Health

సత్తుపల్లి డిపో మహిళా కండక్టర్‌కు కరోనా పరీక్షలు-TNI ప్రత్యేకం

Sattupalli Depot Conductor Being Tested For Corona Virus

* తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో బస్సు మహిళా కండక్టర్‌ కరోనా లక్షణాల అనుమానంతో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఆసుపత్రిలో చేరారు. చింతలపూడి ఆసుపత్రి వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి నుంచి బస్సు ఏలూరు వెళ్తుండగా అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన ఆమె ఆసుపత్రిలో చేరారు. రక్త నమూనా ఫలితాలు వచ్చిన తర్వాతే కరోనా వైరస్‌ ఉందా? లేదా? అనేది నిర్ధరిస్తామని వైద్యులు తెలిపారు.

* తెలంగాణ ప్రజలకు శుభవార్త కరోనా కేసులు నెగెటివ్ వచ్చాయి. ఇది మన అదృష్టం… ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.  తెలంగాణ  రాష్ట్రం లో ఒక వ్యక్తి కి కోవిడ్-19 పాజిటివ్ రావడం, మరో 88 మంది ఆయనకు కలవడం తో రాష్ట్రము లో ఒక్క సారిగా భయాందోళనలు కలిగాయి. బయటికి చెప్పక పోయినా చాల బాధ కలిగింది. రెండు కేసులు అనుమానం ఉండడంతో పరీక్ష కోసం పూణే పంపించాం. ఎటువంటి ఫలితం వస్తుందో అని ఉత్కంఠగా ఎదురుచూశాం. అలవాటు లేకపోయినా ఎం కాకూడదు అని దేవుణ్ణి ప్రార్ధించాం. చివరగా అనుమానిత ఇద్దరికీ కోవిడ్-19 నెగిటివ్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం . ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ అంతా బాధలో ఉంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటె సంతోషం. ఇక మీదట కూడా వైరస్ ఎవరికీ సోకకుండా ఉంటుంది అని భావిస్తున్నాం. ప్రతి రోజు అప్రమత్తత ఉన్నాము. ప్రభుత్వం తో జిమ్మెదారీ తనంతో పనిచేస్తుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలను దాచుకొనే పరిస్థితి ఉండదు. మంత్రి గా మరో సారి చెప్తున్నా ఈ వైరస్ గాలి ద్వారా రాదు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కలిసి ఉన్న అమ్మ నాన్నకి కూడా వైరస్ సోకలేదు అలాంటిది మహేంద్రహిస్ల్స్ లో ఉన్న మిగతా వారికీ ఎలా వస్తుంది ఒక్క సారి ఆలోచించండి. కిటికీలు తీయకుండా ఉంటున్నారని తెలిసింది .. మనం 21 వ సెంచరీ లో ఉన్నామా ? ఎక్కడ ఉన్నాము.   సాఫ్ట్వేర్ లో పని చేసే అమ్మాయి కి వైరస్ ఉందని మొత్తం బిల్డింగ్ ఖాళీ చేసారు. ఆ అమ్మాయికి నెగెటివ్ వచ్చింది. దయచేసి అతిగా స్పందిచకండి. చదువుకున్న వారు భాద్యతయుతంగా వ్యవహరించండి. లేదంటే సమాజానికి నష్టం.  ఇది మేలుకోరేవారు చేసేది కాదు. 22 రిపోర్ట్స్ కూడా నెగెటివ్ వచ్చింది.  ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేస్తాం. అనుమానం ఉంటె కాదు డాక్టర్స్ నిర్ధారిస్తేనే పరీక్షలు చేస్తాము. దేశవ్యాప్తంగా 12 లాబ్ లు మాత్రమే ఉన్నాయి. ప్రైవేట్ లో ఎక్కా పరీక్షలు చెయ్యరు. గాంధీ లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తాం. ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్స్ తో సమీక్ష నిర్వహించాము. దేశంలో మొదటి సారిగా ఇటువంటి వైరస్ ఉన్న వారికి చికిత్స ఇచ్చే అవకాశం ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇచ్చాము. ఈ అవకాశం ను వ్యాపారకోణం లోచూడకండి. వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి  చికిత్స అందించేందుకు ఎంత ఛార్జ్ చేయాలి అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దీనికి ప్రైవేట్ హాస్పిటల్స్ వారు కూడా అంగీకరించారు. వారికి ధన్యవాదములు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఉచితంగా చికిత్స అందించేందుకు  ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు. అంతకీ అవసరం అయితే కట్టిఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వాడుకుంటాం. 80 వేల  రూములు అందుబాటులు ఉన్నాయి.   సెర్వెలెన్స్ కోసం 200 మెరికల్లాంటి వైద్య సిబ్బంది ని ఎపిక చేసి శిక్షణ అందిస్తున్నాం. రేపటినుండి వారు విధులు మొదలు పెడతారు. సాహసంతో పనిచేసేవారిని మాత్రమే రావాలని చెప్పాము. గాంధీ ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయి కాబట్టే అక్కడ కరోనా ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేసాము. వైరస్ సోకినా వ్యక్తికి మల్టీపుల్ ఆర్గాన్ సమస్య వస్తే ఇలాంటి హాస్పిటల్స్ మాత్రమే చికిత్స అందిచగలవు. జూనియర్ డాక్టర్స్ చేస్తున్న ఆందోళన అర్ధరహితం. అన్నీ తెలిసిన డాక్టర్స్ ఇలా చేయడం సమంజసం కాదు.  మాస్క్ లు  ప్రతి ఒక్కరు వాడాల్సిన అవసరం లేదు. ప్రజల భయంతో వ్యాపారం చేస్తే సహించం. అధికధరలకు అమ్మే వారిపై శాఖాపరమైన  దాడులు చేయిస్తాం.  తెలంగాణ ప్రజలారా వట్టి వదంతులు నమ్మకండి. విశ్వాసం కలిపించే ప్రయత్నం మీడియా చేయండి.

* గాంధీ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరుతున్న కొందరు అనుమానితులు తమకు ఇష్టమైన ఆహారం తెప్పించాలని వైద్యులను వేడుకుంటున్నారు. కొందరు తామే సొంతంగా స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ఆర్డర్‌ చేసి తెప్పించుకుంటున్నారు. చైనా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కరోనా అనుమానంతో ఇటీవల గాంధీలో చేరారు. ఒకరోజుపాటు ఐసోలేషన్‌లో ఉన్న వీరు.. తమకు కేఎఫ్‌సీ నుంచి ఆహారం తెప్పించాలని కోరారు. వాస్తవానికి ఆసుపత్రిలో చేరిన వారికి అక్కడి మెనూ ప్రకారం ఆహారం అందిస్తారు. ఐసోలేషన్‌లో ఉన్నవారిలో కొందరికి ఈ ఆహారం రుచించడం లేదు. ఇక అవుట్‌ పేషెంట్ల కింద కొందరు అనుమానితులు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో కొందరు ఫుడ్‌ యాప్‌ల ద్వారా ఆహారాన్ని తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఆర్డర్లు హెల్ప్‌డెస్కు వరకు చేరుతుండగా అక్కడ నుంచి సిబ్బంది ఐసోలేషన్‌ వార్డుకు చేర్చుతున్నారు. జలుబు, దగ్గు లాంటి సాధారణ లక్షణాలు ఉన్నవారికి మానవతా దృక్పథంతో బయటి ఆహారానికి అనుమతి ఇస్తున్నట్లు సమాచారం.

* కొవిడ్‌-19 వైరస్‌ తీవ్రత చైనాలో తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు తగ్గుతున్నాయి. హుబెయ్‌ ప్రావిన్సులోని తాత్కాలిక ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ అవుతున్నాయి. వీటిని క్రమంగా మూసివేయనున్నారు. ఇరాన్‌లో మాత్రం తీవ్రత పెరిగింది. ఒక్క ప్రావిన్సు మినహా ఆ దేశం యావత్తూ కొవిడ్‌-19 (కరోనా) బారిన పడింది. 92 మంది ప్రాణాలు కోల్పోయారు. హాంకాంగ్‌లో ఓ కరోనా రోగి పెంపుడు కుక్కకూ ఈ వైరస్‌ సోకింది. చైనా వెలుపల 80% కేసులు ఇరాన్‌, దక్షిణ కొరియా, ఇటలీలలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఇరాక్‌లో తొలి మరణం నమోదయింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సోకినవారిలో 3.4% మంది చనిపోయారని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తెలిపారు. అమెరికాలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

* కరోనా వైరస్‌ బాధితుడి కుటుంబ సభ్యులు ఎవరితోనూ కలవవద్దని వైద్యులు సూచించినా వినడంలేదంటూ ఆ కాలనీ అధ్యక్షుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌లోని ఓ కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అతనిని గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు అతడి కుటుంబీకులు, అతడితో కలిసి తిరిగిన వారందరినీ పరీక్షించారు. వారెవరికీ వైరస్‌ సోకలేదని తేలడంతో ఇళ్లకు పంపించేశారు. ‘వైద్యులు వారిని ఇంట్లోనే ఉండాలని, ఎవరితోనూ కలవవద్దని చెప్పారు. కానీ వారి పక్కింట్లోని వ్యక్తి.. ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని కలిసి తిరిగి వారి ఇంటికి వస్తున్నారు. వారి ద్వారా ఇంకెవరికైనా కరోనా సోకే ప్రమాదం తలెత్తవచ్చు. కనుక వారెవరూ ఇతరులతో కలవకుండా చూడండి’ అని కోరుతూ ఆ కాలనీ కోపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి కంటోన్మెంట్‌ సీఈవోకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.