Kids

తుమ్మచెట్ల విశేషాలు

Telugu Kids Fun Info-Thumma Plants And Thorns

హాయ్‌ ఫ్రెండ్స్‌… నేను మీకు తెలుసా? అంతగా తెలియదుకదా? మీ అమ్మనో నాన్ననో అడిగి చూడండి… వాళ్లకి తెలిసే ఉంటా… ఊళ్లలో, తోటల దగ్గర అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాగా… ఇంతకీ నా పేరేంటి? విశేషాలేంటి? తెలుసుకోవాలనుందా? అయితే చదివేయండి!
***నేనూ నాలో రకాలు!
నల్ల తుమ్మ, తెల్ల తుమ్మ, ఆస్ట్రేలియా తుమ్మ, నాగ తుమ్మ, సర్కార్‌ తుమ్మ అంటూ నాలో దాదాపు 160 రకాల జాతులుంటాయి.
నేనూ నా రూపం!
మాలో ఒక్కో జాతి ఎత్తు ఒక్కోలా ఉంటుంది. వీటిల్లో కొన్నేమో పొదల్లా పెరిగితే మరికొన్ని చెట్టులా ఎదిగేస్తాయి. అందుకే మాలో కొన్ని జాతి చెట్లు 40 నుంచి 70 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంటాయి. చిన్న చిన్న ఆకులు పొడవైన ముళ్లు నా రూపం ప్రత్యేకం. నా ఆకుల రక్షణకోసమే ఈ ఏర్పాటు. గుండ్రని బంతుల్లా ఉండే పువ్వులు పూస్తుంటాయి. కమ్మని వాసన్ను వెదజల్లే ఈ పూలు కొన్ని జాతుల్లో పసుపు రంగులో ఉంటే మరికొన్నింట్లో తెల్లగానూ, ఎర్రగానూ ఉంటాయి. పెరగడంలో మాకు వేగం ఎక్కువే. ఇక మా జీవిత కాలమేమో 20 నుంచి 30 ఏళ్లు.
***నేనూ నా పేరు!
నా పేరు తుమ్మ. పేరు ఇది వరకే విన్నారు కదూ. దట్టంగా ముళ్లతో ఉన్న ను. నన్ను చూడగానే పదునుగా ఉండే ముళ్లే కనిపించేస్తాయి. ఇదిగో ఇక్కడున్న ఫొటో చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది. నాది ఫాబేసి కుటుంబం. అకేసియా జాతి. నాకు అకేసియా, వాట్లెస్‌ అనే పేర్లూ ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చాలా
ప్రాంతాల్లోనే కనిపిస్తుంటా. కానీ మీకు మీ పుట్టిన ఊరు ఉన్నట్టే నాకూ ఉంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్ని నా పుట్టినిళ్లుగా చెబుతుంటారు. మీ దేశంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంటా. నన్ను అంతగా పట్టించుకోకపోయినా బాగానే పెరిగేస్తుంటా. ఎందుకంటే నాకు నీళ్లూ అంతగా అవసరం లేదు. పొడి వాతావరణంలోనూ బాగానే ఉంటా. నేను దాదాపుగా అన్ని రకాల నేలల్లో పెరిగేస్తుంటా.
*మీకో గమ్మత్తయిన విషయం చెప్పనా? మాపై ఓ రకమైన కుట్టే చీమలుంటాయి. వాటికీ మాకూ భలే సంబంధం. ఈ చీమలు మాపై ఉండి మానుంచి వచ్చే పుప్పొడిని తింటూ బతికేస్తాయి. బదులుగా మాకు రక్షణగా ఉంటూ మాపైకి వచ్చినవారిని కుట్టేస్తాయి. అదేనండీ జంతువుల్లాంటివి తిన్నప్పుడన్నమాట.
***నా వల్ల లాభాలు!
*నా ఆకులు, బెరడు, జిగురు ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి.
* నా నుంచి జిగురు లభిస్తుంటుంది.
* ఎండిన నా కంపలను పంటపొలాల చుట్టూ కంచెగా వేయడానికి వాడుతుంటారు.
* నా కలపని పడవలు, బొమ్మలు, ఫర్నిచర్‌ తయారీలో ఉపయోగిస్తుంటారు.
* నా మీద పిట్టలు చక్కని గూళ్లు కట్టుకుంటాయి.