ScienceAndTech

ఇది పల్లీ చెక్క కాదు…సూర్యుని ప్లాస్మా

This is how sun plasma looks like-Telugu tech news

సూర్యుని అత్యంత అరుదైన ‘మండే ప్లాస్మా’ దృశ్యాలను తొలిసారిగా శాస్త్రవేత్తలు చిత్రీకరించారు. విస్తృత సౌర పరిశోధనలలో ఇవి ఎంతగానో ఉపయోగపడగలవని వారు భావిస్తున్నారు. చూడటానికి ‘బెల్లం చిక్కీ’లా కనిపిస్తున్న ఈ చిత్రం సూర్యునిలోని భగభగమండే ప్లాస్మాకు చెందిన అతిసూక్ష్మ ప్రదేశమంటే మనకు నమ్మకం కలగదేమో. అమెరికాకు చెందిన మాయి (Maui) ద్వీపంలో నిర్మాణంలో ఉన్న, ప్రపంచ అతిపెద్ద సౌర టెలిస్కోప్‌ ‘డానియల్‌ కే ఇన్యుయే సోలార్‌ టెలిస్కోప్‌’ సహాయంతో శాస్త్రవేత్తలు ఇటీవల సూర్యుని ఉపరితలం మీది ఈ దృశ్యాలను చిత్రీకరించగలిగారు. తొలిసారిగా పొందిన, ఈ అరుదైన చిత్రాలు అక్కడ లోతుల్లోంచి పైకి ఎగజిమ్ముతున్న మరిగే ప్లాస్మా తీరును వెల్లడిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. సూర్యగోళం మీది సుమారు 30 కి.మీ. పరిధిలోని ఉపరితల ప్రదేశాన్ని వారు ఇలా దృశ్యబద్ధం చేసిన క్రమంలో వారికి ఇవి వెలుగుచూశాయి. సూర్యునిమీది మొత్తం 36,500 కి.మీ. చుట్టుకొలత (భూమికన్నా మూడురెట్లు ఎక్కువ)తో కూడిన ప్రదేశాన్ని చిత్రీకరించే లక్ష్యంతో అమెరికా ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌’ (ఎన్‌ఎస్‌ఎఫ్‌)కు చెందిన పై టెలిస్కోప్‌ను నిర్మిస్తున్నట్టు చెబుతున్నారు.