Business

₹3లక్షల కోట్లు పతనమైన రిలయన్స్. TCSకు ప్రథమస్థానం.

TCS Captures Most Valuable Company Title After Reliance Loses 3lakh Crores

నేడు మార్కెట్‌ పతనం దేశంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాను కూడా మార్చేసింది. టాటా గ్రూప్‌నకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. చమురు ధరలు పడిపోవడం రిలయన్స్‌ షేర్‌కు శరాఘాతంగా మారింది. దీంతో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రిలయన్స్‌ షేరు 13శాతానికి పైగా పడిపోయింది. ఫలితంగా రూ.10లక్షల కోట్లుగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 7.05 లక్షల కోట్లకు చేరింది. మరోపక్క టీసీఎస్‌ విలువ కూడా పతనమైనా.. అది తక్కువగా ఉంది. నేటి ట్రేడింగ్‌లో టీసీఎస్‌ షేరు ధర 6శాతానికి పైగా పతనమైంది. అయితే మార్కెట్‌ విలువ రూ. 7.40 లక్షల కోట్లుగా ఉండటంతో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్‌ తొలిస్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్‌ బెంచ్‌ మార్క్‌ క్రూడ్‌ ఫ్యూచర్లు 30శాతం పతనం కావడం రిలయన్స్‌పై ప్రభావం చూపింది. 1991 తర్వాత మార్కెట్లలో ఒక్కరోజులో పడిన అత్యధిక విలువ ఇదే కావడం గమనార్హం. రిలయన్స్‌ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని జామ్‌నగర్‌లో నడుపుతోంది. కృష్ణాగోదావరి బేసిన్‌లోని డీ-6 బ్లాక్‌ను కూడా నిర్వహిస్తోంది.