DailyDose

వారణాసి విశ్వనాధుడికి కొరోనా మాస్క్-తాజావార్తలు

Varanasi Sivalinga Gets Face Mask-Telugu Breaking News

* వారణాసిలోని ప్రహ్లాదేశ్వర స్వామి ఆలయంలో అక్కడి పూజారులు కూడా మాస్కులు ధరించే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పూజారి విశ్వనాథుడి విగ్రహానికి, మందిరంలోని ఇతర విగ్రహాలకు కూడా మాస్కులు ధరించడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా విగ్రహాలను ముట్టుకోవద్దంటూ పూజారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

* ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేశారని.. ఇప్పుడు వాటిని తొలగించడానికి సుమారు రూ.3 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఆ డబ్బు వైకాపా నేతలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా పాఠశాల వసతుల కల్పనపై సీఎం జగన్‌ ఎలా మాట్లాడతారని చంద్రబాబు ప్రశ్నించారు. జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు ఇచ్చే వస్తువులపై సీఎం మాట్లాడారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ జగన్‌కు వర్తించదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

* పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆరు రకాల వస్తువులు విద్యాకానుకలో ఉండనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మూడు జతల యూనిఫామ్స్‌, నోటు పుస్తకాలు, బూట్లు, సాక్స్‌, బెల్టు, బ్యాగు, పాఠ్య పుస్తకాలు ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌లో ఉంచాలని సీఎం సూచించారు. విద్యార్థులకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు. డిజిటల్‌ విద్యాబోధనకై ప్రతి పాఠశాలకూ స్మార్ట్‌ టీవీలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

* పులివెందులకు చెందిన తెదేపా నేత సతీశ్‌రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తానని ఆయన స్పష్టం చేశారు. పులివెందులలో వైఎస్‌ కుటుంబం బలం, బలహీనతలు ఏంటో తనకు తెలుసని బీటెక్‌ రవి వ్యాఖ్యానించారు.

* కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్‌నేత జ్యోతిరాదిత్యసింధియా రాజీనామా చేసిన సంగతి విదితమే. త్వరలోనే ఆయన భాజపాలో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సింధియా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం ద్వారా తన నానమ్మ కోరిక తీర్చాడని ఆయన మేనత్త వసుంధరరాజే అన్నారు. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ భాజపా నేత అయిన వసుంధర మాట్లాడుతూ కుటుంబమంతా కలిసిఉండాలని చనిపోయేముందు తన తల్లి విజయరాజేసింధియా కోరిందని ఆమె తెలిపారు.

* ఎన్నికల ప్రక్రియకు, ప్రభుత్వానికి సంబంధం ఏంటని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ ఈసీ పరిధిలోని అంశమని అన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చీకటి పాలనలో అన్నీ నల్లచట్టాలు, నల్ల జీవోలు, బ్లాక్ డేలేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లను భయపెట్టడం, ప్రతిపక్షాల అభ్యర్థులను పోటీకి రాకుండా చేసేందుకే ఈ చీకటి ఆర్డినెన్స్ దొడ్డిదారిన తెచ్చారని యనమల దుయ్యబట్టారు.

* ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ రాఘవా లారెన్స్‌ తమ్ముడు వినోద్‌ తనను వేధిస్తున్నాడని జూనియర్‌ ఆర్టిస్టు దివ్య ఫిర్యాదు చేశారు. వరంగల్‌కు చెందిన ఆమె రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. వినోద్ ప్రేమను తిరస్కరించడంతో తనను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని తెలిపారు. లైంగికంగా వేధించడంతోపాటు వ్యభిచార కూపంలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.

* చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌(కొవిడ్‌-19) మహమ్మారి ఆ దేశం వెలుపల అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటికే 100 దేశాలకు పైగా ఈ వైరస్‌ విస్తరించింది. ఇక ఇటలీ, ఇరాన్‌ దేశాల్లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇరాన్‌లో మంగళవారం ఒక్కరోజే 54 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 291కు పెరిగింది. ఇరాన్‌ వ్యాప్తంగా 8వేలకు పైగా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

* కరోనావైరస్‌ వ్యాప్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెడుతుందనే ఊహాగానాలతో అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ అస్తులకు 5.8 బిలియన్‌ డాలర్ల మేరకు నష్టం వాటిల్లింది. దీంతో ఆసియాలోనే అత్యంత ధనవంతుల చిట్టాలో మొదటి స్థానం అయన చేజారిపోయింది. కాగా ఆ స్థానంలోకి అలీబాబా సంస్థ అధినేత జాక్‌ మా వచ్చి చేరారు.

* నేటితరం యువత తమ భావాలను ఎప్పటికప్పుడు సమాజంతో పంచుకోవాలనుకుంటోంది. ఇందుకు తమకు ఉన్న సులభమైన మార్గం సోషల్‌ మీడియా. చాలామంది సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను పోస్టు చేస్తుంటారు. ఈ క్రమంలో తన వినియోగదారుల కోసం వినూత్నమైన ఫీచర్లను ప్రవేశపెట్టే సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే క్రాస్‌ పోస్టింగ్‌. అదేంటో చూసేయండి.