Food

గోదావరి RK టిఫిన్స్

Godavari RK Tiffins Special Story-Telugu Food News

గోదావరి జిల్లాల రుచుల్ని ఆదమరచి ఆరగించాలంటే… అఖండ గోదారిని అమాంతం ఈదాల్సిన పన్లేదు. రాజాలా రావులపాలెం ఆర్కే టిఫిన్స్‌ వరకూ వెళ్తే చాలు. సెవెంటీ రుపీస్‌లో… పీస్‌ఫుల్‌గా పదకొండు రుచుల పనిపట్టొచ్చు. మీకై మీరు అస్త్రసన్యాసం చేసేదాకా… ‘ఆయ్‌ ఇంకో రెండు వడ్డించమంటారా?’ అని అడుగుతూనే ఉంటారు.
*అంబాజీపేట పొట్టిక్కలు, పాలకొల్లు దిబ్బరొట్టె, కాకినాడ చిట్టిపెసరట్టు… గోదావరి జిల్లాల రుచులు దేనికదే ప్రత్యేకం. దేన్నీ వదలబుద్దేయదు. కాకపోతే… అంబాజీపేట, పాలకొల్లు, కాకినాడ… అన్నీ కలిసొచ్చేలా ఓ రూట్‌మ్యాప్‌ వేసుకుని ఫుడ్‌టూర్‌కు బయల్దేరాలంటేనే కష్టం. ఆ ఇబ్బందేం లేకుండా… ఒకే పళ్లెంలో గోదావరి టిఫిన్లన్నీ వడ్డిస్తోంది – కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలోని ఆర్కే టిఫిన్స్‌. వెరీగుడ్‌! రాములో రాములూ… అని పాడుకుంటూ రావులపాలెం వెళ్తాం. నేరుగా ఆర్కే టిఫిన్స్‌ ముందు బండి దిగుతాం. మళ్లీ ఇక్కడో సమస్య! ఎదురుగా అన్నన్ని రుచులు కనిపిస్తుంటే… దేన్నని తినగలం? పొట్టిక్కలతో కడుపునింపుకోవాలా? దిబ్బరొట్టె తినేసి అబ్బా అని తేన్చాలా? చిట్టి పెసరట్టును చిన్ని పొట్టలోకి స్వాగతించాలా?… అంత అంతర్మథనం అవసరం లేదు. ఓ డెబ్భై రూపాయలిస్తే చాలు… పదకొండు రకాల టిఫిన్ల పనిపట్టొచ్చు. అన్‌లిమిటెడ్‌ ఆఫర్‌. అదీ, ఆర్‌కే టిఫిన్స్‌ ప్రత్యేకత. పొట్టిక్కలు, ఆవిరి కుడుములు, చిట్టి గారెలు, చిట్టి పెసరట్టు, చిట్టిమినపట్టు, మొలకల వడ, విటమిన్‌ ఇడ్లీ, పెసరిపునుకులు, చెరుకు పానకంతో దిబ్బరొట్టె, ఉప్మా, వడ… ఛాయిస్‌ ఈజ్‌ యువర్స్‌. టేస్ట్‌ మాత్రం అదుర్స్‌! నంజుకోడానికి మళ్లీ… పల్లీల చెట్నీ, అల్లం చెట్నీ, వెజ్‌ చెట్నీ, చింతామణి చెట్నీ వగైరా. అదనంగా, రెండు రకాల కారపుపొడులు.
**పుష్కరాల్లో ప్రారంభం…
ఆర్కే టిఫిన్స్‌ 2014లో ప్రారంభమైంది. యజమాని గొలుగూరి వెంకటరెడ్డి ఏ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సూ చేయలేదు. అయితేనేం, అతిథి మర్యాదలు తెలిసినవాడు. రుచుల మర్మం ఎరిగినవాడు. కస్టమర్‌ బుర్రలో ఏముందో, కస్టమర్‌ పొట్టకేం కావాలో కనిపెట్టగలిగినవాడు. కాబట్టే, ఎక్కడాలేనట్టు… అట్టుతో సహా అన్ని రుచుల్నీ ‘అన్‌ లిమిటెడ్‌’గా వడ్డిస్తున్నాడు. మొదట్లో, ఆ సకల టిఫిన్ల జుగల్‌బందీ ఖరీదు.. యాభై రూపాయలే! తర్వాత ఓ ఇరవై పెంచి… డెబ్భైకే అందిస్తున్నాడు. నిజమే, జనాల్లో ఆరోగ్యస్పృహ బా…గా పెరిగిపోయింది. ముద్దముద్దకి కెలోరీలు లెక్కబెట్టేస్తున్నారు. కాస్త జిడ్డు ఎక్కువైపోగానే, ‘కొవ్వు’మంటూ కేకేస్తున్నారు. ఆ బాపతు కస్టమర్ల మనసు కష్టపెట్టకుండా.. విటమిన్‌ ఇడ్లీని కనిపెట్టాడు వెంకటరెడ్డి. రాగులు, పెసలు, బీట్‌రూట్‌, మినప్పప్పు… వంటి దినుసులన్నీ నానబెట్టి, చక్కగా రుబ్బి… పోషక విలువలతో కూడిన ఇడ్లీలు వేడివేడిగా వడ్డిస్తున్నాడు.
**దిబ్బరొట్టె… పానకం
మినప పిండితో మూగిడిలో మందంగా వేసే ఆర్కే టిఫిన్స్‌ దిబ్బరొట్టెకి ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఆ గ్లామర్‌ వెనుక వెంకటరెడ్డి సృజనాత్మకతా ఉంది. ఆ రొట్టెను నాలుగు ముక్కలుగా కోసి… ముక్కలతో పాటు చెరుకు పానకం, చెట్నీలతో అందిస్తారు. దిబ్బరొట్టె, చెరుకుపానకం అద్దిరే కాంబినేషన్‌. ఇక పొట్టిక్కల గురించి చెప్పేదేముందీ? మినపపిండితో తయారు చేసే పొట్టిక్కల్ని… పనస ఆకులలో వండటంతో వాటికో ప్రత్యేకత వచ్చేస్తుంది. ఆ రుచీ, ఆ సువాసనా.. అల్పాహార ప్రియులకు అనల్పానందమే! పెసలు, శనగలు, బొబ్బర్లు… నానబెట్టి మొలకలు వచ్చాక చక్కగా రుబ్బేసి… ఆ పిండిలో ఉల్లి, పచ్చిమిర్చి,
*అల్లం, జీలకర్ర, కొత్తి మీర కలిపి…. వడలు వేస్తారు ఆర్కేలో. నోట్లో పెట్టుకోగానే… ద్యే…వ…డా! అనిపిస్తుంది. కాబట్టే, రావులపాలెం పరిసరాల్లో ఎక్కడ షూటింగ్‌ జరుగుతున్నా… సినిమావాళ్లు పార్సిల్‌ తెప్పించుకుంటారు.
*‘స్వతహాగా నేను రుచుల ప్రియుడిని. కేవలం టిఫిన్ల కోసమే ఎక్కడెక్కడికో వెళ్ళలేం కదా! అన్ని గోదావరి రుచులనూ ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో.. ఆర్కే టిఫిన్స్‌ను ప్రారంభించాం. గోదావరి జిల్లాలతో పాటు… హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలవారు కూడా… ఇటుగా వెళ్తున్నప్పుడు.. కాసేపు ఆగి మా రుచులను ఆస్వాదిస్తారు’ అని సగర్వంగా చెబుతారు గొలుగూరి వెంకటరెడ్డి. ‘రావులపాలెం ఆర్‌కే టిఫిన్స్‌లో తినడం ఓ విక్టరీ’ అంటూ నటుడు ఎల్బీ శ్రీరామ్‌ ఫేస్‌బుక్‌లో కితాబు కూడా ఇచ్చారు. అన్నట్టు, ఈమధ్యే రాజమహేంద్రవరంలోనూ ఓ శాఖ తెరిచారు.