Kids

మీ పిల్లలు నడక ప్రారంభించారా?

If your kids started to walk you must know these tips

బుజ్జాయి మెల్లగా పైకిలేచి… పడిపోకుండా జాగ్రత్తగా నిలబడి… ఒక్కో అడుగూ వేస్తుంటే… తల్లిదండ్రుల ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. చిన్నారి మొదటిసారిగా అడుగు వేసిన ఆ అపురూపమైన దృశ్యాలను ఫోన్లలో బంధిస్తారు. ఇది దాదాపు చాలామంది చేసే పనే. అయితే అంతటితో మీ పని పూర్తయిపోలేదు. ఆ సమయంలోనే చిన్నారులకు మీ అవసరం ఎంతో ఉంటుంది.

కాస్త అటూఇటూగా ఏడాదిన్నర వయసున్న పిల్లలు నడవడం మొదలుపెడతారు. నిలబడి కింద పడిపోకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ మెల్లగా అడుగులు వేస్తుంటారు. మీరేం చేయాలంటే: వాళ్ల చేతులను పట్టుకుని మెల్లగా ముందుకు నడిపించాలి. సాధారణంగా పిల్లలు మడమలను పైకి లేపి నడుస్తుంటారు. అలా కాకుండా పాదం మొత్తం నేల మీద ఆనించి నడిచేలా చేయాలి.

ఏడాది వయసు వచ్చేసరికి పాపాయిలు తమ పేరును గుర్తిస్తారు. పేరుతో పిలవగానే స్పందించి, పిలిచినవారి వైపు చూస్తుంటారు. అమ్మా.. నాన్నా అని పలకడం మొదలుపెడతారు. మీరేం చేయాలంటే: చిన్నారులు మెల్లగా పలకడం మొదలుపెట్టినప్పుడు వాళ్లతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. వారి మాటలను మీరు అనుకరించాలి. వాళ్లు తిరిగి మిమ్మల్ని అనుకరించేలా చేయాలి. మీరు చిన్నచిన్న రైమ్స్‌ పాడటం మొదలుపెట్టాలి.

రెండేళ్లు వచ్చేసరికి బంతిని చేతులతో జాగ్రత్తగా పట్టుకుని విసరడం, కాలితో తన్నడం నేర్చుకుంటారు. మీరేం చేయాలంటే: బరువులేని పెద్ద బంతిని కొని ఇస్తే వాళ్లు సులువుగా విసరగలుగుతారు. వాళ్లంతట వాళ్లే ఆడుకుంటారని వదిలేయకూడదు. మీరూ ఆ ఆటలో భాగం కావాలి. మీరు బంతిని వేస్తే వాళ్లు తీసుకొస్తారు. వాళ్లు విసిరితే మీరు తీసుకొచ్చి ఇవ్వాలి.