Editorials

దిక్కులేని గన్నవరం తెదేపా. ప్రవాసుల వైపు చంద్రబాబు చూపు-TNI ప్రత్యేకం

Chandrababu Thinking Of NRIs In Gannavaram To Lead TDP

తెలుగుదేశంకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఆ పార్టీకి దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉన్నప్పటికీ వారిని సమన్వయపరిచే నాధుడు కోసం చంద్రబాబుతో పాటు ఆ పార్టీ అధిష్టానం ఎదురుచూస్తోంది. తెలుగుదేశం అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికైన వల్లభనేని వంశీ గోడ దూకడంతో గన్నవరం తెలుగుదేశంలో నాయకత్వ లోటు ఏర్పడింది. వల్లభనేని వంశీకి గన్నవరంలో బలమైన కేడర్ ఉంది. దీనికి తోడు ప్రస్తుతం అతనికి అధికార పార్టీ అండ కూడా ఉంది. ఈ అండతో వంశీ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మీద చెలరేగిపోతున్నారు. వ్యక్తిగత విమర్శలకు సైతం దిగుతున్నారు.
*** ఇన్‌ఛార్జి కోసం చంద్రబాబు చూపు
ప్రస్తుతం గన్నవరంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం చంద్రబాబు దిక్కులు చూస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడుకు గన్నవరం పార్టీ ఇన్‌ఛార్జిని నియమించడం పెద్ద సవాల్ గా మారింది. ఈ నియోజకవర్గంలో యాదవులు ఎక్కువగా ఉన్నారు. తరువాత గౌడ, కమ్మ కులాలు వారు అధికంగా ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గానికి తెదేపా ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు(యాదవులు)కు గన్నవరం తెదేపా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం ముద్దరబోయిన నూజివీడు తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్నారు. అక్కడి నుండి ఆయనను గన్నవరం తీసుకురావటానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ముద్దరబోయినకు గన్నవరం రాజకీయాన్ని అప్పగిస్తే శక్తి చాలదని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. విజయవాడ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్‌కు గన్నవరంలో బలమైన కేడర్ ఉంది. దీంతో ఆయన భార్య, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనురాధను గన్నవరం తెదేపా ఇన్‌ఛార్జిగా నియమించాలని ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి కూడా చందబాబు సుముఖంగా లేరని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ లాంటి బలమైన నాయకుడు ఉంటేనే గతంలో ఉన్న పూర్వ వైభవం వస్తుందని అక్కడి పార్టీ కార్యకర్తలు, నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో లోకేష్ ను ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేయకూడదని పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తోంది.
*** ప్రవాస ప్రముఖుల కోసం చంద్రబాబు చూపు
గన్నవరంలో పార్టీని నిలబెట్టాలంటే బలమైన ఆర్థిక బలం ఉన్న వ్యక్తి చాలా అవసరమని చంద్రబాబుతో పాటు మిగిలిన నాయకులూ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు డల్లాస్ నుండి మకాం మార్చి వైకాపా రాజకీయాలను గన్నవరంలో నడిపించారు. వల్లభనేని వంశీకి నిద్ర లేకుండా చేశారు. కొద్ది తేడాతో ఓడిపోయినప్పటికి వైకాపా రాజకీయాల్లో యార్లగడ్డ కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే తరహాలో దమ్మున్న ప్రవాసుల కోసం చంద్రబాబు గాలిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి ఒక వెలుగు వెలిగిన ప్రవాస ప్రముఖులు కోమటి జయరాం, డా.వేమూరి రవి ఈ విషయంలో చంద్రబాబుకు సహకరిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక వనరులు ఉన్న ప్రవాసుడిని అమెరికా నుండి గన్నవరానికి పంపించే విషయంలో వీరు దృష్టిపెడితే బాగుంటుందని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.