ScienceAndTech

రాక్షసకణాల గురించి తెలుసా?

Telugu Tech News-What Are Ghost Particles

భూగర్భంలోంచి వస్తున్న ‘న్యూట్రినో’ రాక్షసకణాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అగ్నిపర్వతాలు, భూకంపాల స్థితిగతుల అధ్యయనానికి ఇవి ఎంతో ఉపయోగపడగలవని వారన్నారు. భూగర్భంలోని అంతుచిక్కని (రహస్య) రాక్షసకణాల(ghost particles) ను శాస్త్రవేత్తలు ఇటీవల కనిపెట్టారు. ‘జియోన్యూట్రినో’ (భౌగోళిక ఉపాణువు కణం. ఇవి ద్రవ్యరాశితోపాటు విద్యుదావేశిత రహితంగా ఉండి, మన కంటికి కనిపించవు. కనుకే, రాక్షసకణాలుగా పిలుస్తారు)లుగా పిలిచే ఇవి చాలా అరుదుగా ద్రవ్యరాశితో అంత:చర్య (interact) జరుపుతుంటాయి. కనుకే, ప్రయోగాలకు చిక్కడం లేదు. ఇటలీలోని ప్రపంచ అతిపెద్ద భూగర్భ ప్రయోగశాల ‘బోరెక్సినో’ డిటెక్టర్‌ (Borexino detector) సహాయంతో ఈ రహస్యకణాల తాలూకు 53 ఘటనలను వారు గుర్తించారు. భూగర్భంలో సంభవించే ‘రేడియోధార్మికతా క్షయం’ (radioactive decay) నుంచి జియోన్యూట్రినోలు విడుదలైనట్లుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి మనకు కనిపించకుండా ప్రవాహాలుగా ఉపరితలంపైకి వస్తుంటాయని, 2007నుంచీ సాగిస్తున్న ఈ అన్వేషణ కిందటేడాదికి ఫలించిందని వారు తెలిపారు. అగ్నిపర్వతాలు, భూకంపాల పుట్టుక, విస్తృతి విధానాలను అవగాహన పరచుకోవడానికి ఈ సంకేతాలు ఎంతో ఉపయోగపడతాయని వారంటున్నారు. అయితే, ‘బోరెక్సినో డిటెక్టర్‌’కంటేకూడా 70 రెట్లు పెద్దదైన మరొక భూగర్భ ప్రయోగశాల ‘జూనో’ (Juno) చైనాలో ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నది.