Politics

తెరాసలో రాజ్యసభ సీట్ల కోసం పోటీ

Huge Competition For TRS Rajyasabha Seats 2020

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్‌ఎ్‌సలో పోటాపోటీ నెలకొంది. ఏప్రిల్‌లో ఖాళీ కానున్న ఈ స్థానాల భర్తీకి ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో రాజ్యసభ బెర్త్‌ ను ఆశిస్తున్నారు. ఇందులో సీనియర్లు, గతంలో ఒకసారి ముఖ్యమైన పదవులు నిర్వహించిన వారు, ఇతర పార్టీల నుంచి చేరిన కీలక నేతలు ఉన్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల బలం దృష్ట్యా ఎన్నికలు జరిగే రెండు రాజ్యసభ స్థానాలు టీఆర్‌ఎ్‌సకు దక్కడం లాంఛనమే. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా ఖరారైతే చాలు.. ఎన్నిక ఏకగ్రీవం కానుంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో టీఆర్‌ఎ్‌సలోని ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెండు స్థానాల్లో ఒకటి మాజీ ఎంపీ కవితకు ఖాయమనే ప్రచారం దరిమిలా రెండో సీటుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
*****కవితను రాజ్యసభకు పంపించాలని ఒత్తిడి
నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపించాలని సీఎం కేసీఆర్‌పై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి అధికమవుతున్నట్లు తెలుస్తోంది. ఆమె సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్‌కు సన్నిహితులు, శ్రేయోభిలాషులు సూచిస్తున్నట్లు సమాచారం. ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ స్థాయిలో చేదోడువాదోడుగా ఉండేవారు ఎవరూ లేరనే అభిప్రాయం పార్టీ ముఖ్యుల్లో ఉంది. ప్రస్తుతం ఎంపీ సంతో్‌షకుమార్‌ ఉన్నప్పటికీ, ఆయనకు కేసీఆర్‌ రోజువారీ వ్యక్తిగత, అధికారిక కార్యక్రమాల సమన్వయంతోనే సరిపోతోందని అంటున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాక వినోద్‌కుమార్‌కు సీఎం కేసీఆర్‌ కీలకమైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన రాష్ట్రంలోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు. అందుకు కవితను మించిన ప్రత్యామ్నాయం లేదని ఆయనకు పలువురు సూచించినట్లు తెలిసింది. కవితను రాజ్యసభకు పంపిస్తే కేసీఆర్‌ కుమార్తె అనే కాకుండా, ఆమె చొరవతో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించే అవకాశం ఏర్పడుతుందని చెప్పినట్లు సమాచారం.
*****సామాజిక కోణంలోనే..
పార్టీ తరఫున రాజ్యసభ రెండో సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఒక సీటు కవితకు (ఓసీ-వెలమ) ఖాయమైతే, రెండో సీటు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.
*****ప్రస్తుత టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుల సామాజికవర్గాలు
సంతో్‌షకుమార్‌ ఓసీ(వెలమ)
బండా ప్రకాష్‌ బీసీ(ముదిరాజ్‌)
లింగయ్య యాదవ్‌ బీసీ(యాదవ)
శ్రీనివాస్‌ బీసీ(మున్నూరు కాపు)
లక్ష్మీకాంతరావు ఓసీ(బ్రహ్మణ)
ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న ఎంపీ
కె.కేశవరావు బీసీ(మున్నూరు కాపు)