DailyDose

కొరోనా భారత బాధితుల సంఖ్య 34-తాజావార్తలు

Total CoronaVirus Confirmed Cases In India Are 34-Telugu Breaking News Roundup Today

* భారత్‌లో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో వైరస్‌ బాధితుల సంఖ్య 34కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కేసుల్లో రెండు లద్దాఖ్‌, మరోటి తమిళనాడులో నమోదైంది. అందులో ఇద్దరు ఇరాన్‌ నుంచి లద్దాఖ్‌కు రాగా.. మరో వ్యక్తి ఒమన్‌ నుంచి తమిళనాడుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

* ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 57 ఏళ్లకే పింఛను ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. శనివారం సాయంత్రం శాసనమండలిలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంటికో ఉద్యోగం ఇస్తామని నేనెక్కడా చెప్పలేదు. ఏపీ నుంచి తెలంగాణ విడిపోతే మనకు లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. ఇప్పటికే దాదాపు లక్ష ఉద్యోగాలు ఇచ్చాం.’’ అని కేసీఆర్‌ అన్నారు.

* తెరాస నేతలు 2వేల ఎకరాల భూమి ఆక్రమించుకున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల వారు భూములు ఆక్రమించిన విషయం ప్రజలకు తెలియాలన్నారు. వెంటనే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డితో సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయించాలని భట్టి డిమాండ్‌ చేశారు.

* కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలపై మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌ సంచైత గజపతిరాజు స్పందించారు. చర్చి, మసీదులకు వెళ్తే మతం మారుతుందా?అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కుటుంబ సభ్యులే తనపై ఆరోపణలు చేయడం బాధగా ఉందని సంచైత ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఆహ్వానించాల్సింది పోయి ఇలా రాజకీయ కోణంలో ఆరోపణలు తగదన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేస్తానన్నారు.

* ‘శాసనసభలో ఏది పడితే అది మాట్లాడకూడదనే నియమం పెట్టాలి. పనిచేసే ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తే ఊరుకోకూడదు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణలో క్యాపిటల్‌ ఎక్స్‌పెండేచర్‌ రూ.59 వేల కోట్లు. గత ఐదేళ్లలో తెరాస ప్రభుత్వం పెట్టిన క్యాపిటల్‌ ఎక్స్‌పెండేచర్‌ రూ.1.60 లక్షల కోట్లు. తెలంగాణ ఏర్పడినప్పుడు జీఎస్‌డీపీ రూ.4 లక్షల కోట్లు. తెరాస ప్రభుత్వం వచ్చాక జీఎస్‌డీపీ రూ.8.66 లక్షల కోట్లు దాటింది.’ అని కేసీఆర్‌ అన్నారు.

* పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. ప్రాజెక్టు కాంట్రాక్టు నిబంధనల్లో ఉల్లంఘనలు జరగలేదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాని కార్యాలయానికి జలశక్తి శాఖ నివేదిక పంపింది. నిర్ణయాలన్నీ అధీకృత సంస్థల అనుమతితోనే జరిగాయని స్పష్టం చేసింది. 2017-18లో నాటి గుత్తేదారు జాప్యం వల్ల మరొకరికి నామినేషన్‌ పద్ధతిపై గత ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొంది. 60-సి నిబంధన మేరకే కాంట్రాక్టు సంస్థను మార్చినట్లు జలశక్తి శాఖ తెలిపింది. గుత్తేదార్లకు నిర్మాణపనులు అప్పగించే బాధ్యత రాష్ట్ర పరిధిలోనే ఉందని పేర్కొంది.

* యెస్‌ బ్యాంకు ఖాతాదారుల సొమ్ముకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ డిపాజిటర్లలో ఆందోళన తగ్గడంలేదు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యెస్‌ బ్యాంకుపై ఆర్బీఐ(రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా) మారటోరియం ప్రకటించింది. అప్పటి నుంచి తమ నగదు ఉపసంహరించుకునేందుకు ఏటీఎం కేంద్రాల ముందు ఖాతాదారులు భారీగా క్యూ కడుతున్నారు. దీంతో ఏటీఎం కేంద్రాలన్నీ నిండుకున్నాయి. చాలా మంది ఖాతాదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు కూడా నిలిచిపోయాయి.

* గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో మార్పులకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలు జారీచేశారు. గాంధీలో ఏడో అంతస్తుకు ఇతరులు వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు 14 రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిందేనన్నారు. గాంధీ కరోనా వార్డులో రెండు విభాగాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. విదేశాలకు వెళ్లొచ్చినవారిలో కరోనా లక్షణలు ఉంటే ఒక వార్డు.. విదేశాలకు వెళ్లొచ్చిన వారిలో ఆ లక్షణాలు లేకపోతే మరో వార్డు వినియోగించనున్నట్టు తెలిపారు.

* గతేడాది వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమి తర్వాత ఆటకు దూరమైన మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ.. తన భవితవ్యంపై చాలా స్పష్టంగా ఉన్నాడని, ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నాడని సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. తాజాగా పదవి నుంచి తప్పుకున్నాక ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ధోనీ భవిష్యత్‌పై స్పష్టతతో ఉన్నాడు. ఆ విషయాన్ని నాతో పాటు జట్టు యాజమాన్యంతోనూ పంచుకున్నాడు. దాన్ని గోప్యంగా ఉంచాలి కాబట్టి చెప్పలేకపోతున్నా.’ అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.

* అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తాను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆ ఒక్కరోజు తన ఖాతాలను చూసుకునే అవకాశం ఒక స్ఫూర్తిదాయక మహిళకు కల్పిస్తానని కూడా చెప్పారు. ఈ మేరకు ‘షీఇన్‌స్పైర్స్‌అజ్‌‌’ అనే హాష్‌ట్యాగ్‌తో మీకు తెలిసిన స్ఫూర్తిదాయక మహిళల గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలని ప్రజలను కోరారు. ఈ మేరకు శీలాభట్‌ అనే మహిళ పోస్టు చేసిన రుచిశర్మ స్టోరీని ప్రధాని మోదీ కార్యాలయం చూసింది. స్ఫూర్తిదాయక మహిళగా రుచిశర్మ గుర్తించింది. మోదీ ఖాతాలను ఒకరోజు పాటు ఆమెకు అప్పజెప్పనున్నట్లు ప్రకటించింది.