DailyDose

ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలు మారాయి-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Govt Ammends Provident Fund Rules

* ప్రభుత్వం గతేడాది పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. డిపాజిట్ల పొడిగింపు.. వడ్డీ విధానాల్లో కీలకమైన మార్పులు చేసింది. వీటిల్లో కొన్ని నిబంధనలను సడలిస్తే.. మరికొన్ని నిబంధనలను బిగించింది. మొత్తానికి పీపీఎఫ్‌ నిర్వహణను సులభతరం చేసే ప్రయత్నం చేసింది. చిన్నమొత్తాల పొదుపునకు ఇదే కీలకం కావడంతో ప్రభుత్వం దీనిపై మరింత శ్రద్ధ చూపిస్తోంది. ప్రస్తుతం పీపీఎఫ్‌ ఖాతాలపై ప్రభుత్వం 7.9శాతం వడ్డీ చెల్లిస్తోంది.

* భారత ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్‌అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రిటైల్‌ వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 50 కంపెనీల జాబితాలో ‘రిలయన్స్‌ రిటైల్‌’ మొదటి స్థానంలో నిలిచింది. డెలాయిట్‌ సంస్థ నిర్వహించిన గ్లోబల్‌ పవర్స్‌ ఆఫ్‌ రిటైలింగ్‌ 2020 ఇండెక్స్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2013-2018 మధ్య అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న 50 కంపెనీల జాబితాలో రిలయన్స్‌ రిటైల్‌ తొలి స్థానం సాధించినట్లు నివేదికలో పేర్కొంది. మొత్తం 250 కంపెనీలకు.. 2018 ఆర్థిక సంవత్సరంలో వాటి ఆదాయాల ఆధారంగా చేసుకుని ఈ నివేదిక ర్యాంకులు ప్రకటించింది.

* అమెరికాకు చెందిన డిజిటల్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కంపెనీ ‘రేషనల్‌ ఇంటరాక్షన్‌’ను కొనుగోలు చేసినట్లు దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ప్రకటించింది. తన డిజిటల్‌ వ్యాపార విభాగమైన విప్రో డిజిటల్‌ ద్వారా ఈ కొనుగోలు జరిపింది. ఒప్పందం విలువను మాత్రం వెల్లడించలేదు. వాషింగ్టన్‌ ప్రధాన కేంద్రంగా 2009లో ప్రారంభమైన రేషనల్‌ ఇంటరాక్షన్‌లో ప్రస్తుతం 300కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సియాటిల్‌, బెలెవ్యూ, డబ్లిన్‌, సిడ్నీలోనూ శాఖలను ఏర్పాటు చేసింది. డిజిటల్‌ సేవలు మరింత వ్యాప్తి చెందడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో సేవల సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు రేషనల్‌ ఇంటరాక్షన్‌ కొనుగోలు దోహదపడనుందని విప్రో డిజిటల్‌ పేర్కొంది.

* ‘నా నిష్క్రమణకు వేళైంది. ఇందుకు బెర్క్‌షైర్‌ హాథవే 100 శాతం సిద్ధంగా ఉన్నది’ అని ఆ సంస్థ అధినేత, బిలియనీర్‌, పెట్టుబడుల రారాజు వారెన్‌ బఫెట్‌ శనివారం అన్నారు. వ్యాపార వారసుడు ఎవరో స్పష్టంగా చెప్పకుండానే తన వీడ్కోలు సంకేతాలనిచ్చిన 89 ఏండ్ల బఫెట్‌.. తన సుదీర్ఘ భాగస్వామి, 96 ఏండ్ల చార్లీ ముంగర్‌ సైతం ఇక సెలవు తీసుకుంటున్నారని వాటాదారులనుద్దేశించి విడుదల చేసిన వార్షిక లేఖలో ప్రకటించారు. కాగా, నిరుడు మేలో జరిగిన వార్షిక వాటాదారుల సమావేశంలో గ్రేగరీ ఏబుల్‌ (57), అజిత్‌ జైన్‌ (67)లకు వారసత్వ అవకాశాలున్నట్లు బఫెట్‌ సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. గతేడాది ఈ ఇరువురు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లుగా ఎన్నికైయ్యారు కూడా. ఈ క్రమంలో బఫెట్‌ నిష్క్రమణ తర్వాత ఈ ఇద్దరిలో ఒకరు బెర్క్‌షైర్‌ హాథవే పగ్గాలను చేపట్టవచ్చన్న అంచనాలున్నాయి. తన నిష్క్రమణ సంకేతాలిచ్చిన బఫెట్‌.. బెర్క్‌షైర్‌ వాటాదారులు ఆందోళన చెందనక్కర్లేదని ఒకింత ధైర్యమిచ్చే ప్రయత్నం చేశారు. తదుపరి వాటాదారుల సమావేశం ఈ ఏడాది మే 2న ఉండగా, దాదాపు 88 బిలియన్‌ డాలర్లతో ప్రపంచ కుబేరుల్లో బఫెట్‌ మూడో స్థానంలో ఉన్నారు.