Devotional

నెమలిలో ఘనంగా నల్లనయ్య కళ్యాణం

2020 Nemali Brahmotsavam Performed Gracefully

నెమలి పుణ్యక్షేత్రం సోమవారం శ్రీకృష్ణ నామస్మరణతో మార్మోగింది. నమో భగవతే వాసుదేవాయ అంటూ జగన్నాటక సూత్రధారుడిని దర్శించుకున్న భక్తులు పులకించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు పాల పొంగళ్లతో వేణుగోపాలస్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ 63వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం గుడిలో భక్తుల రద్దీ పెరిగింది. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన రుక్మిణీసత్యభామా సమేత వేణుగోపాలస్వామి తిరుకల్యాణ మహోత్సవం తిలకించేందుకు విశేషంగా భక్తులు వచ్చారు. ఉదయం యజ్ఞశాలలో స్వామివారికి నిత్యహోమం నిర్వహించారు. కల్యాణోత్సవంలో స్వామివారికి కన్యాదానం చేయనున్న 200 మంది దంపతులు హోమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మైలవరపు రామాంజనేయులు, సహాయ కమిషనర్‌ నేల సంధ్య, పాలకవర్గ సభ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.