DailyDose

రేవంత్‌కు 14రోజుల రిమాండ్-తాజావార్తలు

Telugu Breaking News Roundup-Revanth Reddy Remanded For 14 Days

* కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజేంద్రనగర్‌లోని జడ్జి నివాసంలో రేవంత్‌ను పోలీసులు హాజరుపర్చారు. రేవంత్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించారు. రేవంత్‌రెడ్డిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారని రేవంత్‌పై అభియోగం ఉందని పోలీసులు చెబుతున్నారు. అంతకు ముందు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వస్తుండగా రేవంత్‌రెడ్డిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారని రేవంత్‌పై అభియోగం, ఇప్పటికే నలుగురు రేవంత్‌రెడ్డి అనుచరులను అరెస్ట్‌ చేశారు. రేవంత్ సహా 8 మందిపై నార్సింగ్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదయ్యాయి.

* ఏపీ భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెడితే మంచిదని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని ఉద్యమంపై రాసిన ‘అమరావతి ఆక్రందన’, ‘స్టాప్‌ అన్‌డూయింగ్‌ ఆఫ్‌ అమరావతి’ పుస్తకాలను సుజనాచౌదరి దిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజధాని ఉద్యమంలో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని చెప్పారు. వైకాపా నేతలు అమరావతిలో ఒకమాట.. దిల్లీలో మరోమాట చెబుతున్నారని ఆరోపించారు.

* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికలకు బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని.. బ్యాలెట్‌ పత్రాల ప్రింటింగ్‌ కూడా పూర్తి కానుందని చెప్పారు. అవసరమైతే తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలనేది తేలుస్తామని ఆయన వివరించారు.

* ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా (కొవిడ్‌-19) సోకలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కరోనా విషయంలో ఎప్పుడూ అతిగా స్పందించకూడదని.. భారత్‌లో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. కరోనా వ్యాప్తి కలకలం నేపథ్యంలో 4 రోజులుగా రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొందన్నారు. కరోనాపై అవగాహన కల్పించడంలో మీడియా బాగా సహకరించిందని చెప్పారు. అనుమానం, డబ్బులు ఉంటే చేసే పరీక్షలు కావని.. ఆస్పత్రిలో చేరాలంటే కచ్చితంగా కరోనా లక్షణాలు ఉండాల్సిందేనని ఈటల స్పష్టం చేశారు.

* నిర్భయ కేసులో నిందితులను మార్చి 20వ తేది ఉదయం ఉరి తీసేందుకు అంతా సిద్ధమౌతోంది.ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు డెత్‌వారెంట్లు జారీ చేసిన దిల్లీ పటియాలా కోర్టు మరోసారి డెత్‌వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందిస్తూ మార్చి 20 ఉదయం తమ జీవితాలకు మరో కొత్త ఉదయం అవుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈసారైనా ఖచ్చితంగా వారికి మరణశిక్ష అమలు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. 2012లో జరిగిన ఘటనలో కోర్టు పలుమార్లు విచారణ జరిపి నలుగురు నిందితులకు మరణశిక్షను ఖరారు చేసింది.

* దేశంలోని ప్రతి వివాహిత మహిళ ఆరుగురికి జన్మనివ్వాలని వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో విజ్ఞప్తి చేశారు. దేశం బాగు కోసం పిల్లల్ని కనాలని సూచించారు. దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్షుడు ఇలా పిలుపునివ్వడంపై ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. జాతీయ మహిళా ఆరోగ్య కార్యక్రమంపై ఓ టీవీ కార్యక్రమంలో మదురో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రతి ఒక్క మహిళా ఆరుగురేసి బిడ్డలకు జన్మనివ్వాలని కోరారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

* ఈనెల బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరగాల్సిన ‘భారత్‌-యురోపియన్‌ యూనియన్‌ సదస్సు’ కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రసెల్స్ పర్యటన రద్దయినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనావైరస్‌ కారణంగా విదేశీ ప్రయాణాలు చేయకూడదని ఇరుదేశాల ఆరోగ్యశాఖ అధికారులు సూచించినట్లు తెలిపింది. అనుకూలమైన మరో తేదీన ఈ సదస్సు నిర్వహించేందుకు ఇరుదేశ అధికారులు నిర్ణయించారని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ వెల్లడించారు.

* ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది. దక్షిణాఫ్రికాను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఓడించి వరుసగా ఆరో సారి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా మెగాటోర్నీ ఫైనల్‌ చేరుకుంది. దక్షిణాఫ్రికా పురుషుల మాదిరిగానే మహిళల ఆశలనూ వరుణుడే అడియాసలు చేశాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ఆరంభమైంది. ఆసీస్‌ 134/5 పరుగులు చేయగా.. ఛేదనలో వరుణుడు మరోసారి అంతరాయం సృష్టించడంతో సఫారీల లక్ష్యం 13 ఓవర్లకు 98గా నిర్ణయించారు. దక్షిణాఫ్రికా 92 పరుగులే చేయగలిగింది.

* చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ భారత మార్కెట్‌లోకి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. గతంలో తీసుకొచ్చిన రియల్‌మీ 5, 5ప్రోకు కొనసాగింపుగా రియల్‌మీ 6, రియల్‌మీ 6ప్రో ఫోన్లను ఈ రోజు విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లూ ముందువైపు హోల్‌పంచ్‌ కెమెరాలతో వస్తున్నాయి. రియల్‌మీ 6లో సింగిల్‌ పంచ్‌హోల్‌ కెమెరా ఉండగా.. 6ప్రోలో డ్యూయల్‌ పంచ్‌ హోల్‌ కెమెరాలు ఉన్నాయి. రెండు ఫోన్లు కూడా ఇస్రో రూపొందించిన నావిక్‌ చిప్‌తో పనిచేయనున్నాయి.

* ఆధార్‌ కార్డుపై చిరునామాగా జైలు అడ్రసు ఇవ్వడంతో హత్యకేసులో ఓ నిందితుడు పోలీసులకు సులువుగా చిక్కాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల లఖ్‌నవూ జిల్లా గోసాయిగంజ్‌ సమీపంలోని శేఖర్‌పూర్‌ ప్రాంతంలో సంతోష్‌ తివారీ (40) అనే ట్రక్‌డ్రైవర్‌ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కొందరిని ప్రశ్నించారు. సన్నీచౌహన్‌ అనే వ్యక్తిని విచారిస్తుండగా అతడి ఆధార్‌కార్డుపై ఉన్న చిరునామాలో లఖ్‌నవూ జైలు అడ్రస్‌ ఉంది.