Agriculture

నీరు+ఎరువులు=ఫెర్టిగేషన్

Telugu Agricultural News March 2020 - What is Fertigation

కొద్దిమంది రైతులు డ్రిప్‌ పద్ధతిలో పంటలను సాగు చేస్తుంటారు. డ్రిప్‌ ద్వారానే ఆయా పంటలకు అవసరమైన ఎరువులు కూడా అందించే అవకాశం ఉన్నది. ఇంకా దీనిపై పూర్తిస్థాయి అవగాహన లేని చాలామంది రైతులు మొక్కల మొదళ్ల వద్ద ఎరువులు వేస్తున్నారు. ఫలితంగా శారీరక శ్రమ బారిన పడుతున్నారు. మరోవైపు మొక్క కూడా మొదళ్ల వద్ద వేసిన ఎరువును సరిగ్గా తీసుకోవడం లేదు. నీటిలో కరిగే రసాయన ఎరువులను నీటితో సహా సరైన మోతాదులో మొక్కకు నేరుగా అందజేయడాన్ని ఫెర్టిగేషన్‌ అంటారు. ఈ పద్ధతిలో మొక్కలకు అవసరమయ్యే సాగు, నీరు, పోషకాలు మొక్కకు ఏకకాలం లో అందుతాయి. ఫలితంగా పంటల దిగుబడి పెరుగుతుంది. పర్యావరణంపై కూడా ఎలాంటి ప్రభావం ఉండదు.

** లాభాలు
మొక్కలకు నీరు, పోషక పదార్థాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. దీనివల్ల మొక్కల పెరుగుదల బాగా ఉండి నాణ్యమైన పంటలు ఉత్పత్తవుతాయి. ఫెర్టిగేషన్‌ను అన్ని వాతావరణ పరిస్థితుల్లో చేయవ చ్చు. తగిన సమయంలో తగిన మోతాదులో ప్రతిసారీ మొక్కల వేర్ల దగ్గర పోషకాలు అందించడం వల్ల ఎరువుల వినియోగం, సామర్థ్యం పెరుగుతుంది. వేసిన ఎరువులు భూమిలో ఇంకిపోకుండా ఉంటాయి. మొక్కల వేర్లకు ఎలాంటి హాని ఉండదు. సమయం కలిసి వస్తుంది. కూలీల ఖర్చు తగ్గుతుంది. నేల గట్టిపడదు.

** ఎలాంటి ఎరువులు వాడాలి
నీటిలో పూర్తిగా, త్వరగా కరగాలి. నీటిలో కరగక మిగిలిన అవశేషాల వల్ల డ్రిప్పర్లు మూసుకుపోకుండా ఉండాలి. నీటిలో రసాయన ప్రక్రియ జరుగకుండా ఉండాలి. పోషకాల శాతం వీలైనంత ఎక్కువగా ఉండా లి. ఇలా నీటిలో కరిగే ఎరువులను డ్రిప్‌ పరికరం వద్ద ఉండే ఫెర్టిగేషన్‌ ట్యాంక్‌ ద్వారా ఎరువులను అందించవచ్చు.

** లీకేజీ లేకుండా చూసుకోవాలి
డ్రిప్‌లో లీకేజీలు ఉంటే రసాయనాలు వృథా కావడమే కాకుండా పొలంలో అన్నిచోట్లకు సమానంగా నీరు, రసాయనాలు అందే అవకాశం ఉండదు. ఫెర్టిగేషన్‌ చేసే రోజుల్లో మొక్కలకు అవసరాన్ని మించి ఎక్కువ నీరు పెట్టొద్దు. ఫెర్టిగేషన్‌లో ఒకటి కంటే ఎక్కువ ఎరువులను ఒకేసారి డ్రిప్‌లోకి పంపించాలనుకుంటే ఆ ఎరువుల మధ్య రసాయనిక చర్యలు జరుగకుండా డ్రిప్‌ భాగాలను, మొక్కలకు హాని జరుగకుండా చూసుకోవాలి. రెండు లేదా అంతకుమించి ఎరువులను కలుపడం వల్ల వాటిలోని రసాయనాల మధ్య చర్యల ఫలితంగా లవణాలు తయారవుతాయి. ఇలాం టి లవణాలు నీటిలో కరగక డ్రిప్‌ సిస్టం మూసుకుపో యే ప్రమాదం ఉన్నది. ఇందుకోసం ఫెర్టిగేషన్‌కు వాడే ఎరువులను ముందుగా గ్లాస్‌లోని నీటిలో పోసి రెండు గంటల సమయం వరకు కదలకుండా ఉంచాలి. గ్లాస్‌లో మడ్డి లవణాలు పేరుకుపోకుండా ఉందేమో చూసుకోవాలి. అప్పుడు డ్రిప్‌ద్వారా ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

** ఏ జాగ్రత్తలు తీసుకోవాలి
సాగు భూమిలో వివిధ పోషకాల లభ్యత, మొక్కల దశల వారి అవసరాలు దృష్టిలో ఉంచుకొని సరైన ఫర్టిగేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఫెర్టిగేషన్‌ ప్రణాళిక భూసార పరీక్షలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులను పాటించాలి. డ్రిప్‌ సిస్టమ్‌ను సరైన డిజైన్‌లో అమర్చుకోవాలి. డ్రిప్‌ ద్వారా నీరు అందించడంలోనూ సమస్యలొస్తాయి. ఫెర్టిగేషన్‌ పరికరాల ఇంజక్షన్‌ రేటు సరిచూసుకొని అనుకున్న విధంగా రసాయనాలు సిస్టమ్‌లోకి వెళ్తున్నాయా లేదా తెలుసుకోవాలి. నీరు పెట్టే మొత్తం సమయంలో చివరి 40-50 నిమిషాల ముందుగా ఫెర్టిగేషన్‌ పూర్తయ్యేలా చూసుకోవాలి. ఇలా కాకుండా ఫెర్టిగేషన్‌ తర్వాత చాలా సమయం దాకా నీరు పెడితే రసాయనాలు భూమిలోతుకు పోయి వేర్లకు అందకుండాపోవచ్చు. అలాగే ఫెర్టిగేషన్‌ తరువాత డ్రిప్‌ సిస్టమ్‌ను వెంటనే ఆపేస్తే రసాయన ద్రవం సిస్టమ్‌లో ఉండిపోతుంది. డ్రిప్‌ భాగాలు పాడవుతాయి.
Telugu Agricultural News March 2020 - What is Fertigation-Indian agriculture news