DailyDose

వివేకా కేసులో తీర్పు రిజర్వ్-తాజావార్తలు

Viveka Murder Case Jugement On Reserve-Telugu BreakingNews Roundup Today

* భారత బౌలర్లు మరోసారి సత్తా చాటడంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన మరో విజయం సాధించింది. సోమవారం పెర్త్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (39), జెమిమా రోడ్రిగ్స్‌ (34) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన బంగ్లా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది.

* భారత చారిత్రక కట్టడం, ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సందర్శించారు. తన సతీమణి మెలానియాతో కలిసి తాజ్‌ అందాలను వీక్షించారు. అక్కడి ప్రఖ్యాత బెంచ్‌ వద్ద నిల్చుని ఫొటోలకు పోజిచ్చారు. అహ్మదాబాద్‌ నుంచి నేరుగా ఆగ్రా చేరుకున్న ట్రంప్‌ దంపతులకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ సాదర స్వాగతం పలికారు.

* అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంక్రమించే ప్రత్యామ్నాయ స్థలంలో మసీదుతో పాటు ఓ ఆస్పత్రిని నిర్మించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫబోర్డు నిర్ణయించింది. దీంతో పాటు ఇండో-ఇస్లామిక్‌ రీసెర్చి సెంటర్‌, లైబ్రరీని కూడా నిర్మించాలని ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

* వాన్‌పిక్‌ కుంభకోణంలో రస్‌అల్‌ ఖైమా నుంచి రూ.కోట్లు దండుకున్న ఎవరూ ఆ కేసు నుంచి తప్పించుకోలేరని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ విదేశాల్లో ఇరుక్కున్నారని.. ఆ నిధులను తమ సొంత పత్రికకు మళ్లించుకున్న వాళ్లూ ఈ కేసు నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ప్రజలకు అప్పుడు ముద్దులు పెట్టారని.. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారంటూ పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టులో విచారణ పూర్తయింది. విచారణలో భాగంగా సేకరించిన శవపరీక్ష నివేదిక, జనరల్‌ కేసు డైరీని పోలీసులు కోర్టుకు సమర్పించారు. మరోవైపు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేసును సీబీఐకి అప్పగించాలంటూ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు మెమో దాఖలు చేయడంపై వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు.పిటిషనర్ల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు దిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌ నుంచి బయల్దేరి ఈ ఉదయం అహ్మదాబాద్‌ చేరుకున్న ట్రంప్‌, మెలానియా దంపతులు తొలి రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత అంతర్జాతీయ విమానాశ్రయంలో చేరుకున్న ట్రంప్‌, మెలానియా దంపతులకు అపూర్వ స్వాగతం లభించింది. వేలాది మంది ప్రజలు ప్రపంచ అగ్రరాజ్య అధిపతికి అడుగడుగునా స్వాగతం పలికారు.

* బాలికపై హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడంతో నిందితుడి మహ్మద్‌ రఫీ (27)ని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో మొదటి జిల్లా కోర్టు న్యాయమూర్తి వెంకట హరినాథ్‌ ఈ తీర్పు వెలువరించారు. విచారణలో భాగంగా న్యాయస్థానం 47 మంది సాక్షులను విచారించింది.

* సభాపతి తమ్మినేని సీతారామ్‌పై తెదేపా నేత, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సభాపతి విజయవాడ కేంద్రంగా అవినీతి బాగోతం సాగిస్తున్నారన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. అర్చకుల నియామకంలో స్పీకర్‌ తమ్మినేని, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విజయవాడ దాసాంజనేయ ఆలయ అర్చకుని నియామకంలో అవినీతి జరిగిందన్నారు.

* సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ‌(క్యాట్‌)లో ఇవాళ విచారణ జరిగింది. వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై వివరణ ఇస్తూ ఏబీ వెంకటేశ్వరరావు అఫిడవిట్‌ దాఖలు చేశారు. వీటిపై వాదనలు విన్న క్యాట్‌.. తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.

* భారత్‌ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న చాలా రక్షణ పరికరాల డీల్స్‌ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ట్రంప్‌ పర్యటనలో భారత్‌ గగనతల రక్షణ వ్యవస్థ, రోమియో, అపాచే హెలికాప్టర్లు, డ్రోన్లకు సంబంధించిన డీల్స్‌ కదుర్చుకోవాలని భావించింది. కానీ వీటిల్లో చాలా డీల్స్‌ వివిధ దశల్లోనే ఉండిపోయి.. తుదిదశకు చేరలేదు. దీంతో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో హెలికాప్టర్ల డీల్‌ ఒక్కదాని పైనే రేపు సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ప్రసంగించారు.