Health

గర్భం నిలవట్లేదా?

Recurring pregnancy loss - Telugu health news

నా వయసు 36 సంవత్సరాలు. పెళ్లయి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో 3 అబార్షన్లు అయ్యాయి. ప్రతిసారీ రెండో నెలలోనే అబార్షన్‌ అయింది. ఇలా జరగడానికి కారణం ఏంటి? నాకు అందరిలాగా నార్మల్‌గా ప్రెగ్నెన్సీ రావాలన్నా, అది నిలబడాలన్నా ఏం చేయాలి?

మీ సమస్యను రికరెంట్‌ ప్రెగ్నెన్సీ లాస్‌ అంటారు. దీనికి ఎన్నో కారణాలున్నాయి. మూడుసార్లు అలాగే జరిగింది కాబట్టి అన్ని రకాల పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇలా గర్భస్రావాలు కావడానికి ప్రధానంగా ఎక్కువ వయసు ఉండడం ఒక కారణమైతే క్రోమోజోమ్‌ సమస్యలు, యాంటి ఫాస్ఫోలిపిడ్‌ సిండ్రోమ్‌, ఇమ్యునలాజికల్‌ సమస్యలు, సెప్టేట్‌ యుటెరస్‌, హార్మోన్‌ సమస్యల వల్ల కలిగే థైరాయిడ్‌, డయాబెటిస్‌, పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ లాంటి జబ్బులు, వీర్యకణాల నాణ్యత లేకపోవడం, లేదా అండాలు ఆరోగ్యంగా లేకపోవడం ముఖ్య కారణాలు. వీటికి సంబంధించిన అన్ని పరీక్షలు చేసి, సమస్యలను విశ్లేషించి, దానికి అనుగుణమైన చికిత్సను ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది. చికిత్స తరువాత గర్భం వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. అధునాతనమైన చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు అన్ని పరీక్షలు చేసిన తరువాత కూడా సరైన కారణం ఏంటో తెలియదు. ఇలాంటి కేసులు 30 శాతం ఉంటాయి. అలాంటప్పుడు అండాలు లేదా వీర్యకణాల నాణ్యత సరిగ్గా ఉండకపోవడమే కారణమవుతుంది. ఇందుకోసం ఐవీఎఫ్‌ చికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది.