Sports

పదికి పది వికెట్లు పడగొట్టింది

Chandigarh Under-19 Captain Kasvi Gautam Takes 10/10 Wickets

చండీగఢ్ అండర్-19 జట్టు కెప్టెన్ కశ్వీ గౌతమ్ అదరగొట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌తో ఇక్కడి కేఎస్ఆర్ఎం కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్వితీయ ఆటతీరుతో రికార్డులకెక్కింది. బౌలింగ్‌లో పదికి పది వికెట్లు పడగొట్టి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. అంతేకాదు బ్యాటింగులోనూ మెరుపులు మెరిపించింది. 68 బంతుల్లో 49 పరుగులు చేసింది. ఫలితంగా చండీగఢ్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

అనంతరం 187 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన అరుణాచల్‌ప్రదేశ్ కశ్వీ గౌతం దెబ్బకు విలవిల్లాడింది. 8.5 ఓవర్లలో 25 పరుగులకు ఆలౌట్ అయింది. అరుణాచల్‌ప్రదేశ్ బ్యాట్స్‌విమెన్‌లలో మొత్తం 8 మంది డకౌట్ కాగా, మేఘా శర్మ 10 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. నబం మార్తా 4, నబమ్ పరా 3 పరుగులు చేయగా, 8 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో లభించడం విశేషం. 4.5 ఓవర్లు వేసిన కశ్వీ గౌతమ్ 12 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లు తీసుకుని ప్రపంచ రికార్డు సాధించింది. ఖాతా కూడా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయిన అరుణాచల్‌ప్రదేశ్ జట్టు 9 పరుగుల వద్ద ఐదు, 25 పరుగుల వద్ద వరుసగా మూడు వికెట్లు కోల్పోయి ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం ఇద్దరు మాత్రం పదికి పది వికెట్లు తీసుకోగా అందులో అనిల్ కుంబ్లే ఒకడు. ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్ 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొత్తం పది వికెట్లూ తీసుకున్నాడు. 1999లో పాకిస్థాన్‌తో ఢిల్లీలో జరిగిన టెస్టులో కుంబ్లే పది వికెట్లు తీసుకుని రికార్డులకెక్కాడు.