DailyDose

ఫ్లిప్‌కార్ట్ బన్సాల్‌పై వరకట్నం కేసు-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Dowry Case On Flipkart Founder

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 234 పాయింట్లు లాభపడి 38,643 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 11,324 వద్ద కొనసాగుతోంది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్‌ నిల్వపై వడ్డీ రేటు 8.50 శాతంగా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లయితే.. ప్రావిడెంట్‌ ఫండ్‌పై వడ్డీ ప్రస్తుతమున్న దాని కంటే 0.15 శాతం తగ్గే అవకాశముంది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆర్థికశాఖ ఆమోదించాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2018-19కిగాను ప్రావిడెంట్‌ ఫండ్‌ పై వడ్డీ రేటు 8.65 శాతంగా ఉండగా… 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.55 శాతం, 2016-17 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం గాను, 2015-16 లో అత్యధికంగా 8.8 శాతంగా ఉండేది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో ఉన్న నేపథ్యంలో ఈపీఎఫ్‌ వడ్డీరేటు కూడా తగ్గుతాయనే ఊహాగానాలు గత కొద్ది కాలంగా వినవస్తున్నాయి.

* దేశీయ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ సరికొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టారు. ఈ కారు ప్రారంభ ధర రూ.35.90లక్షలు కాగా.. టాప్‌ వేరియంట్‌ ధర రూ.42.90 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారులో చాలా కాస్మోటిక్‌ మార్పులను బీఎండబ్ల్యూ చేసింది. కారుకు సరికొత్త 2.0 బీఎస్‌6 పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చింది. ఇప్పటికే ఆడీ, బెంజ్‌ కంపెనీలు కూడా సరికొత్త బీఎస్‌6 ఇంజిన్‌తో మార్కెట్లోకి వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. సరికొత్త ఎక్స్‌1 కారు స్పోర్ట్స్‌ ఎక్స్‌, ఎక్స్‌లైన్‌, ఎం స్పోర్ట్‌ వేరియంట్లలో విడుదల చేసింది.

* ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తిస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) అమెరికాలోని ఫేస్‌బుక్‌ కార్యాలయంలో ఓ ఉద్యోగికి సోకింది. ఈ సంస్థకు సంబంధించినంత వరకూ ఇదే తొలి కేసు అని ఫేస్‌బుక్‌ అధికారులు ప్రకటించారు. కరోనా సోకిన ఆ ఉద్యోగి సియాటెల్‌లోని ఫేస్‌బుక్‌ ‘స్టేడియం ఈస్ట్‌’ కార్యాలయంలో ఫిబ్రవరి 21 వరకూ విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమ సియాటెల్‌ కార్యాలయాన్ని మార్చి 9వ తేదీ వరకూ మూసివేయనున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. అంతేకాకుండా ఈ నెలాఖరు వరకూ ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఆ కార్యాలయ ఉద్యోగులను కోరింది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రతకు తాము ప్రాధాన్యమిస్తామని… ఈ క్రమంలో వైద్యాధికారుల సలహాలు, సూచనలను పాటిస్తామని సంస్థ తెలిపింది.

* భారతీయ వ్యాపారవేత్త, ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ (38)పై వరకట్న వేధింపుల కేసు నమోదయింది. ఆయన భార్య ప్రియా బన్సల్‌ బెంగళూరులోని కోరమంగళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దంత వైద్యురాలైన ప్రియ బెంగళూరులో ఓ వైద్యశాలను నడుపుతున్నారు. బన్సల్‌ దంపతులకు పదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు.