Movies

కంగనా…పూర్ణ

కంగనా...పూర్ణ - Purna As Sasikala - Kangana As Jayalalita

దివంగత ముఖ్యమంత్రి, పురట్చి తలైవి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటిస్తోంది. ఎంజీఆర్‌ పాత్రను అరవింద్‌స్వామి పోషిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేశారు. అయితే అందులో.. జయలలిత లాగా కంగనా రనౌత్‌ను చూపించడంలో చిత్ర బృందం పూర్తిగా విఫలమైందని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత ఎంజీఆర్‌ పాత్రకు సంబంధించి ఇటీవల అరవింద్‌స్వామి గెటప్‌ను విడుదల చేశారు. అచ్చం ఎంజీఆర్‌లాగే కనిపించడంతో ఈ చిత్రంలో ఆయనే మంచి పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా షూటింగ్‌స్పాట్‌లో కూడా అరవింద్‌స్వామిని చూసి నిజంగానే ఎంజీఆర్‌ వచ్చినట్లుందని పలువురు కితాబిచ్చారట. ఇదిలా ఉండగా నిన్నటి వరకు కంగనాను జయలలిత పాత్రకు ఎంపిక చేయడంపైనే ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల నడుమ తాజాగా కంగనా రెండో గెటప్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తొలి లుక్‌తో పోల్చితే ఇది కాస్త ఊరటనిస్తోంది. అన్నాడీఎంకే జెండా అంచుతో ఉన్న తెల్ల చీరలో ఈ పాత్రకు కొంత వరకు న్యాయం చేసినట్లు అనిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో నటి పూర్ణ కూడా చేరినట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆమె శశికళ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమాలో ప్రియమణి, ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఐరన్‌ లేడీ జయలలిత బయోపిక్‌లో తాను నటిస్తుండటం ఆనందంగా ఉందని నటి పూర్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఏఎల్‌ విజయ్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఇది అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు. ఇక జానకి పాత్రలో మధుబాలా, ఆర్‌ఎం వీరప్పన్‌ పాత్రలో సముద్రఖని నటిస్తున్నారు. 90 శాతం వరకు చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి.