DailyDose

భాజపాకు మందడం సభ అనుమతి లేదు-రాజకీయం

Police refuse permissions to BJP meeting in Amaravati-Telugu political news roundup today

*శ్రీలంక పార్లమెంట్‌ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ప్రకటించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. పార్లమెంట్‌కు ఇంకా ఆరు నెలల గడువు ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌కు ఏప్రిల్‌ 25న ఎన్నికలు నిర్వహించనున్నట్లు గోటబాయ తెలిపారు.
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భేటీ అయ్యారు. మంగళవారం ఆయన పార్లమెంట్‌ భవన్‌లో మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు పలు కీలక అశాలపై చర్చించారు. ఢిల్లీ అల్లర్లపై చర్చించారు. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, కోవిడ్-19 (కరోనా) వైరస్‌‌‌ నిరోధానికి సమష్టిగా కలిసి పనిచేయడంపై చర్చించారు. సమావేశానంతరం మీడియాతో సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీ అల్లర్లు, కరోనా వైరస్పై ఇరువురం చర్చించామని తెలిపారు. ఢిల్లీ అల్లర్లకు ఎవరు కారణమైనా, ఏ పార్టీకి చెందినవారైనా వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానికి తాను చెప్పానని అన్నారు. దేశ రాజధానిలో ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని కోరానని చెప్పారు. అల్లర్ల నియంత్రణకు ఢిల్లీ పోలీసుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కలసికట్టుగా పని చేయడంపై కూడా ఇరువురం చర్చించామని కేజ్రీవాల్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని… ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణలో రెండు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విస్తరిస్తోందని తెలిపారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టిన అనంతరం ప్రధానిని కలుసుకోవడం ఇదే ప్రథమం. ఢిల్లీ అల్లర్ల అనంతరం కూడా వీరిద్దరు సమావేశం కావడం ఇదే మొదటిసారి.
* అప్పుడు ఏసీబీ తప్పుడు ఆరోపణలు చేసింది’
మధురవాడలోని సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో మధురవాడ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం కోసం సోంత భవనం ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి, మధ్యవర్తుల దోపిడిలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల్లో ఆన్‌లైన్ విధానం అమలు చేస్తామని తెలిపారు.
* బీసీల వెన్నుముకను జగన్‌రెడ్డి విరిచేశారు: కూన రవికుమార్‌
బీసీల వెన్నుముకను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విరిచేశారని టీడీపీ నేత కూన రవికుమార్‌ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 54 శాతమున్న బీసీల గొంతును వైసీపీ ప్రభుత్వం నొక్కేస్తోందన్నారు. టీడీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. ఏపీ రాజధాని అమరావతిని ధ్వంసం చేసేందుకు ముఖ్యమంత్రి రూ. 5 కోట్లతో లాయర్‌ను నియమించారని.. మరి బీసీలకు రిజర్వేషన్ల విషయంలో మంచి లాయర్‌ను ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వాన్ని బీసీలంతా ప్రశ్నించాలని, తిరగబడాలని కూన రవికుమార్‌ పిలుపు ఇచ్చారు.
*బీజేపీ ‘బేరసారాల’ ఆధారం ఇదిగో: దిగ్విజయ్
మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు బీజేపీ కోట్లాది రూపాయలు ‘ఎర’గా చూపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తన వాదనకు మంగళవారంనాడు మరింత పదునుపెట్టారు. బహుజన్ సమాజ్‌ పార్టీ (ఎమ్మెల్యే) రామ్‌భాయ్‌ని బీజేపీ నేత ఒకరు ‘చార్టెట్ ఫ్లయిట్’లో సోమవారంనాడు ఢిల్లీకి తీసుకెళ్లారని ఓ ట్వీట్‌లో ఆయన తాజాగా ఆరోపించారు.
*బీసీలపై జగన్‌ కక్షగట్టారు: యనమల
బీసీలకు 60శాతం రిజర్వేషన్లు జగన్‌కు ఇష్టం లేనందునే 15వేల పోస్టులు రాకుండా అడ్డంకులు పెట్టారని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెదేపాకి వెన్నెముక అనే బీసీలపై కక్షగట్టారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిథ్యం తగ్గించేందుకే జగన్‌ మోహన్‌రెడ్డి తన అనుచరుడితో హైకోర్టులో పిటిషన్‌ వేయించారని ఆరోపించారు.60 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని నిలదీశారు. జగన్‌ సీఎం కాగానే బీసీ నిధుల్లో భారీగా కోతలు పెట్టారని ఆరోపించారు. ఆదరణతో పాటు అనేక పథకాలు రద్దు చేశారని, ఇప్పుడు పేదల అసైన్డ్‌ భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. కక్షతోనే రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం దృష్టికి జగన్‌ తీసుకెళ్లలేదన్న యనమల… రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ బీసీలకు రిజర్వేషన్లు తగ్గించే కుట్రలు జరిగాయని గుర్తు చేశారు. బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులను జగన్‌ దారిమళ్లించి తీవ్ర నష్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలలో నాయకత్వం ఎదగకుండా జరుగుతున్న కుట్రలపై ఆ సంఘాల నాయకులు మౌనం వీడాలని హితవు పలికారు.
*రేవంత్‌ది భూఆక్రమణలు, బ్లాక్‌మెయిలింగ్‌ దందా-తెరాస విప్‌ బాల్క సుమన్‌ విమర్శ
తను చేసే భూఆక్రమణలు, బ్లాక్‌మెయిలింగ్‌ దందాలు బట్టబయలు కావడం జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని శాసనసభలో అధికార పార్టీ విప్‌ బాల్క సుమన్‌ విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎదుటి వారిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, తెరాస కార్యదర్శి గట్టు రామచందర్‌రావులతో కలిసి సోమవారం తెలంగాణ భవన్‌లో సుమన్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు సహా చాలా వ్యవహారాల్లో దొరికిపోయారు. ఇప్పుడు గోపన్‌పల్లిలో దళితుల భూములు కబ్జా చేసినట్లు తేలింది. ఇప్పటికైనా తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.
*ఆంక్షల్లేకుండా కందులు కొనండి
మంత్రి నిరంజన్‌రెడ్డికి కాంగ్రెస్‌ నేతలు కోదండరెడ్డి, సంపత్‌కుమార్‌ విజ్ఞప్తి
ఆంక్షలు లేకుండా కందులను కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఆంక్షల కారణంగా కంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టమాటా రైతుల పరిస్థితి సైతం దయనీయంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కంది, టమాటా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు
*4, 5 తేదీల్లో నిరాహార దీక్ష : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ఉద్యోగ, ఉపాధ్యాయ, ఒప్పంద, పొరుగుసేవల, పింఛనుదారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో నిరాహార దీక్ష చేయనున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. సోమవారం శాసనమండలి మీడియాపాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
*మే నెల 31న ప్రజాయుద్ధభేరి: మందకృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల పరిరక్షణను కోరుతూ మే నెల 31న లక్షలాది మందితో ప్రజాయుద్ధభేరి సభను నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సోమవారం సాయంత్రం అల్వాల్‌లో జరిగిన రాష్ట్ర ఎమ్మార్పీఎస్‌, అనుబంధ కమిటీల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన సామాజిక, ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లను పరిరక్షించుకొనేందుకు దేశవ్యాప్తంగా అణగారిన ప్రజలను ఏకం చేసి ఉద్యమించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే మార్చి 22న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా, ఏప్రిల్‌ 26న విద్యార్థి గర్జన, అంతిమంగా ప్రజాయుద్ధభేరి ఉంటుందన్నారు.
*జగన్‌ను రాజ్యసభ సీటు అడిగింది నిజమే!: నత్వానీ
ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరామని ఝార్ఖండ్‌ స్వతంత్ర ఎంపీ పరిమల్‌ నత్వానీ తెలిపారు. సోమవారం పార్లమెంటు సెంట్రల్‌ హాలులో విలేకరులతో ఇష్టాగోష్ఠి సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌ నుంచి కాంగ్రెస్‌, భాజపాలకు ఒక్కో సీటు వస్తున్న నేపథ్యంలో అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం లేనందున ఇటీవల ముకేశ్‌ అంబానీతో అమరావతి వచ్చి జగన్‌ను కలిసినప్పుడు ఈ ప్రతిపాదన చేశానని పేర్కొన్నారు. తనకు 3 రోజుల సమయం ఇవ్వాలని జగన్‌ కోరినట్లు నత్వానీ తెలిపారు.
*దిల్లీ అల్లర్లపై విస్తృత స్థాయి చర్చ జరగాలి: నామా
దిల్లీ అల్లర్లపై పార్లమెంట్‌లో విస్తృతస్థాయి చర్చ జరగాలని తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా అధ్యక్షతన సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దిల్లీతో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో అల్లర్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య ఇప్పటికే 46కు చేరిందన్నారు. మున్ముందు ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. దేశవ్యాప్తంగా శాంతిభద్రతలు నెలకొల్పి ప్రజలకు సంపూర్ణ భరోసా కల్పించాలని ఆయన సూచించారు.
*రాజ్యసభకు ప్రియాంక!కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఒత్తిడి
కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని రాజ్యసభకు పంపించాలని ఆ పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. రాజ్యసభలో పార్టీని సమర్థంగా, మరింత సమన్వయంతో నడపడానికి గాంధీ కుటుంబం నుంచి ప్రియాంక వస్తే బాగుంటుందని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు, ఇతర నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఖాళీ కాబోతున్న 55 రాజ్యసభ స్థానాలకు ఈ నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
*రాష్ట్రంలో సీఏఏ అమలు చేయాలి
పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని రాష్ట్రంలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయడం రాజ్యాంగ విరుద్ధమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ కేసీఆర్ సొంత జాగీరు కాదని.. పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ చట్టం మతవివక్ష ప్రదర్శిస్తోందంటూ కేసీఆర్, కేటీఆర్లు చెబుతున్నారని.. మరి పాకిస్థాన్ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని కోరుతున్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. భాజపా ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో సీఏఏపై ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మేధావుల సదస్సు నిర్వహించారు. దేశ విభజన సమయంలో జిన్నా పోషించిన పాత్రను నేడు మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒవైసీ సోదరులు రజాకార్ల పాత్రను పోషిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎనిమిదో నిజాంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నగరంలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను పోలీసులు ప్రశ్నిస్తుంటే… అసదుద్దీన్ ఒవైసీ వారిని ప్రశ్నించవద్దని చెప్పడం ఏం పద్ధతని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర సంఘటన్ కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, ఓబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాటం నర్సింహ పాల్గొన్నారు.
*హిందూ రాజ్య స్థాపనకు భాజపా ప్రయత్నం: తమ్మినేని
దేశంలో హిందూమత రాజ్య స్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక (ఆర్హెచ్పీవీ) ఆధ్వర్యంలో వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని ఓంకార్ విజ్ఞాన భవనం మైదానంలో ఆదివారం సభ నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశప్రజలు ప్రజాస్వామ్య, లౌకికరాజ్యం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఆర్ పేరుతో వివరాల సేకరణకు వచ్చే అధికారులకు(ఎన్యూమరేటర్లకు) వివరాలు చెప్పవద్దని ప్రజలకు సూచించారు. జనాభా గణన వివరాలు మాత్రమే చెప్పాలని కోరారు. రాష్ట్రంలో ఎన్పీఆర్ చట్టంలో వివరాల సేకరణకు అధికారులను నియమించవద్దని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాసరావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ముక్తార్పాష పాల్గొన్నారు.
*రిజర్వేషన్ల పరిరక్షణకు దేశవ్యాప్త ఉద్యమం: మంద కృష్ణ
రిజర్వేషన్ల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యవేదిక ఛైర్మన్ మంద కృష్ణమాదిగ తెలిపారు. రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములునాయక్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఉద్యోగ, ప్రజా సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసే కుట్రలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐక్యవేదిక చీఫ్ కో-ఆర్డినేటర్ జేబీ రాజు, కన్వీనర్లు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్, ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్గౌడ్, జయంతిగౌడ్ పాల్గొన్నారు.
*దేశంలోనే తెరాసకు అరుదైన ఘనత
ఎన్నికల్లో విజయ పరంపరతో తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్ర సృష్టించిందని, దేశంలోనే ఏ పార్టీకి సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించిందని శాసనసభలో తెరాస విప్ బాల్కసుమన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని అన్నారు. ఆదివారం తెలంగాణభవన్లో వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలంటే ఏ పార్టీకైనా భయమని, తెరాసకు మాత్రం అవి ప్రియమైనవని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలను సీఎం కేసీఆర్ కన్నబిడ్డల్లా చూస్తున్నందుకే అన్ని ఎన్నికల్లో తెరాసనే గెలిపిస్తున్నారన్నారు. పదవుల్లో బడుగు వర్గాలకు, ఉద్యమకారులకు సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్లు పెద్దపీట వేశారని చెప్పారు. ఎన్నికల ఫలితాలను అందరూ హర్షిస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఏడుస్తోందన్నారు. రైతుల సంతోషంగా ఉంటే ఆ పార్టీకి కడుపు మంటగా ఉందని విమర్శించారు. రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదని, జీవన్రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
*జిన్నా పాత్రను పోషిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ
పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని రాష్ట్రంలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయడం రాజ్యాంగ విరుద్ధమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ కేసీఆర్ సొంత జాగీరు కాదని.. పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ చట్టం మతవివక్ష ప్రదర్శిస్తోందంటూ కేసీఆర్, కేటీఆర్లు చెబుతున్నారని.. మరి పాకిస్థాన్ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని కోరుతున్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. భాజపా ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో సీఏఏపై ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మేధావుల సదస్సు నిర్వహించారు. దేశ విభజన సమయంలో జిన్నా పోషించిన పాత్రను నేడు మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒవైసీ సోదరులు రజాకార్ల పాత్రను పోషిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎనిమిదో నిజాంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
*9 నెలల్లోనే దిగజారిన రాష్ట్ర ప్రతిష్ఠ-మండలి ప్రతిపక్ష నేత యనమల
వైకాపా అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారిందని, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే యువతకు ఉద్యోగావకాశాలు దూరమవుతాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రలో యనమల మాట్లాడారు. వైకాపా హయాంలో పాలన గాడితప్పి ఆర్థికవ్యవస్థ కుంటుపడిందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ సిమెంటు ధర, విద్యుత్తు ఛార్జీలు, ఆర్టీసీ, చమురు ధరలు పెంచుకుంటూ పోతున్నారన్నారు
*రూ.3వేలు పింఛను ఇస్తామని మోసం చేశారు: కళా
‘అధికారంలోకి వస్తే నెలకు రూ.3 వేలు పింఛన్ ఇస్తామని చెప్పి వైకాపా మోసం చేసింది. రూ.వెయ్యికి బదులు రూ.250 పెంచి రూ.10 వేల కోట్ల మోసం చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు జగన్ నమ్మకద్రోహం చేశారు. గీత, చేనేత కార్మికులను వంచించారు’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు ఒక ప్రకటనలో విమర్శించారు. తెదేపా హయాంలో ఇచ్చిన పింఛన్ల సంఖ్య గురించి పత్రికల్లో ఇచ్చిన తప్పుడు ప్రకటనలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
*కన్హయ్యపై దేశద్రోహం కింద తప్పుడు కేసు: నారాయణ
కేంద్ర ప్రభుత్వం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్హయ్యకుమార్పై దేశద్రోహం కింద తప్పుడు కేసు పెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ కేసు విచారణ జరపకుండా దిల్లీ ప్రభుత్వం కొంతకాలం ఆపినా కేంద్రం ఒత్తిడితో తిరిగి విచారణకు ఆదేశించిందని వెల్లడించారు. శనివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ..కన్హయ్య మాట్లాడిన దాన్ని తారుమారు చేసి సీడీలు తయారుచేశారని, వాటి ఆధారంగా కేసుపెట్టారని వెల్లడించారు. అవి బోగస్ అని ఫోరెన్సిక్ ప్రయోగశాలలు తేల్చినా కేంద్రం కేసు వెనక్కి తీసుకోవడం లేదన్నారు. భాజపా కుట్రలు బయటపడుతున్నాయని తెలిసే కన్హయ్యపై ఉన్న కేసులను తోడి అరెస్టు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇది భాజపా ఆడుతున్న అనైతిక రాజకీయక్రీడని విమర్శించారు. దిల్లీ అల్లర్లకు కారణమైన ముగ్గురు భాజపా నాయకులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. భాజపా, ఆరెస్సెస్లు పథకం ప్రకారం అల్లర్లు సృష్టించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
*పోలవరంపై మీవి అబద్ధాలని ఒప్పుకుంటారా?-దేవినేని
రివర్స్ టెండరింగ్ పేరుతో నాటకాలాడి పోలవరం పనులు నిలిపేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయడం లేదని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 6.15 లక్షల ఇళ్లు పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయని చెప్పారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని, ఇంటి స్థలాల పేరుతో బడుగువర్గాలను రోడ్డున పడేశారని దుయ్యబట్టారు.
*తెదేపా రాష్ట్ర నేతలకు అధినేత చంద్రబాబు సూచన
తెలంగాణలోని తెదేపా నేతలంతా మనస్పర్ధలను వీడి ఐకమత్యంతో ముందుకు సాగాలని అధినేత చంద్రబాబు సూచించారు. శనివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర ముఖ్యనేతలు, పార్లమెంటరీ కమిటీతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ తరఫున చేపడుతున్న కార్యక్రమాలను నేతలు ఆయనకు వివరించారు. పార్టీ కమిటీలకు కార్యవర్గాలను వెంటనే నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి ముఖ్యనేతల కోర్ కమిటీ వారానికి 2, 3 సార్లు సమావేశమై కార్యక్రమాలపై చర్చించాలన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ముఖ్యనేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, అరవిందకుమార్గౌడ్, నెల్లూరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
*విజయమ్మను ఓడించారనే విశాఖపై కక్ష-తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. 2014 ఎన్నికల్లో ఆయన తల్లి విజయమ్మ విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. పులివెందుల సంస్కృతికి భయపడి ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. దానిని మనసులో పెట్టుకొని ఉత్తరాంధ్రను నాశనం చేసేలా సీఎం జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుపైనే పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే తిష్ఠ వేసి కథంతా నడిపించారని, మందు, బిర్యానీ, డబ్బులు ఇచ్చి కొందరిని రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
*విశాఖ ప్రజల్ని రౌడీలతో పోల్చుతారా?: యనమల
విశాఖ ప్రజల్ని వైకాపా నాయకులు రౌడీలు, సంఘ విద్రోహశక్తులతో పోల్చడం హేయమని..రాష్ట్రంలో అరాచకపాలన రాజ్యమేలుతోందని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. కాస్మోపాలిటన్ నగరమైన విశాఖను వైకాపా నాయకులు నేరస్థుల నగరంగా చిత్రించి చెడ్డపేరు తెచ్చారని ఆయన శనివారం ఒక ప్రకటనలో, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని దామిరెడ్డిపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘తెదేపా అధినేత చంద్రబాబుపై విశాఖ ప్రజలే కోడిగుడ్లు విసిరారని వైకాపా నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు. విశాఖ ప్రజలు వైకాపా నాయకుల్లా విపరీత మనస్తత్వం ఉన్నవాళ్లు కాదు. వాళ్లు శాంతికాముకులు. తెదేపా ప్రభుత్వం విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని చూస్తే…ఇప్పుడు రౌడీలంతా విశాఖకు చేరి దాన్ని నేరాలకు రాజధానిగా మార్చాలనుకుంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది’ అని ఆయన ధ్వజమెత్తారు.
*మందడంలో భాజపా సభకు అనుమతి నిరాకరణ
అమరావతి రైతులకు సంఘీభావంగా మందడంలో ఆదివారం భాజపా తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే..రైతులకు ఇచ్చిన భరోసా మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తుళ్లూరులో రైతులను కలసి సంఘీభావం తెలుపుతారని ఉపాధ్యక్షుడు నాగభూషణం ఓ ప్రకటనలో తెలిపారు.
*కమీషన్లు ఇవ్వరనే ఇళ్ల బిల్లులు నిలిపేశారు-మాజీ మంత్రి దేవినేని ఉమా
తెదేపా హయాంలో నిర్మాణం మొదలుపెట్టిన 6.15 లక్షల ఇళ్లు పూర్తవడానికి సిద్ధంగా ఉన్నాయని, జగన్ అధికారంలోకొచ్చాక అవన్నీ దెయ్యాలకు ఆవాసాలుగా మారాయని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పేదలు అప్పు చేసి కట్టుకున్న 4.37 లక్షల ఇళ్లను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని దుయ్యబట్టారు. ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇవ్వాల్సిన రూ.1,100 కోట్ల బకాయిలను నిలిపేసిందని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఏ పనికైనా బిల్లులు చెల్లించాలంటే 10 నుంచి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నారని, పేదలు కమీషన్లు ఇవ్వరనే బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. శనివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో దేవినేని విలేకరులతో మాట్లాడారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలివ్వాలన్న ఆత్రంతో గిరిజనులు, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన భూములను ప్రభుత్వం స్వాహా చేస్తోందని ఆరోపించారు. ఇళ్లస్థలాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు చెందిన 4 వేల ఎకరాలను ప్రభుత్వం కాజేసిందన్నారు. మైలవరం నియోజకవర్గంలో 82 ఎకరాల్లో 1,300 పట్టాలిస్తే వైకాపా అధికారంలోకి రాగానే రద్దు చేశారని ఆరోపించారు. పేదల భూములు లాక్కుంటున్న వారందరూ జైలు ఊచలు లెక్కపెట్టే రోజు దగ్గర్లోనే ఉందని ఉమా హెచ్చరించారు.