Movies

ఇద్దరు విజయుల గాధ

Vijay Sethupathy And Vijay's New Dual Role Movie

తమిళ తలపతి విజయ్‌ కథానాయకుడిగా, విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్న చిత్రం మాస్టర్‌. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఒక్క కోలీవుడ్‌లోనే కాక దక్షిణాదిలో సినిమా అభిమానులంతా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌తో పాటు అభిమానుల కోసం ఒక ఆసక్తికరమైన ఫొటోను విడుదల చేసింది. ఆ ఫొటోలో విజయ్‌ సేతుపతి విజయ్‌కు ముద్దు పెడుతూ ఉన్నాడు. ఇక అప్‌డేట్‌ ఏంటంటే.. మాస్టర్‌ చిత్రీకరణ పూర్తయిందట. పోస్ట్‌ ప్రొడక్షన్‌ మాత్రమే మిగిలి ఉందని చిత్ర బృందం పేర్కొంది. ఏప్రిల్‌ 9న అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌, సెకండ్‌లుక్‌ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విజయ్‌ కళాశాల విద్యార్థిగా, ఆచార్యుడిగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఓ కొరియన్‌ చిత్రానికి ఇది కాపీ సినిమా అంటూ కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, చెన్నైలోని ప్రత్యేక ప్రతిభావంతుల వసతి గృహంలో చిత్రీకరణ జరగడంతో ఈ వార్తలకు బలం చేకూర్చినట్లయింది. అయితే, అలాంటిదేమీ లేదని. సినిమా చూస్తేనే కథ అర్థమవుతుందని చిత్రబృందం స్పష్టం చేసింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సరసన మాళవిక రొమాన్స్‌ చేయనుంది. శాంతను భాగ్యరాజ్‌, అర్జున్‌ దాస్‌, ఆండ్రియా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఎక్స్‌బీ ఫిలిం క్రియేషన్స్‌ బ్యానర్‌పై బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.