DailyDose

“చైనా”లో ఐటీ దాడులు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Chaitanya Narayana Income Tax Raids

* ఎపి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 25 వ తేదీన ప్రభుత్వం 25 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తోంది. ఒకవేళ స్థలాలు ఇచ్చిన అక్కడ ఇల్లు కట్టుకునే వ్యక్తులు ఎంతమంది… ఆ స్థలాలను ప్రజలు ఏం చేసుకుంటారు అనే అనుమానాలు కలగడంతో దీనిపై కూడా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.
* జీశాట్‌-1 ను ఇస్రో ఈనెల 5వ తేదీన ప్రయోగించనుంది. రేపు సాయంత్రం 5.43 గంటలకు ప్రయోగం జరగనుంది. జియోస్టేషనరీ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను భారత్‌ ప్రయోగించడం ఇదే తొలిసారి. ఓ ప్రాంతానికి సంబంధించిన రియల్‌ టైమ్‌ ఇమేజ్‌లను ఈ ఉపగ్రహం అందిస్తుంది. ప్రకృతి విపత్తులను కూడా ఇది మానిటర్‌ చేస్తుంది. జీశాట్‌-1 బరువు 2268 కిలోలు. శ్రీహరికోటలోని రెండవ లాంచ్‌ ప్యాడ్‌ను నుంచి జీఎస్‌ఎల్వీ రాకెట్‌ను ప్రయోగిస్తారు. 18 నిమిషాల తర్వాత జీశాట్‌-1 ఉపగ్రహం… జీటీవో కక్ష్యలోకి చేరుకుంటుంది. జియోస్టేషనరీ ఆర్బిట్‌ భూమికి సుమారు 36 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీశాట్‌-1 ఉపగ్రహం ఏడేళ్ల పాటు పనిచేయనుంది..
* కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. మాన్సస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజును తొలగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్‌చైర్మన్‌గా ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న సింహాచలం ఆలయ చైర్మన్‌గా సంచిత ప్రమాణస్వీకారం చేశారు. సంచిత గజపతిరాజు బిజెపి ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మాన్సస్‌ ట్రస్ట్‌కు 108 ఆలయాలు, 14,800 ఎకరాల భూములు ఉన్నాయి…
* కోల్‌కతా నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ ఏషియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్‌ మంత్రి అరూప్‌ బిస్వాస్‌తో సహా 171 మంది ప్రయాణికులతో బాగ్డోగ్రాకు బయలుదేరిన ఎయిర్‌ ఏషియా విమానం టేకాఫ్‌ అయిన వెంటనే అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. దీంతో అధికారులు సహా, విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
* రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇదిలా ఉంటే ట్రాఫిక్‌ రద్దీతో విద్యార్థులకు అక్కడక్కడా ఇబ్బందులు తప్పలేదు. రద్దీ ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న విద్యార్థులకు ఏబీవీపీ విద్యార్థులు సాయమందించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏబీవీపీ విద్యార్థులు రంగంలోకి దిగడం విశేషం.
* మార్చి 5న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టనున్న జీఐఎస్ఏటీ-1 ఉపగ్రహ ప్రయోగం వాయిదా పడింది. సాంకేతిక కారణాల వల్లే ప్రయోగాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఇస్రో ప్రకటించింది. మళ్లీ ప్రయోగం ఎప్పుడు ఉంటుందనే దానిపై తర్వలో నిర్ణయం తీసుకుంటామని ఇస్రో అధికారులు తెలిపారు. భారత్ ప్రయోగించనున్న అత్యాధునిక ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం జీఐఎస్ఏటీ-1 అన్న విషయం తెలిసిందే. 2,268 కేజీల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీయో స్టేషనరీ క్షక్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్10 రాకెట్‌ను ఇస్రో ఎంపిక చేసింది. మార్చి 5 సాయంత్రం 5.43 గంటలకు ప్రయోగం చేపట్టాలని నిర్ణయించింది. కానీ సాంకేతిక అవాంతరాలు ఏర్పడటంతో..ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ఇస్రో తాజాగా ప్రకటించింది.
* ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక ఎన్నికలపై మంత్రులతో విడిగా సీఎం సమావేశం జరిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 24శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను.. అధికారులు ప్రభుత్వానికి అందించారు. 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా కేబినెట్‌‌లో చర్చించారు.
*కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మాన్సస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజును తొలగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్‌చైర్మన్‌గా ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న సింహాచలం ఆలయ చైర్మన్‌గా సంచిత ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. సంచిత గజపతిరాజు బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మాన్సస్‌ ట్రస్ట్‌కు 108 ఆలయాలు, 14,800 ఎకరాల భూములు ఉన్నాయి.
*విజయవాడజిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల మహిళల స్పోర్ట్స్ మీట్ ఉదయం ప్రారంభమైంది. పోటీలను జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ మహిళా సదస్సును విజయవాడలో నిర్వహించనున్నట్టు చెప్పారు. మహిళలు అన్ని రంగంలో ముందుండాలని ఆయన అభిలషించారు.
*కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామూహిక సమావేశాలు తక్కువగా చేయాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ఒకే ప్రదేశంలో వేలాది మంది సామూహికంగా హోలీ వేడుకలను నిర్వహించుకుంటున్న విషయం విదితమే. ఉత్తర భారతదేశంలో హోలీని ఘనంగా నిర్వహిస్తారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో హోలీ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి.
* మాజీ విప్ రవికుమార్‌కు నోటీసులు ఆయన లేని సమయంలో ఇంటి గోడకు అతికించిన పోలీసులు
టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్‌కు మంగళవారం సరుబుజ్జిలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సరుబుజ్జిలి మండల విస్తరణాధికారిపై దుర్భాషలాడిన అభియోగంపై రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచి బెయిల్ మంజూరు చేశారు. మంగళవారం సరుబుజ్జిలి ఎస్‌ఐ టి. నర్సింహమూర్తి శ్రీకాకుళంలోని రవికుమార్ ఇంటికి వెళ్లి తదుపరి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఆయన వెళ్లే సమయానికి రవికుమార్ ఇంటిలో లేకపోవడంతో ఇంటి గోడపై నోటీసును అతికించి, వీడియో, ఫొటోలు తీసుకొని వెళ్లిపోయారు.
*జీశాట్‌-1ను ఇస్రో ఈనెల 5వ తేదీన ప్ర‌యోగించ‌నున్న‌ది. ఆ రోజున సాయంత్రం 5.43 నిమిషాల‌కు ప్ర‌యోగం జ‌ర‌గ‌నున్న‌ది. జియోస్టేష‌న‌రీ ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ శాటిలైట్‌ను భార‌త్ ప్ర‌యోగించ‌డం ఇదే తొలిసారి.
*రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. గవర్నర్‌ను సీఎం కేసీఆర్‌ కలిసి బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలను గవర్నర్‌ దృష్టికి సీఎం కేసీఆర్‌ తీసుకెళ్లారు.
* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. బుధవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఎన్‌పీఆర్‌లోని కొన్ని అంశాలపై మంత్రివర్గం చర్చించింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, రామాయపట్నం పోర్టు నిర్మాణాలపై సమావేశంలో చర్చించారు. దీంతో పాటు ఉగాదికి 25లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీపై సన్నద్ధత, ఓడరేవుల నిర్మాణం, బడ్జెట్‌, ఆర్థిక విధివిధానాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
*రాజధాని ప్రాంత రైతులు ఈనెల పదిహేనవ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. అమిత్ షా హైదరాబాద్ వస్తున్నా సందర్భంగా ఆయనను అక్కడే కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అమిత్ షా కూడా రాజధాని రైతులను కలిసేందుకు సమయం ఇచ్చినట్టు తే;లిసింది.
*సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. క్రిప్టోకరెన్సీలకు అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. క్రిప్టోకరెన్సీలతో లావాదేవీలు చేయకూడదని భారతీయ బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. వర్చువల్‌ కరెన్సీ లేదా క్రిప్టోకరెన్సీగా పేరుగాంచిన బిట్‌కాయిన్‌ లావాదేవీలను నిలిపివేయాలంటూ.. 2018 ఏప్రిల్‌లో ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆ సర్క్యూలర్‌ను సవాల్‌ చేస్తూ ఇంటర్నెట్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం సుప్రీంను ఆశ్రయించింది. రోహిటన్‌ నారీమన్‌, రవీంద్ర భట్‌, సుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఆ సర్క్యూలర్‌ను కొట్టి వేస్తూ తీర్పును ఇచ్చింది. ట్రేడింగ్‌లో క్రిప్టోలను ఆర్బీఐ నిషేధించడాన్ని కోర్టు తప్పుపట్టింది. వాస్తవానికి క్రిప్టో ట్రేడింగ్‌ను ఆర్బీఐ ఆపలేదు. కేవలం బ్యాంకులకు మాత్రం గతంలో ఆర్బీఐ తన ఆదేశాలను జారీ చేసింది.
*మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బిజెపి కుట్ర పన్నిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలను బిజెపి నేతలు ప్రలోభాలు చూపి హర్యానాలోని ఒక హోటల్‌కు తరలించారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌ ఆర్థిక మంత్రి తరుణ్‌ భానోత్‌ ధృవీకరించారు.
*తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కొద్దిగా గ్యాప్ ఇచ్చిన ఐటీ (ఇన్‌కం టాక్స్) అధికారులు మళ్లీ ఇప్పుడు దాడులు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో… బెంజ్‌సర్కిల్‌లోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీల క్యాంపస్‌లలో ఐటీ దాడులు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచీ ఈ దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా… కొన్ని రికార్డుల్ని అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో… అధికారులు కొన్ని ప్రత్యేక కారణాలు, అనుమానాలతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలిసింది. ఐటీ తనిఖీల్లో కొన్ని ప్రత్యేక పత్రాలు, రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే… దాడుల వెనక రాజకీయ కోణం ఉండి ఉండొచ్చని కొంత మంది టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ… ఐటీ అధికారులు మాత్రం దీనిపై స్పందించలేదు. తనిఖీలలో వారు నిమగ్నమయ్యా
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత అర్ధరాత్రి పది నిమిషాల వ్యవధిలో పది జీవోలను రహస్యంగా విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాత్రి 11:45 గంటల నుంచి 11:55 మధ్య పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ జీవోలను విడుదల చేసింది. యాభై శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం అర్ధరాత్రి ఈ జీవోలను విడుదల చేయడం గమనార్హం.
*కడప జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు అమెరికాలో వైద్యక్రమశిక్షణా సంఘం బోర్డు రాష్ట్ర స్థాయి మెంబర్‌గా ఎంపికయ్యారు. జమ్మలమడుగుకు చెందిన గుద్దేటి శ్రీనివాసరెడ్డి అమెరికాలో మెడిసిన్‌ చదివి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం అక్కడ 20 ఏళ్లుగా రేడియాలజిస్టు (ఎండీ)గా పనిచేస్తున్నారు. ఈయన భార్య లలిత అమెరికాలోనే చర్మవాధి నిపుణురాలిగా పనిచేస్తున్నారు.ఇటీవల అమెరికాలోని ఇల్లినాయిస్‌ రాష్ట్ర గవర్నర్‌ ప్రైజ్‌కర్‌ శ్రీనివాసరెడ్డిని వైద్యక్రమశిక్షణా సంఘం బోర్డు రాష్ట్ర స్థాయి మెంబర్‌గా ఎంపిక చేశారు. ఈ మేరకు శ్రీనివాసరెడ్డి తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి మీడియాకు సమాచారం తెలిపారు.
*హైదరాబాద్‌లో కలకలం రేపిన కరోనా వైరస్ ఇప్పుడు తూర్పుగోదావరి వాసులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తోంది. జిల్లాలోని కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడు దక్షిణ కొరియా వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అనంతరం స్వగ్రామమైన వాడపాలేనికి వెళ్లాడు.
విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన హైదరాబాద్ అధికారులు, అతనికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో, అతడికి సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. అప్రమత్తమైన కలెక్టర్ జిల్లా అధికారులు, ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడు స్వగ్రామం నుంచి తన అత్తగారి ఊరైన గోదశపాలెం వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఈ వార్త కాస్తా వెలుగులోకి రావడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, బాధితుడికి కరోనా వైరస్ సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని అధికారులు తెలిపారు…
*మహమ్మారిలా విస్తరిస్తున్న కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. ఆ ప్రాణాంతక వైరస్ను అదుపు చేసేందుకు అన్ని దేశాలు నడుం బిగించాయి. కరోనాపై పోరాటం చేస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు .. వరల్డ్ బ్యాంక్ సుమారు 12 బిలియన్ల డాలర్లు సాయం అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ ప్యాకేజీ తరహాలో వరల్డ్ బ్యాంక్ ఆయా దేశాలకు ఆ డబ్బును ఖర్చు చేయనున్నారు. తక్కువ వడ్డీతో రుణాలు, గ్రాంట్లు, టెక్నికల్ సహకారం అందించేందుకు కూడా వరల్డ్ బ్యాంక్ సిద్దమైంది. కరోనా వ్యాప్తితో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు వరల్డ్ బ్యాంక్ భారీ రుణ సాయానికి సిద్దమైంది. తాము ఇచ్చే నిధులతో అభివృద్ధి చెందుతున్న దేశాలు.. పబ్లిక్ హెల్త్ వ్యవస్థను పటిష్టం చేయాలని వరల్డ్ బ్యాంక్ పేర్కొన్నది. అత్యంతపేద దేశాలను ఎంపిక చేసి.. నిధులను చేరవేస్తామని వరల్డ్ బ్యాంక్ చెప్పింది.
*సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో తెలంగాణలో అధిక దిగుబడి ఇచ్చే కర్రపెండలం పంట సాగును ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. తమిళనాడు రాష్ట్రం సేలం సమీపంలోని ఏతాపూర్ గ్రామంలో ఉన్న కర్రపెండలం, ఆముదం పరిశోధన, విత్తనోత్పత్తి క్షేత్రాలను ఆయన మంగళవారం సందర్శించారు.
*తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పింఛనుదార్లకు 4.02 శాతం కరవు భత్యాన్ని పెంచుతూ ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు మంగళవారం ఉత్తర్వులు జారీ శారు. ఈ సంవత్సరం జనవరి మొదటి తేదీ నుంచి దీనిని వర్తింపజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు
*ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తెలంగాణలో ఐటీ పరిశ్రమ గత ఐదేళ్లలో గణనీయమైన వృద్ధి సాధించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఈఎస్సీ), భారత ప్రభుత్వ వాణిజ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా సాఫ్ట్-2020 పేరిట ఏర్పాటు చేసిన సదస్సును మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
*తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు నాలుగు శాతం రిజర్వేషన్ల కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం జస్టిస్ అరుణ్ మిశ్ర నేతృత్వంలోని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. జాబితాలో ముఖ్యమైన ఇతర కేసుల విచారణ నేపథ్యంలో ఈ పిటిషన్ను తర్వాత విచారిస్తామని జస్టిస్ అరుణ్ మిశ్ర పేర్కొన్నారు. పిటిషన్ బుధవారం విచారణకు రాకుంటే హోలీ సెలవుల అనంతరం చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
*అంగన్వాడీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పెంచిన మేరకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సంఘం(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు ఎం.పద్మ డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అంగన్వాడీ ఉద్యోగులు తరలివచ్చారు.
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999లో జరిగిన గ్రూపు-2 నియామకాలకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. గ్రూపు-2 నియామకాల్లో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారంటూ నల్గొండ శ్రీనివాసరావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ హేమంత్ గుప్తా ధర్మాసనం ముందుకొచ్చింది. ఏపీపీఎస్సీ నుంచి మరిన్ని వివరాలు తీసుకొని తాజాగా ప్రమాణపత్రం దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున న్యాయవాది జీఎన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణ మార్చి 17కు వాయిదా వేసింది.
*ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం మార్చి 26న హైదరాబాద్లో బహిరంగ విచారణ నిర్వహిస్తున్నట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఓ ప్రకటనలో తెలిపింది. వేధింపులకు గురైన ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలకు చెందిన వారెవరైనా ఉంటే వారు తమ ఫిర్యాదులను ఈ నెల 11 లోపు దిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ కార్యాలయానికి పోస్టు రూపంలో కానీ ఈ-మెయిల్ ద్వారా కానీ పంపాలని తెలిపింది. 011-24651332, 24651334 నంబర్లకు ఫ్యాక్స్ ద్వారా కూడా ఫిర్యాదులు పంపొచ్చని పేర్కొంది. ఆయా ఫిర్యాదులపై మార్చి 26న నిర్వహించే బహిరంగ విచారణలో విచారణ చేపడతామని తెలిపింది
*ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి తమిళనాడులోని రామేశ్వరానికి, కేరళలోని కొచువెళికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్-రామేశ్వరం-హైదరాబాద్ మధ్య మార్చి 6 నుంచి మే 31 మధ్య నల్గొండ, గుంటూరు, రేణిగుంట మార్గంలో 26 సర్వీసులు.. హైదరాబాద్-కొచువెళి-హైదరాబాద్ మధ్య మార్చి 7 నుంచి జూన్ 1 వరకు నల్గొండ, గుంటూరు, తిరుపతి మార్గంలో రాకపోకలు సాగిస్తాయి.
*ప్రస్తుత బడ్జెట్ సవరించిన అంచనాల కంటే 12 నుంచి 15 శాతం అధికంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ లెక్కన బడ్జెట్ పరిమాణం సుమారు రూ.1.50 లక్షల కోట్ల నుంచి రూ.1.55 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర రాబడుల్లో వృద్ధిరేటు జనవరి వరకు 6 శాతం మాత్రమే ఉంది. భూముల అమ్మకం ద్వారా రూ.10 వేల కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకోగా.. ఈ మొత్తం రాలేదు. ఈ నేపథ్యంలో రూ.1.46 లక్షల కోట్ల ప్రస్తుత బడ్జెట్ అంచనాలను సవరించి రాబడి అంచనాల ప్రాతిపదికగా 2020-21కి సంబంధించిన పద్దులను సర్కారు సిద్ధం చేస్తోంది.
*విజయ డెయిరీ తరపున రైతుల నుంచి పాల సేకరణ పెంపుపై దృష్టి పెట్టాలని అధికారులను పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు. పశు సంవర్ధకశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనిత రాజేంద్ర మంగళవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. జిల్లావారీగా సమావేశాలు నిర్వహించి పాడిరైతులు, మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానన్నారు.
*ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందాలను ఉల్లంఘించి అదనంగా నడుపుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సులను మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపోలో అధికారులు అడ్డుకున్నారు. బీదర్, గుల్బర్గా జిల్లా డిపోలకు చెందిన బస్సులు చాలా కాలంగా నిబంధనలు అతిక్రమించి జహీరాబాద్ మీదుగా హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నాయి. దాంతో తెలంగాణ ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోందని అధికారులు గుర్తించారు. మంగళవారం బస్సుల అనుమతి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి అనధికారికంగా వచ్చిన 12 బస్సులను నిలిపివేశారు.
*మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణాన్ని 2020 అక్టోబర్ నాటికి పూర్తిచేసేలా నిధులు ఇవ్వాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం చేపట్టిన రూ.1,618 కోట్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.233 కోట్లు మాత్రమే విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
*రాష్ట్రంలో మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలకు రూ.1783 కోట్ల బకాయిలున్నాయని ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ ప్రొహిబిషన్ మంత్రి కె.నారాయణస్వామి వెల్లడించారు. బకాయిలను దశలవారీగా చెల్లించేలా కార్యాచరణ చేపట్టామని, అవసరమైతే రుణాలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయంలో తన శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు.
*ఈ నెల 8న హైదరాబాద్లో డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ సమావేశం నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) జె.చంద్రశేఖర్ అయ్యర్తోపాటు సభ్యులు పోలవరం పనులు పరిశీలించారు. మంగళవారం ఉదయంనుంచి ప్రాజెక్టులో ఈ సీజన్లో చేపట్టిన పనులతీరును జలవనరుల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి నదికి వరదలు వచ్చే నాటికి ఎంత వరకు పనులు జరుగుతాయి అన్నదానిపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 జూన్నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలన్న సంకల్పంతో ఉందని పనుల్లో వేగం పెంచినట్లు జలవనరుల శాఖాధికారులు చెప్పారు.
*అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ ఈసెట్-2020 ద్వారా ఈ సంవత్సరం అగ్రి ఇంజినీరింగ్లోకి ప్రవేశాలు కల్పించనున్నారు. మంగళవారం ఏపీ ఈసెట్ ప్రకటనను కన్వీనరు భానుమూర్తి విడుదల చేశారు. ఈనెల 5 నుంచి రూ.550 ఆన్లైన్లో రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిప్లొమా విద్యార్థులకు ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ మాథమాటిక్స్ ద్వితీయ సంవత్సరంలోకి అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలోకి ఈసెట్ ద్వారా నేరుగా చేరవచ్చని తెలిపారు. ఏప్రిల్ 2 దరఖాస్తులకు చివరి గడువు. 30న పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.
*నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కింద ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం లాటరీ తీయాలని రెవెన్యూ శాఖ (భూ వ్యవహారాలు) ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉగాది నాటికి పేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ భూ సేకరణ, లబ్ధిదారుల ఎంపిక పూర్తయినందున లాటరీ నిర్వహించి కేటాయింపులు చేయాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు
*అమరావతి మండలం లేమల్లెలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై దాడికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో 34 మంది అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలకు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం రాత్రి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. బాపట్ల డీఎస్పీ కార్యాలయానికి ఐకాస నేతలను పోలీసులు పిలిపించారు. నేతల తరఫున వచ్చిన న్యాయవాదులు ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించాక పూచీకత్తు తీసుకుని బెయిల్ ఇచ్చారు.
*జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పరీక్ష(ఎన్ఎంఎంఎస్) ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎం.సుబ్బారెడ్డి తెలిపారు. ఫలితాలను వెబ్సైట్ www.bseap.org ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న 548 విద్యార్థులు ఉపకారవేతనాలకు ఎంపికైనట్లు పురపాలక సంచాలకులు విజయకుమార్ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.12వేలు చొప్పున నాలుగేళ్లు ఉపకారవేతనాలు అందనున్నాయి.
*ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ వెబ్సైట్ను ఆ శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో పర్యాటకశాఖ అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. వెబ్సైట్లో పర్యాటకులకు కావాల్సిన సమాచారాన్ని పొందుపరిచామన్నారు.
*హజ్ పర్యటనలో యాత్రికులకు సేవ చేయడానికి వాలంటీర్లుగా 12 మంది ఎంపికయ్యారు. విజయవాడలోని హజ్ కమిటీ కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి అంజద్బాషా మంగళవారం డ్రా నిర్వహించి వీరిని ఎంపిక చేశారు.
*కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ’ కు ‘కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ’గా పేరు మారుస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కార్మిక శాఖలోని కొన్ని విభాగాలను బదిలీ చేశారు. దీంతో ఆయా విభాగాలను తొలగించి కార్మిక శాఖకు పేరు మారుస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులిచ్చింది.
*పోలవరం ప్రాజెక్ట్ను జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించినందున వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కె.వి.పి.రామచంద్రరావు దాఖలు చేసిన పిల్పై విచారణ ఏప్రిల్ 24కు వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.
*గ్రామ న్యాయాలయాల్లో న్యాయాధికారుల నియామకంపై విధివిధానాలను రూపొందిస్తూ రాష్ట్ర న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన న్యాయవాదుల నుంచి నేరుగా, సబార్డినేట్ జ్యుడీషియరీ నుంచి బదిలీల ద్వారా, విశ్రాంత న్యాయాధికారులను తీసుకోవడంద్వారా గ్రామ న్యాయాధికారులను నియమిస్తారు. గ్రామ న్యాయాధికారి పారితోషికాన్ని రూ.27,700 నుంచి రూ.44,700గా నిర్ణయించారు.
*రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు, ఎంపిక చేసిన ప్రాంతాల్లో ముళ్లకంచెలు, పిచ్చి మొక్కలు తొలగించేందుకు (జంగిల్ క్లియరెన్స్), డీజీపీఎస్ సర్వే నిర్వహించి, సరిహద్దు రాళ్లు వేసేందుకు బిడ్లు ఆహ్వానిస్తూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) టెండరు ప్రకటన జారీ చేసింది. ఐదు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. మొత్తం పనుల అంచనా విలువ రూ.3.86 కోట్లుగా పేర్కొంది. ఈ నెల తొమ్మిదో తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది.