DailyDose

మార్చి 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు-తాజావార్తలు

AP Assembly Sessions From March 6th-Telugu Breaking News Roundup Today

*ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో ఆల్‌ నైన్స్‌ (9999)ఫ్యాన్సీ నంబరు రూ.9.14 లక్ష లకు అమ్ముడుపోయింది. శుక్రవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలంలో టీఎస్‌09 ఏఫ్‌కే9999 ఫ్యాన్సీ నంబర్‌ను ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ నిర్వాహకులు రూ.9,14,487లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. టీఎస్09ఎఫ్‌ఎల్‌0001 ఫ్యాన్సీ నంబర్‌ను లహరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.3,81,111లకు, మరో ఫ్యాన్సీ నంబర్‌ టీఎస్09ఎఫ్‌ఎల్‌ 0099ను ఆస్మిత పద్మనాభదన్‌ సొంతం చేసుకున్నారు. వీటితో పాటు మరిన్ని మరికొన్ని ఫ్యాన్సీ నంబర్లను ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించగా ఒకే రోజు రూ.31.48 లక్షల ఆదాయం వచ్చిందని హైదరాబాద్‌ జిల్లా జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ జె.పాండురంగ నాయక్‌ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి జిల్లా పరిధిలోని 5 ఆర్టీఏ ప్రాంతీయ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లోనే ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు.
*డిల్లీలో అన్ని పాటశాలలకు మార్చి ఏడు వరకు సెలవులు ప్రకటించారు.
*టెన్నెస్ క్రీడాకారిణి పీవీ సిందుకు తెలంగాణ గవర్నర్ తమిలిసై సనివారం రాజ్ భవన్ లో విందు ఇచ్చారు.
* తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఇరువర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇవాళ జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ రంగంలోకి దిగారు.
* పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. లీటరు పెట్రోలుపై 31 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా రూ.2.76, డీజిల్‌పై వేస్తున్న 22.75 శాతం వ్యాట్‌కు అదనంగా రూ.3.07 పెంచుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పెంచిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయని వాణిజ్య పన్నుల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
*ఏపీ బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలనే అంశం పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తరువాత బడ్జెట్ సెషన్ ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం భావించింది. కాని రిజర్వేషన్ల హైకోర్టు తీర్పును ఈనెల 27వ తేదీన రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్న్నికల రిజర్వేషన్లు ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం లేదు. దీంతో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది.
* విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై తెదేపా ప్రతినిధుల బృందం శనివారం ఉదయం గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. గవర్నర్‌ను కలిసిన అనంతరం సీనియర్‌ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. రాచరిక ప్రభుత్వం అధికారంలో ఉందనడానికి విశాఖ ఘటనే నిదర్శనమన్నారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చినా… పర్యటనను అడ్డుకోవాలనిమంత్రి అవంతితో కలిసి మరో మంత్రి బొత్స పిలుపునిచ్చారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు చేపట్టే ప్రజా చైతన్య యాత్ర కొనసాగనివ్వకూడదని డీజీపీకి జగన్ఆదేశాలిచ్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు విశాఖ పర్యటనకు ముందు రోజు సీఎం జగన్‌తో డీజీపీ ఎందుకు సమావేశమయ్యారని నిలదీశారు. ఈ విషయాలన్నీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, విశాఖ ఘటనకు సంబంధించిన వివరాలుతనకు తెలుసని గవర్నర్ చెప్పారని వర్ల రామయ్య తెలిపారు.
* ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమై రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ముకేశ్‌ వెంట ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామిక వేత్త పరిమల్‌ నత్వానీ కూడా ఉన్నారు
* ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు శనివారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని గవర్నర్‌కు వివరించినట్లు భేటీ అనంతరం ఆయన మీడియాకు తెలిపారు. పాలక, ప్రతిపక్షాల తీరు రాజకీయ ఘర్షణలకు దారితీస్తోందని తెలిపామన్నారు. ఈ పరిస్థితులు శాంతిభద్రతలకు ప్రమాదమని, ఇదే అభిప్రాయాన్ని భాజపా మాటగా గవర్నర్‌కు వివరించామన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో రాజకీయాలు ఉండాలని, ఒకరినొకరు అడ్డుకునే పరిస్థితి ఉండకూడదని జీవీఎల్‌ అభిప్రాయపడ్డారు.
*ఓ మహిళా ఎమ్మెల్యే 8 నెలల గర్భంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఘటన మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో వెలుగుచూసింది. బీడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన 30 ఏళ్ల వయుసు గల నమితా ముందాడ మొదటిసారి గర్భం దాల్చింది. తాను 8 నెలల గర్భవతి అయినా ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లేందుకే అసెంబ్లీ సమావేశానికి వచ్చానని ఎమ్మెల్యే నమితా ముందాడ చెప్పారు.
*గిరిజన సంక్షేమశాఖ పరిధిలో అంబేడ్కర్ విదేశీవిద్య పథకం కింద శుక్రవారం 37 మంది గిరిజన విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మొత్తం 39 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. ఇద్దరు గైర్హాజరయ్యారని గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టీనా తెలిపారు. ఇంటర్వ్యూ బోర్డులో జేఎన్టీయూ, విద్యాశాఖ, ఎస్సీ, గిరిజన సంక్షేమశాఖల అధికారులు ఉన్నారని వివరించారు.
*రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడా ఒక మాదిరి వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. తూర్పు, ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. పగటిపూట పొడి వాతావరణం ఉంటుంది. రాత్రిపూట కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున అత్యల్పంగా గిన్నెధారి(కుమురం భీం జిల్లా)లో 10.9 డిగ్రీలు, ఆదిలాబాద్ 13.2 హైదరాబాద్ 20, రామగుండంలో 16.4 డిగ్రీలుంది. శుక్రవారం పగలు హైదరాబాద్లో 31.8, రామగుండంలో 32.8 డిగ్రీలుంది
*మేడిగడ్డ ఆనకట్ట బ్యాక్వాటర్తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో 79.98 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగిందని అధికారులు తేల్చారు. గత నవంబరు 21 నుంచి మేడిగడ్డ బ్యారేజీలో పూర్తిస్థాయిలో గేట్లను మూసివేసి వచ్చిన ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టారు. ఫిబ్రవరి 15కి బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలకు చేరుకుంది. ఈక్రమంలో బ్యాక్వాటర్ పెరిగి శివారు గ్రామాలపంట భూముల్లోకి నీరు చేరింది.
*గ్రూప్-4 సర్వీసులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, స్టెనో పోస్టుల భర్తీలో భాగంగా అర్హులైన అభ్యర్థులకు మార్చి 8న కంప్యూటర్ పరిజ్ఞాన అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాలకు హాజరైన అభ్యర్థులు మార్చి 4లోగా ప్రవేశ పత్రాలు వెబ్సైట్ నుంచి పొందాలన్నారు.
*యునెస్కో వారసత్వ కట్టడాల కోసం ఏప్రిల్, మే నెలల్లో చైనాలో నిర్వహించనున్న ‘వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం’ కొవిడ్ 19 (కరోనా వైరస్) దెబ్బకు మరో దేశానికి మారనుందని సమాచారం. యునెస్కో వారసత్వ గుర్తింపు పోటీ జాబితాలో ఈసారి ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం కూడా ఉంది. యునెస్కో ప్రతినిధి గత ఏడాది సెప్టెంబరులో రామప్పకు వచ్చి ఆలయాన్ని పరిశీలించి వెళ్లారు.
*మౌలాలి-ఘట్కేసర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ 2వ దశ పనుల నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. మార్చి 11వ తేదీన 9 మెమూ, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. రేపల్లె-సికింద్రాబాద్, సికింద్రాబాద్-మణుగూరు, మణుగూరు-సికింద్రాబాద్ ప్యాసింజర్ రైళ్లతో పాటు హైదరాబాద్-వరంగల్, జనగాం-ఫలక్నుమా, భువనగిరి-ఫలక్నుమా తదితర మెమూ రైళ్లు ఇందులో ఉన్నాయి.
*ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో శుక్రవారం రాత్రి పెళ్లి మండపం కూలి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో సహా ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఉండవల్లిలోని దేవుడు మాన్యంలో ఏర్పాటు చేసిన మండపం ఉన్నట్లుండి కూలిపోయింది. అదే సమయంలో వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో సహా పెళ్లి కుమారుడి బంధువులు కల్పన, సామ్రాజ్యం, శరణ్య, పెళ్లి కుమారుడు తండ్రి గణపతిరెడ్డి, వైకాపా నాయకులు దంటు బాలాజీరెడ్డి గాయపడ్డారు. శరణ్యను విజయవాడలోని ప్రైవేటు వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా మిగిలిన వారికి స్థానికంగా చికిత్స చేయించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కుడి పాదానికి గాయం కావడంతో ఆయన్ను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు పిండికట్టు వేశారు.
*బస్సుల్లో పైరసీ సినిమాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. పైరసీ సినిమాలను ప్రోత్సహించవద్దని, అవసరమనుకుంటే ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. ‘భీష్మ’ సినిమా పైరసీ వీడియోను ఓ బస్సులో ప్రదర్శించగా అందులోని ఓ ప్రయాణికుడు ఆ చిత్ర ప్రతినిధులకు ట్విటర్ ద్వారా సమాచారాన్ని తెలియజేశారు.
*తెలంగాణలో నిరీక్షణలో ఉన్న నలుగురు ఐఏఎస్ అధికారులను వివిధ స్థానాల్లో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఐఏఎస్ అధికారిణి అనితారాజేంద్రన్ను పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా, బి.విజయేంద్రను రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శిగా, ఎం.ఆర్.ఎం.రావ్ను రవాణాశాఖ కమిషనర్గా, ఎం.ప్రశాంతిని అటవీశాఖ సంయుక్త కార్యదర్శిగా నియమించింది. ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్రోస్కు గనులు, భూగర్భ వనరుల శాఖ సంచాలకునిగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులు అధర్సిన్హా, విజయ్కుమార్, వాకాటి కరుణలు పోస్టింగ్ల కోసం నిరీక్షణలో ఉన్నారు.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీమంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు వియ్యంకుడు బసవయ్య ఇంటితో పాటు, మరో ఇద్దరు వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. దాదాపు నాలుగైదు గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. రాజధాని ప్రాంతంలో కొన్న భూములు, వాటి లావాదేవీలపై వారిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సోదాలు జరిగిన మరో ఇద్దరు వ్యక్తుల్లో ఓ బిల్డర్ ఉన్నారు. 2015లో ఆయన రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు.
*తొలి భారత భూపరిశీలన ఉపగ్రహం జీశాట్-1కు సంబంధించిన చిత్రాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. జీఎస్ఎల్వీ-10 వ్యోమనౌక ద్వారా ప్రయోగించనున్న ఈ ఉపగ్రహం 2,268 కిలోల బరువు ఉంది. మార్చి 5న సాయంత్రం 5:43 గంటలకు ప్రయోగించనున్నారు. భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే ఈ ఉపగ్రహం ఆన్బోర్డ్ ప్రొపల్షన్ వ్యవస్థతో కక్ష్యను చేరుకుంటుంది. రెండుగా విడిపోయే నాలుగు మీటర్ల ధనురాకార వ్యాసంతో తయారైన పెలోడ్లు తొలిసారి జీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించనున్నారు. మొత్తంగా జీఎస్ఎల్వీ ద్వారా జీశాట్-1తో సహా 14 వ్యోమనౌకలను ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది.
*గుంటూరు జిల్లా దుగ్గిరాల తహసీల్దారు మల్లీశ్వరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజధాని రైతులు, మహిళలపై నమోదుచేసిన కేసులో వివరాలతో పాటు కేసు డైరీని సమర్పించాలని మంగళగిరి గ్రామీణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను మార్చి 2కు వాయిదావేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
*అమరావతి పరిరక్షణ సమితి, యువజన ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 29న హైదరాబాద్లో చిరంజీవి ఇంటి ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు సోషల్ మీడియాలో కొంత మంది అసత్య పోస్టులు ప్రచారాలు చేస్తున్నారని, వాటితో తమకు సంబంధం లేదని అమరావతి పరిరక్షణ సమితి, ఐకాస కో-కన్వీనర్ గద్దె తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. సమితి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించ లేదన్నారు. దీక్ష, ముట్టడి చేసే వారెవరో తమకు తెలియదని స్పష్టం చేశారు.
*జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో కోర్టు విచారణలో తనకు ప్రత్యామ్నాయంగా సహ నిందితుడిని అనుమతించేలా ఆదేశాలివ్వాలంటూ ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా తనకు బదులు సహ నిందితుడైన జి.ప్రమోద్కుమార్ను అనుమతించాలన్న పిటిషన్ను కొట్టివేస్తూ ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీనివాసన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
*సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య ఘటనలపై విచారణను సీబీఐకి అప్పగించడంపై జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ హర్షం వ్యక్తంచేశారు. ఈ నిర్ణయం ఆ కుటుంబానికి కాస్త సాంత్వన కలిగిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్ రైల్వే విభాగం డైరెక్టర్ జనరల్ ఎన్.బాలసుబ్రమణ్యం 545 రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. వ్యక్తిగత వ్యవహారాల రీత్యా ఆయన ఈ కాలవ్యవధిలో అమెరికాలో పర్యటించనున్నారు. మార్చి 4 నుంచి 2021 జులై 31వరకూ 515 రోజుల పాటు సగం వేతనంతో కూడిన సెలవు, 2021 ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకూ 30 రోజుల పాటు ఆర్జిత సెలవును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
*చంద్రబాబు పర్యటన సందర్భంగా విశాఖ విమానాశ్రయ ప్రాంగణం వద్ద చోటుచేసుకున్న ఘటనపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. అవి ఎవరిపై అన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. వైకాపా వారితోపాటు తెదేపా వారిపైనా కేసులు నమోదైనట్లు తెలిసింది. వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు.
*స్వర్ణజయంతి సహారా రోజ్గార్ యోజన అమలులో నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న విశ్రాంత పురపాలక కమిషనర్లు, ఇతర అధికారులపై విచారణ బాధ్యతను ఐపీఎస్ అధికారి త్రిపాఠీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*రైతులకు పగటిపూట 9 గంటలు, ప్రజలకు 24 గంటలూ విద్యుత్తు సరఫరా కోసం విద్యుత్తు లైన్లు, సబ్స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి భూ సేకరణ, ఇతరత్రా అంశాల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఛైర్మన్గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తొమ్మిది రహదారుల నిర్మాణానికి రూ.90.24 కోట్ల అంచనాతో పరిపాలన అనుమతులిస్తూ రహదారుల, భవనాలశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది
*ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ) పథకం కింద వ్యక్తిగత విభాగంలో ఇళ్ల నిర్మాణానికి రూ.153.01 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇందులో కేంద్రం వాటా రూ.57.25 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.95.76 కోట్లు.
*రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మార్చి 4వ తేదీన జరగనుంది. సచివాలయంలోని కేబినెట్ హాల్లో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనల్ని మార్చి మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖకు పంపించాలని వివిధ శాఖల కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు.
*రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు పాలకమండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్: ఈసీ) సభ్యులను నియమించింది. ఉస్మానియా, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, జేఎన్టీయూ, జేఎన్యూఎఫ్ఏ యూనివర్సిటీలవారీగా శుక్రవారం వేర్వేరు జీవోలు జారీచేసింది. పాలకమండలి సభ్యుల్లో ఐదుగురు ఎక్స్అఫీషియో, నలుగురు ప్రముఖులతో కలిపి మొత్తం తొమ్మిది మందిని నియమించింది. వర్సిటీ పాలకమండలి సభ్యుల నియామకాల్లో అన్నివర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారని ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. వర్సిటీల్లో అభివృద్ధి, విద్యా సంబంధ అంశాల్లో పాలకమండళ్లు కీలకపాత్ర పోషిస్తాయి
* అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మిషన్‌ కాకతీయ.. మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ఎప్పుడు నింపుతారో ఎవరికీ తెలియదన్నారు. కాంగ్రెస్‌ పేదలకు భూములు పంచితే.. టీఆర్‌ఎస్‌ భూములు అమ్ముతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ సత్తా చూపిస్తామని జగ్గారెడ్డి అన్నారు.