DailyDose

విశాఖ ఘటనలో వైకాపా నేతలపై కేసులు-రాజకీయ

Cases Filed On YSRCP Leaders For Vizag Protest-Telugu Political News Roundup Today

* విశాఖ విమానాశ్రయంలో ఈ నెల 27న తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చంద్రబాబు వాహనశ్రేణిపై టమాటాలు, గుడ్లు, చెప్పులు విసిరినవారిపై కేసులు పెట్టారు. విమానాశ్రయం ఆవరణలో పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైకాపా నేతలు జేటీ రామారావు, ఎన్‌.కృపాజ్యోతిపై కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వారిద్దరినీ పోలీసులు విశాలాక్షి నగర్‌లోఅదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 50 మందికిపైగా వ్యక్తులపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలనే విమానాశ్రయానికి వెళ్లామని..పోలీసులిచ్చిన అనుమతులు, షరతులకు అనుగుణంగానే అక్కడికి చేరుకున్నామని తెదేపా శ్రేణులు చెబుతున్నాయి. అలాంటి తమపై పోలీసులు కేసులు నమోదు చేయడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక కీలక నేతలెవరైనా ఉన్నారా? వారిపై కేసులేమైనా నమోదయ్యాయా?అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
*మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయను- వైకాపా ఎమ్మెల్యే
ఎదో చేయాలని ఎమ్మెల్యేను అయ్యాను ఎదో అయ్యింది. ఇక చాలు ఇంకోసారి ఓట్లు అడగను. అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయను. అంటూ కర్నూలు జిల్లా నందికోట్కూరు వైకాపా ఎమ్మెల్యే అర్ధర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో తన మాట చెల్లకపోవడం మంత్రి అనిల్ రాజకీయ జోక్యం కార్యకర్తల నిలదీతతో మనస్తాపం చెందినా వైకాపా ఎమ్మెల్యే ఇలా ఎమ్మెల్యేగా వచ్చేసారి పోటీ చేయను అంటూ తన నిస్సయతను బయపెట్టారు. దీంతో వైకాపాలో వర్గ విభేదాలు మరోసారి పొడచూపాయి.
*విశాఖ ఘటనపై గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు
విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై తెదేపా ప్రతినిధుల బృందం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ…విశాఖపై జగన్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘‘గతంలో విజయమ్మను ఎంపీగా ఓడించారని జగన్‌కు కక్ష. చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులే అడ్డుకోవడమేంటి?. ప్రశాంతంగా ఉన్న విశాఖలో అలజడి రేపుతున్నారు. పులివెందుల రాజకీయాలను విశాఖలో తీసుకొస్తున్నారు. పోలీసుల నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్నికాపాడాలి’’ అని కోరారు.
*జగన్‌ క్రూరత్వం బయటపడింది: యనమల
ప్రజలే చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారని వైకాపా నేతలు విశాఖ వాసులను అవమానిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… విశాఖ వాసులు వైకాపా నేతలు మాదిరి ప్రవర్తించే క్రూరులు కారని అన్నారు. శాంతికి నిదర్శనంగా నిలిచే విశాఖ ప్రజలను వైకాపా నేతలు రౌడీలు, సంఘ విద్రోహులతో పోల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం ప్రేరేపిస్తూ విశాఖ అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధిని వైకాపా అడ్డుకుంటోందని విమర్శించారు.
*ఏపీలో ఘర్షణ వాతావరణం: జీవీఎల్‌
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు శనివారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని గవర్నర్‌కు వివరించినట్లు భేటీ అనంతరం ఆయన మీడియాకు తెలిపారు. పాలక, ప్రతిపక్షాల తీరు రాజకీయ ఘర్షణలకు దారితీస్తోందని తెలిపామన్నారు. ఈ పరిస్థితులు శాంతిభద్రతలకు ప్రమాదమని, ఇదే అభిప్రాయాన్ని భాజపా మాటగా గవర్నర్‌కు వివరించామన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో రాజకీయాలు ఉండాలని, ఒకరినొకరు అడ్డుకునే పరిస్థితి ఉండకూడదని జీవీఎల్‌ అభిప్రాయపడ్డారు.
*దివ్యాంగుడి పట్ల సీఎం స్పందన ప్రశంసనీయం: వీహెచ్
దివ్యాంగుడు సలీం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరు బాగుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ప్రశంసించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. ఇంత కాలం కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉన్నారని, ఇప్పటికైనా వారంలో 5 రోజులు..రోజుకు గంట చొప్పున ప్రగతి భవన్లో ప్రజాదర్బార్ పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు.
*ఆ నేతలపై చర్యలు తీసుకోవాలి: అద్దంకి దయాకర్
ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్న భాజపా, ఎంఐఎం నాయకులపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, జాతీయ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీభవన్లో మాట్లాడుతూ.. నాటి గుజరాత్ అల్లర్లను ప్రస్తుతం దిల్లీలో చేశారని, వాటిని దేశ వ్యాప్తంగా చేయాలని చూస్తున్నారన్నారు.
*ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నిరసనలు: కోదండరాం
ప్రభుత్వశాఖల్లో, పారిశ్రామిక, సేవారంగాల్లో నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించి, ఉద్యోగ ప్రకటనలు, క్యాలెండర్ను విడుదల చేయాలన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య కళానిలయంలో యువజన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరుద్యోగుల సదస్సు నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ నెలరోజులు నిరుద్యోగ, ఆశావహ అభ్యర్థులతో కలిసి నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. పీఎల్ విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.40 లక్షల ఉద్యోగాలుభర్తీ చేయాలన్నారు. గ్రూప్-2, వీఆర్వో, ఉపాధ్యాయ, గ్రూప్-4 ఉద్యోగ ఖాళీలను ప్రకటించాలన్నారు.
*మైనారిటీల ప్రయోజనాల కోసమే సీఏఏ: అమిత్షా
మైనారిటీల ప్రయోజనాల కోసమే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు నిర్ణయం తీసుకున్నామని, ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రగతి, మతసామరస్యానికి కట్టుబడి ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్షా చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో భాజపా ఏర్పాటుచేసిన సీఏఏ అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాధ్యం కాని పనులను మోదీ ప్రభుత్వం సాధ్యం చేసిందన్నారు. భారత పౌరులు వేరే దేశాల్లో అవస్థలు పడుతున్నారని చెప్పారు. దీనికి అడ్డుకట్ట వేయాలన్న సదాశయంతో మోదీ సీఏఏ అమలు నిర్ణయం తీసుకున్నారని, కానీ దీనిపై విపక్షాలు మైనారిటీలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. సీఏఏ చట్టంలోని ప్రతి క్లాజునూ పరిశీలిస్తే చట్టంపై పూర్తి అవగాహన వస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిపరంగా భారత్ 11వ స్థానంలో నిలవగా, మోదీ పాలనలో 5వ స్థానంలో ఉందని వివరించారు.
*తెరాస పాలనపై ఆశలు కోల్పోతున్న ప్రజలు-టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
తెరాస పాలనపై ఆశలు కోల్పోతున్న ప్రజలు తెరాస పాలనపై ప్రజలు ఆశలు కోల్పోతున్నారని, 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో శుక్రవారం నిర్వహించిన పీఏసీఎస్ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండు పడక గదుల ఇళు,్ల రైతుబంధు, రైతు రుణమాఫీ వంటి హామీలను తుంగలో తొక్కిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడిచినా రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కార్యకర్తలు అధికార పార్టీ నాయకుల అరాచకాలను అడ్డుకుంటూ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాలని కోరారు. సహకార ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయడం వల్లే మఠంపల్లి, బూరుగడ్డ పీఏసీఎస్లను గెలుచుకోగలిగామన్నారు. పాలకుల అక్రమాలను ఎండగడుతూ కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ సిద్ధాంతాలను గౌరవించని వారు వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు.
*ఎంతమంది అత్యాచార నిందితులను శిక్షించారు?
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత
‘వైకాపా పాలనలో మహిళలే కాదు.. అయిదేళ్ల చిన్నారులు కూడా పట్టపగలు తిరగలేని పరిస్థితి నెలకొంది’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో మహిళలు, చిన్నారులపై రాష్ట్ర వ్యాప్తంగా 176 వేధింపులు, అత్యాచారాలు జరిగాయని, వీటిలో చాలా కేసుల్లో వైకాపా కార్యకర్తలే నిందితులుగా ఉన్నారని ఒక ప్రకటనలో ఆమె మండిపడ్డారు. ‘‘ఒంగోలులో మైనర్ బాలికను నిర్బంధించి అత్యాచారం చేసిన నిందితులంతా వైకాపా వాళ్లే. ఇంత వరకు ఎంతమంది అత్యాచార నిందితులకు శిక్ష విధించారు? రాష్ట్రంలో మహిళా హోం మంత్రి ఉండి కూడా ఇలాంటి దాడులు జరగడం బాధాకరం’’ అని అన్నారు.
*విశాఖలో భూ అక్రమాలను అడ్డుకుంటాం-మాజీ మంత్రి అచ్చెన్నాయుడు
విశాఖలో జరిగిన భూ అక్రమాలను ప్రజల ముందు ఉంచేంతవరకూ తెదేపా పోరాడుతూనే ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తోన్న ప్రతిపక్ష నేతపై పక్కా ప్రణాళికతో వైకాపా తన కార్యకర్తలు, పులివెందుల రౌడీలతో దాడి చేయించిందని శుక్రవారం ఒక ప్రకటనలో, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన మండిపడ్డారు. ‘‘విశాఖలో వైకాపా నేతలు ఎలాంటి భూ కబ్జాలు, పేదల భూములు లాక్కోవడం లేదని నిరూపించుకోవాలంటే ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ చేయించాలి. విశాఖ చరిత్రలో ఇలాంటి నీచసంస్కృతి గతంలో ఎన్నడూ జరగలేదు. గతంలో చంద్రబాబునాయుడు చలో ఆత్మకూరుకు పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలను అరెస్టు చేసిన పోలీసులు.. రాష్ట్ర మంత్రులే చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిస్తే ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారో చెప్పాలి.
*రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన
కొనసాగుతోందని కడప జిల్లా రైల్వేకోడూరు తెదేపా నేత పంతగాని నరసింహప్రసాద్ విమర్శించారు. రైల్వేకోడూరు పట్టణంలోని మార్కెట్వీధిలో శుక్రవారం ఆయన మహమ్మద్బీన్ తుగ్లక్ వేషంలో హల్చల్ చేశారు. అక్కడి దుకాణదారులు, వ్యాపారులతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ సందడి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో తుగ్లక్ కాలంనాటి కంటే మించిన పిచ్చి పరిపాలన జరుగుతోందని దుయ్యబట్టారు. ‘రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నారు. అన్న క్యాంటీన్లను తీసేశారు. అందరికీ అమ్మఒడి..ఇప్పుడు కొందరికే అంటున్నారు. ఏవేవో కారణాలు చెప్పి రేషన్కార్డులు, పింఛన్లు తొలగిస్తున్నారు..ఇవన్నీ తుగ్లక్ పనులేనని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.
*అప్రజాస్వామిక రాజకీయాలు: జీవీఎల్
రాష్ట్రంలో తెదేపా, వైకాపాలు ఒకదానిపై మరొకటి ఎత్తుగడలు వేసుకుంటూ అప్రజాస్వామిక రాజకీయాలు చేస్తున్నాయని, ఇలాంటి సంస్కృతిని వీడాలని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కోడిగుడ్లు వేయడం మంచి సంస్కృతి కాదన్నారు. గతంలో ప్రధాని మోదీ వస్తే నల్ల బెలూన్లు ఎగురవేయడం, అమిత్షా వస్తే రాళ్లు వేయడం లాంటివి తెదేపా నాయకులు చేశారని గుర్తుచేశారు. రాజధానిలో సమస్యలు పరిష్కరించకుండా భూములు కేటాయించడం వల్ల ఉపయోగం ఉండదన్నారు.
*ఆ సంస్థ కోసమే.. జగన్ పోలవరం సందర్శన-మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్, అక్కడ ఏం పరిశీలించారు? ఏయే పనులు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారన్న విషయాల్ని మీడియాకు ఎందుకు చెప్పలేదని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. తాను పనులు అప్పగించిన సంస్థకు మేలు చేసేందుకే జగన్ పోలవరం వెళ్లారని ఆరోపించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్లో ఒకే కంపెనీ ఎలా పాల్గొంది? రూ.100 పనిని రూ.74కే ఎలా చేయిస్తున్నారో జగన్ చెప్పాలి. తెదేపా హయాంలో పవర్ ప్రాజెక్టు పనుల్లో రూ.2,346 కోట్ల అవినీతి జరిగిందని, 2015-16 ఎస్సెస్సార్ తప్పని జగన్ వేసిన పీటర్ కమిటీ చెప్పింది. ఆ ఎస్సెస్సార్ ధరల ఆధారంగానే జగన్ ప్రభుత్వం ఎలా టెండర్లు పిలిచిందో, రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక సంస్థకు పనులు అప్పగించాక, అదనపు చెల్లింపులు చేయాలని మళ్లీ అధికారుల్ని ఎలా ఆదేశించారో చెప్పాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.