుబంధు సీలింగ్‌పై ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. పంట రుణాలకు సంబంధించి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి వివరించారు.

* గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు. విచారణలు, కమిటీలతో చంద్రబాబును గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఏమీ చేయలేకపోయారని ట్విటర్‌లో పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘాలు, అధికారుల కమిటీలు వేసిన జగన్‌.. తాజాగా సిట్‌ వేశారనీ.. సాధించేదేమీ లేనప్పుడు సిట్‌లతో కాలక్షేపం చేయాలని చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

* పోలీసుల బదిలీల్లో ఎలాంటి అవకతవకలూ జరగలేదని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు స్పష్టంచేశారు. అక్రమాలపై ఆధారాలు ఉంటే చూపించాలన్న సీపీలు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌ న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అసత్య కథనాలు రాయడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా పోలీస్‌ శాఖకు మంచిపేరు ఉందని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వార్తలు వచ్చాయని.. అలాంటి అక్రమాలపై ఆధారాలు ఉంటే చూపించాలన్నారు.

* తెలంగాణలో లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మార్చి 2న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. మార్చి 6 నుంచి ఏప్రిల్‌ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 20వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. మే 27న లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.