Kids

గారాబం శాశ్వత గాయం చేస్తుంది

Dont Pamper Your Kids-It Does More Harm Than Good

ఉరుకులు, పరుగుల సంసారం, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు- ఇవన్నీ సాటి మనిషిని కాస్త విశ్రాంతి, స్వేచ్ఛను తీసుకునే సమయం లేకుండా చేస్తున్నాయి. 8 గంటలు ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని ఇంటికి చేరుకునేటప్పటికి ఇంట్లో పనులు, ఆర్థిక సమస్యలు, పిల్లల చదువులు, వాళ్ళ మంచి చెడులు ఇవన్నీ ఎంతో భారంగా మారుతున్నాయి. అయితే ఈ రోజుల్లో కుటుంబంలో భర్త ఒక్కడే ఉద్యోగం చేస్తే ఇల్లు గడిచే పరిస్థితులు కన్పించటం లేదు. ఏదో తిన్నామా అంటే తిన్నాము, పడుకున్నాము అంటే పడుకున్నాములా జీవితాలు సాగిపోతున్నాయి. అటు ఇటు చూడగానే 30 రోజులు టక్కున గడిచిపోతున్నాయి. ఒక్కోసారి నెలాఖర్లో ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. అందుకోసమే ఇపుడు ప్రతి కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు చేస్తూ కాస్త హుందాగా ఇబ్బందులు లేకుండా గడిపేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ రోజుల్లో ఏ భార్య భర్తలయినా ఇద్దరు పిల్లలుంటే చాలనుకుంటున్నారు. ఇందులో ఒకరు అమ్మాయి, ఒకరు అబ్బాయి అయితే ఎంతో హ్యాపీ. ఇక వాళ్ళను సాకటంలో ఎంతో అల్లారుముద్దుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నారు. వారికి ఏది కావాలంటే అది తెచ్చిస్తారు. ఏది అడిగినా కాదనలేరు. ఉదయానే్న తినే టిఫిన్ దగ్గర్నుండి, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్‌లో ఏ రకమైన వంటలు కావాలంటే అవి చేసిపెడుతున్నారు. ఇది అతిగారాబం. ఒక్కోసారి ఇంట్లో సరుకులు వున్నప్పటికీ ఆఫీసు వేళవుతుండగానో, వృత్తి బాధ్యతల పరంగానో కాస్త సమయం దొరకనపుడు వాళ్లు అడిగింది చేసిపెట్టకపోతే మారాం చేస్తారు. మందలించినా వినరు. గట్టిగా చెప్పలేరు. అంత గారాబం చేయడానికి, కావలసిందల్లా ఇవ్వకపోతే మారాం చేయడానికి అసలు కారకులు తల్లిదండ్రులే. ఒక్కసారి పిల్లలు అనుకున్నది, ఏది కావాలంటే అది ఇచ్చామంటే, మేము ఏది అగినా మా మమీ డాడీలు తీసుకొని ఇస్తారన్న ధీమా వారిలో అలవడిపోతుంది. ఇలా అలవాటు కావడంతో ప్రతీసారి ఏదో ఒకటి ఇస్తేనేగానీ చెప్పిన మాట వినరు. ఒక్కోసారి బడి నుండి వచ్చాక కూడా హోంవర్క్ చేయడానికి కూడా బిస్కెట్, చాక్లెట్ ఇస్తేనే హోంవర్క్ చేస్తామని ఏడుస్తారు. అన్ని సందర్భాలు, పరిస్థితులు ఒకేలా ఉండవు కదా! వారు అడిగిందల్లా ఇవ్వడానికి ఒక్కోసారి పేరెంట్స్‌కే సమయముండదు. చిరాకు తెప్పిస్తుంటారు. అయినా పిల్లలను ఎంతో ఓపికగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కానీ గట్టిగా ఇలా చేయవద్దు అని మాత్రం అనలేరు. అదే ఆసరాగా చేసుకొని పిల్లలు ఇంకా పెరిగి పెద్దవుతున్నకొద్దీ అలాగే మారాం చేస్తూంటారు. నెమ్మది నెమ్మదిగా పిల్లలు పెద్దవాళ్ళవుతున్నప్పటికీ వాళ్లలో ఎలాంటి మార్పు రాదు. పేరెంట్స్ కూడా ఎక్కువగా వారి ప్రవర్తనపై, చదువుపై దృష్టి పెట్టరు. తీరా ప్రోగ్రెస్ రిపోర్టులో మార్కులు రాకపోయేసరికి అపుడు తల్లిదండ్రులు తలలు పట్టుకుంటారు. అప్పటికీ గట్టిగా చెప్పాలంటే కాస్త ఇమ్బందిగానే వుంటారు. కాబట్టి పిల్లలను చిన్నప్పటినుంచే ఎందులో ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వాలో, ఎక్కడ ఎలా హద్దుల్లో వుండాలో సరైన నిర్ణయం ముందే తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడానికి, వారి భవిష్యత్తు కాస్త దారి తప్పడానికి పేరెంట్స్ ముఖ్య కారకులవుతారు. కాబట్టి పిల్లలను ప్రేమతో చూడాలి గానీ అతి గారాబంగా పెంచవద్దు.