NRI-NRT

ట్రంప్ పర్యటన షెడ్యూల్

Donald Trump 2020 India Trip Schedule

అగ్రరాజ్య అధిపతి వస్తున్నారంటే ఆయనకిచ్చే విందు భోజనంలో ఏమేం వంటకాలు ఉంటాయా అన్న ఊహే నోరూరిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన సందర్భంగా న్యూఢిల్లీ ఐటీసీ మౌర్యలో బస చేస్తారు. ఆ హోటల్లో బుఖారా రెస్టారెంట్ తమ ఆత్మీయ అతిథికి హోటల్లో సంప్రదాయక వంటకాలతో పాటు ఆయనకి నచ్చే రుచులతో ట్రంప్ ప్లేటర్ (ట్రంప్ పళ్లెం) పేరుతో రకరకాల వంటకాలు వడ్డించడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఆ మెనూని హోటల్ యాజమాన్యం వెల్లడించలేదు.2010, 2015లో బరాక్ ఒబామా భారత్కు వచ్చినప్పుడు హోటల్ మౌర్య ఆయన కోసం ప్రత్యేకంగా ఒబామా ప్లేటర్ను వడ్డించింది. అప్పటి నుంచి ఆ మెనూ ప్రాచుర్యం పొందింది. ఒబామాకి వడ్డించిన వంటకాల్లో తందూరీ జింగా, మచ్లీ టిక్కా, ముర్గ్ బోటి బుఖారా, కబాబ్లు ఉన్నాయి. బుఖారా రెస్టారెంట్ ప్రధానంగా తందూరీ వంటకాలకే ప్రసిద్ధి. కబాబ్, ఖాస్తా రోటి, భర్వాన్ కుల్చా వంటి వంటకాలు రుచి చూస్తే ప్రాణం లేచొస్తుంది. ట్రంప్కి కానుకగా ఈ రెస్టారెంట్ ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ వేసిన అప్రాన్ను అందించనుంది.
*ట్రంప్ రేటింగ్ పెరిగింది
ఎప్పుడేం మాట్లాడతారో తెలీదు. ఎవరి మీద ఎలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారో అర్థం కాదు. భారతీయులు అంటే చులకన భావం. అమెరికాలో ప్రవాస భారతీయులు వీసా, గ్రీన్కార్డు సమస్యలతో తిప్పలు పడుతున్నాయి. అయినా భారత్లో ట్రంప్కు ఫాలోవర్లు పెరుగుతున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వే ప్రకారం ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానం పట్ల 2016లో 16శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉంటే 2019నాటికి ఆ సంఖ్య 56శాతానికి పెరిగింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ గత అక్టోబర్లో ఈ సర్వే చేసింది. ట్రంప్కి మద్దతిచ్చిన వారిలో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినడంతో భారత్ను అమెరికా తన నమ్మకమైన నేస్తంగా చూస్తోంది.
*3 గంటలు.. రూ.85 కోట్లు
అహ్మదాబాద్లో మొటెరా స్టేడియంలో ట్రంప్ హాజరుకానున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి గుజరాత్ సర్కారు భారీగా ఖర్చు చేస్తోంది. అహ్మదాబాద్లో మధ్యాహ్నం రోడ్ షోతోపాటు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ట్రంప్ అహ్మదాబాద్లో గడిపే సమయం కేవలం మూడు గంటలే అయినప్పటికీ గుజరాత్ సర్కార్ ఏర్పాట్ల కోసం కోట్లు ఖర్చు చేస్తోంది. భద్రతా ఏర్పాట్లు, ట్రంప్ ప్రయాణించే రహదారుల మరమ్మతు, ట్రంప్ ఆతిథ్యానికి దాదాపు రూ.85 కోట్లు ఖర్చు అవుతున్నట్టుగా నగర కార్పొరేషన్ అధికారులు చెప్పారు. నగరంలో ట్రంప్ ఉన్నంతవరకు ఏడు అంచెల భద్రత కల్పిస్తున్నారు. 12 వేల మంది పోలీసు సిబ్బంది ట్రంప్ ప్రయాణించే రహదారిలో కాపలాగా ఉంటారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు 22 కి.మీ. మేర రోడ్లను ఆధునీకరించడానికే రూ. 30 కోట్లు ఖర్చు చేశారు. రూ.6 కోట్లను సుందరీకరణ కోసం ఖర్చు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం అత్యధికంగా ఖర్చు అవుతోంది.
**అహ్మదాబాద్లో కాన్వాయ్ ట్రయల్స్
*ట్రంప్ షెడ్యూల్ – ఫిబ్రవరి 24
* అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు స్వాగతం పలుకుతారు. అనంతరం భారీ సందోహం నడుమ దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు.
* గాంధీకి అనుబంధంగా ఉన్న సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్లు కలసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్రంప్కు గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహూకరించనున్నారు.
* తర్వాత మొటెరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. ఇక్కడ జరగనున్న బహిరంగ సభలో దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారుల అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.
* అనంతరం మధ్యాహ్న భోజనం అహ్మదాబాద్లో చేస్తారు. అందులో భారతీయ ఆహార పదార్థాలను ట్రంప్ రుచి చూస్తారు. ఈ విందుకు కొందరు రాజకీయ నాయకులు హాజరవుతారు.
* సాయంత్రానికి ట్రంప్, మెలానియా ట్రంప్ ఆగ్రాలోని తాజ్మహల్ వద్దకు వెళ్తారు. అధికారులు ఇప్పటికే 900 క్యూసెక్కుల నీరు యమునా నదిలోకి వదలి తగిన ఏర్పాట్లు చేశారు.
* ట్రంప్ దంపతులు రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మయూరా లగ్జరీ హోటల్లో బస చేస్తారు.
****ఫిబ్రవరి 25
* రాజ్ఘాట్లోని గాంధీ సమాధిని ట్రంప్, మోదీలు కలసి సందర్శించి జాతిపిత గాంధీకి నివాళులు అర్పిస్తారు.
* ట్రంప్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అవుతారు.
* అనంతరం హైదరాబాద్ హౌస్లో మోదీ, ట్రంప్ భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు.
* మోదీ, ట్రంప్ల భేటీ సమయంలో ట్రంప్ భార్య మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు.
* అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాపార వేత్తలను ట్రంప్ కలుస్తారు.
* రాత్రి పదింటికి అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు.