DailyDose

ఊచల వెనుక యెస్ బ్యాంక్ రానా కపూర్-వాణిజ్యం

Yes Bank Founder Rana Kapoor Arrested By ED

* సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బ్యాంకులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కింద గత రెండు రోజులుగా ఆయన్ని అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ముంబయిలోని ఆయన నివాసంలో సోదాలు జరిపారు. అనంతరం విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దాదాపు 20 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఆదివారం వేకువజామున కపూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సహకరించని కారణంగానే అరెస్టు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు ఆయన్ని స్థానిక కోర్టు ప్రవేశపెట్టి కస్టడీకి కోరతామని పేర్కొన్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సహా మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చిన రుణాల విషయంలో కపూర్‌ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. యెస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోవడానికి దారితీసిన మరికొన్ని అవకతవకల్లోనూ ఆయన పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

* ప్రపంచదేశాలను కరోనా వైరస్‌ వణికిస్తోంది. భారత్‌లోనూ ఇది విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య ఇక్కడ 31కి చేరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై పటిష్ఠ చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించి అవగాహన కల్పించేందుకు పలు సంస్థలు ముందుకువస్తున్నాయి. ఇందులో భాగంగా ‘రిలయన్స్‌ జియో’ కూడా కొవిడ్‌-19పై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఉచిత కాలర్‌ట్యూన్‌ను రూపొందించింది. నేటి నుంచే దీనిని అందుబాటులోకి తెచ్చింది.

* మన చేతిలో ఉండే మొబైల్‌లో కనీసం 70 రకాల మూలకాలు ఉంటాయి.. ఇందులో కొన్ని అరుదైనవీ ఉంటాయి. వీటికోసం గనులు తవ్వుకుంటూ వెళ్తే..భవిష్యత్తు తరాలకు అవి లభించడం కష్టమే. కానీ, పాడైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను జాగ్రత్తగా రీసైక్లింగ్‌ చేస్తే.. తిరిగి వాడటానికి సిద్ధం చేస్తే.. ఇలాంటి ఆలోచన నుంచి పుట్టిన అంకురమే సంశోధన్‌ (www.e-Waste Exchange.com) ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలతో వాతావరణం కలుషితం కాకుండా చూడటమే తమ లక్ష్యమని చెబుతున్నారు ఈ సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ డాక్టర్‌ శాలినీ శర్మ.

* యెస్‌ బ్యాంకులో 49 శాతం వాటాను రూ.2,450 కోట్లతో కొనుగోలు చేస్తామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) శనివారం ప్రకటించింది. ప్రస్తుత డిపాజిట్లు, అప్పులు.. అన్నీ ‘ప్రస్తుతం ఉన్నట్లుగానే’ కొనసాగుతాయని స్పష్టం చేసింది. మూలధనాన్ని సమీకరించుకోవడంలో విఫలమైన యెస్‌ బ్యాంకు బోర్డును గురువారం ఆర్‌బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఏప్రిల్‌ 3 వరకు మారటోరియం విధించిన విషయమూ విదితమే. ఒక్కోటీ రూ.2 ముఖ విలువ గల యెస్‌ బ్యాంకు వద్ద 255 కోట్ల షేర్లున్నాయి.