DailyDose

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.భారీగా పతనం-వాణిజ్యం

Stock Markets Crash Due To Coronavirus-Telugu Business News Roundup Today

* అమెరికా సూచీలు బేర్‌ మార్కెట్‌ పరిధిలోకి వెళ్లాయి.. నిఫ్టీ బేర్‌ మార్కెట్లోకి చేరింది.. ప్రస్తుతం దేశీయ స్టాక్‌ మార్కెట్లను విపరీతంగా భయపెడుతున్న అంశాలు ఇవీ.. అసలు బేర్‌ మార్కెట్లని వేటిని అంటారు.. వాటి ప్రభావం సూచీలపై ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. నేడు ఉదయం దేశీయ మార్కెట్లలో భారీగా అమ్మకాలు జరగడంతో సూచీలు బేర్‌మార్కెట్‌ పరిధిలోకి వెళ్లాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించిన తర్వాత పలు దేశాల సూచీలు పతనం కావడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా దారుణంగా పడింది.
**సాధారణంగా అమ్మకాలు ఎక్కువగా జరిగే వాటిని బేర్‌ మార్కెట్లుగా వ్యవహరిస్తుంటారు. కానీ, ఒక స్టాక్‌గానీ, సూచీ గానీ ఇటీవల అత్యధికంగా ట్రేడైన మార్క్‌ నుంచి 20శాతం కిందికి పడిపోతే దానిని బేర్‌ మార్కెట్లుగా పేర్కొంటారు. ఇది మార్కెట్లో బలమైన ప్రతికూల సెంటిమెంట్‌ను తెలియజేస్తుంది. సూచీలు లేదా స్టాక్‌లో భారీ అమ్మకాలకు ఇది సూచిక.
***భారత మార్కెట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి..?
జాతీయ స్టాక్‌ ఎక్స్‌ఛేంజి సూచీ నిఫ్టీ ఇప్పుడు బేర్‌ మార్కెట్లోకి చేరింది. ఇక బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజి సూచీ సెన్సెక్స్‌ కూడా బేర్‌మార్కె్ట్లకు వెంట్రుకవాసి దూరంలో ఉంది. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ ఆటో, నిఫ్టీ సీపీఎస్‌ఈలు ఇప్పటికే బేర్‌మార్కెట్లోకి చేరిపోయాయి. ఇవన్నీ ఇటీవల కాలంలో ట్రేడైన అత్యధిక మొత్తం కంటే 20శాతం పైగా కుంగాయి.
***అమెరికా స్టాక్‌ మార్కెట్ల పరిస్థితి ఏమిటీ..?
అమెరికాలోని ఎస్‌అండ్‌పీ 500 ఫ్యూచర్స్‌ మార్కెట్లో 3శాతం పడగా.. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 4.89శాతం పతనమైంది. దీంతో ఇది బేర్‌ మార్కెట్లోకి చేరిపోయింది. 2008 ఆర్థిక సంక్షోభం ముగిసిన తర్వాత దీనికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. మరోపక్క జపాన్‌ కూడా బేర్‌ మార్కెట్లలో చేరిపోయింది. ఈ దేశ సూచీ నిక్కీ 5.2శాతం విలువ కోల్పోయి 2017 ఏప్రిల్‌ నాటి స్థాయికి చేరింది.
****గతంలో, ప్రస్తుత బేర్‌ మార్కెట్లకు కారణాలు?
బేర్‌ మార్కెట్‌ పరిస్థితులు ఏర్పడటానికి పలు కారణాలు ఉన్నాయి. ఒక్కోసారి సంక్షోభానికి ఒక్కో కారణం ఉంది. 1980ల్లో బేర్‌ మార్కెట్లకు అధిక వడ్డీరేట్లు, పెరిగిన ద్రవ్యోల్బణం కారణమైంది. అదే 2,000సంవత్సరంలో బేర్‌ మార్కెట్లకు టెక్‌బబుల్‌ సంక్షోభం కారణంగా నిలిచింది. ఇక అమెరికాలో హౌసింగ్‌ సంక్షోభం రావడంతో 2008లో మార్కెట్లు పాతాళాన్ని చూశాయి. 2020లో కరోనా వైరస్‌, వాణిజ్య యుద్ధం, చమురు యుద్ధాలు మార్కెట్లను ముంచేశాయి. భారత్‌లో అయితే బ్యాంకింగ్‌ రంగ సంక్షోభం కూడా దీనికి తోడైంది.
* బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్లు తీసుకొస్తూ యువతకు బాగా దగ్గరైన బ్రాండ్‌ రెడ్‌మి. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ షామీ సబ్‌ బ్రాండ్‌గా రెడ్‌మి సిరీస్‌లో అనేక ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రెడ్‌మి నోట్‌ 9 ప్రో మ్యాక్‌, రెడ్‌మి నోట్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గురువారం జరిగిన ఈవెంట్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతలతో పాటు, ధరలను కూడా ప్రకటించారు.
* స్టాక్‌ మార్కెట్లను కరోనా భయం వెంటాడుతోంది. కరోనాకు తోడు క్రూడ్‌ ఆయిల్‌ ధరల పతనం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు అతి భారీగా పతనమయ్యాయి. 3,100 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్‌, 930 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ కొనసాగుతోంది. అన్ని రంగాల సూచీలు 52 వారాల కనిష్ట స్థాయిలో ట్రేడవుతున్నాయి. 7-8 శాతానికి పైగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు నష్టపోయాయి. 10 శాతానికి పైగా బ్యాంకు నిఫ్టీ నష్టపోయింది.
*విలీన బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం సమావేశం కాబోతున్నారు. ఏప్రిల్ 1 నుంచి విలీనం కాబోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నాయో సమీక్షించేందుకు ఆమె వారితో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యాంకర్ బ్యాంకులు ఖాతాదారులకు అంతరాయం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయో.. ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక రంగాలకు రుణ వితరణకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
*సోమవారం నాటి కనీవినీ ఎరుగని నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్లు కోలుకున్నట్లే కోలుకుని..చివరకు మళ్లీ స్వల్ప నష్టాల్లోనే ముగిశాయి. దాదాపు ప్రపంచ వ్యాప్త మార్కెట్లన్నీ అదే తీరును ప్రదర్శించాయి. చమురు ధరలు మాత్రం పతనం నుంచి పెరిగాయి. మన మార్కెట్లకు హోలీ సందర్భంగా సెలవు కావడంతో నేటి మార్కెట్లు ఎలా చలిస్తాయన్నది ఇపుడు కీలకంగా మారింది.
* ప్రభుత్వరంగంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బుధవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వివిధ కాలపరిమితులు కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేటు, నిధుల వ్యయ ఆధారిత వడ్డీ రేట్ల (ఎంసీఎల్‌ఆర్‌)ను తగ్గించింది. సేవింగ్స్‌ ఖాతా డిపాజిట్లపైనా వడ్డీ రేటులో కోత విధించింది. సేవింగ్స్‌ ఖాతాల్లో ఉంచాల్సిన కనీస నిల్వ నిబంధనను ఎత్తివేయడమేకాకుండా, ఎస్‌ఎంఎస్‌లపై త్రైమాసిక చార్జీలను తొలగించింది. ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం వల్ల గృహ, వాహన, ఆటో తదితర రుణాలు మరింత చవకగా లభించనున్నాయి.
* కరోనా, క్రూడ్‌ దెబ్బకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఆసియా కుబేర కిరీటాన్ని చేజార్చుకున్నారు. సోమవారం స్టాక్‌ మార్కెట్లు అతలాకుతలం కావడంతో ఆయన వ్యక్తిగత సంపద 580 కోట్ల డాలర్ల మేర తగ్గింది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో తరిగిన ఆస్తి విలువ రూ.43,000 కోట్ల పైమాటే. దాంతో అంబానీ ఆసియా సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి జారుకున్నారు.
* ఎస్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ కు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో రూ.1000కోట్ల విలువగల విలాసవంతమైన భవనాలున్నాయని తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెల్లడైంది.
* ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రతిపాదిత విలీన బ్యాంకుల సీఈఓలతో సమావేశం అవుతున్నారు. విలీన ప్రయత్నాలు, అందుకు ఆయా బ్యాంకుల సన్నద్ధతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి పది ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ నాలుగు బ్యాం కులుగా విలీనమవుతున్నాయి. ఇందులోభాగంగా ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌.. యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం అవుతాయి.
* దేశంలో ఈ రోజు (మంగళవారం) బంగారం ధరలు భారీగా క్షీణించాయి. ఎంసీఎక్స్, గోల్డ్ ఫీచర్స్‌లో పది గ్రాములకు రూ. 750 (1.7శాతం) క్షీణించి రూ. 43,600కు చేరుకుంది. వెండి ధర కూడా 1.44 శాతం దిగజారి కిలోకు రూ.46,040కి చేరుకుంది. దేశంలో ఇటీవల పసిడి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. పది గ్రాములకు రూ.44,961కి పలికింది. అయితే, ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. కాగా, హోలీ సందర్భంగా ఎంసీఎక్స్‌లో మొదటి సెషన్ తర్వాత ట్రేడింగ్ నిలిపివేశా
* కరోనా భయాలు, క్రూడాయిల్‌ క్రాష్‌తో ప్రపంచ మార్కెట్‌ సూచీలన్నీ కుదేలయ్యాయి. అమెరికా ఈక్విటీ సూచీ ఎస్‌ అండ్‌ పీ ప్రారంభ ట్రేడింగ్‌లోనే 7 శాతం మేర పతనమవడంతో ట్రేడింగ్‌ను 15 నిమిషాల పాటు నిలిపివేశారు
* రిలయన్స్ జియో తన దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.4,999 మళ్లీ తీసుకొచ్చింది. గతేడాది డిసెంబరులో జియో ఈ ప్లాన్‌ను అటకెక్కించింది. ఈ ప్లాన్ కాలపరిమితి 360 రోజులు. 350 జీబీ డేటా, జియో నుంచి జియోకు అపరిమిత కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు 12 వేల నిమిషాలు లభిస్తాయి. జియోలో ఇప్పటికే రూ.1,299, రూ.2,121తో రెండు దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
* ‘వింగ్స్ ఇండియా 2020’ పేరిట హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఈ నెల 12వ తేదీ (గురువారం) నుంచి రెండు రోజుల పాటు ఎయిర్ షో జరగనుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ఐసీసీఐ), మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వివిధ ఏవియేషన్ సంస్థలకు చెందిన విమానాలు, చాపర్ల ప్రదర్శన, రెండు విడతలుగా సారంగ్, మార్క్ జెఫ్రీ బృందాల విమాన విన్యాసాలు తదితర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలో భాగంగా మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
*యెస్ బ్యాంక్ వినియోగదారులకు ఉపశమనం. క్రెడిట్ కార్డు బిల్లులు, రుణ వాయిదాలను వినియోగదారులు ఇతర బ్యాంకు ఖాతాల నుంచి చెల్లింపులు చేయొచ్చని యెస్ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్పై ఆర్బీఐ మారటోరియం విధించడంతో పలు సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. నగదు ఉపసంహరణ చేయడానికి ఏటీఎంలు, బ్యాంకు శాఖల వద్ద ఖాతాదారులు బారులు తీరిన నేపథ్యంలో బ్యాంకు ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం యెస్ బ్యాంక్ ఖాతాదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు వంటి సేవలు నిలిచిపోయాయి. ఫారెక్స్ సేవలు, క్రెడిట్ కార్డు కొనుగోళ్లు వంటి వాటిపై కూడా ప్రభావం పడింది. ఖాతాదారులకు నెఫ్ట్, ఐఎంపీఎస్ సేవలను పునరుద్ధరించినట్లు యెస్ బ్యాంక్ ట్వీట్ చేసింది. కష్టకాలంలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ వారం చివరికి యెస్ బ్యాంక్ మారటోరియం ముగిసే అవకాశం ఉంది.
* 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటిస్తూ బోర్డు ఆమోదం తెలిపిందని టీసీఎస్ వెల్లడించింది. మార్చి 20ని రికార్డు తేదీగా నిర్ణయించింది.
* అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబున్యల్లో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని కెయిర్న్ ఎనర్జీ భావిస్తోంది. భారత ప్రభుత్వానికి ఆ సంస్థ రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాల్సి ఉండగా, దాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ ఆర్బిట్రల్ ట్రైబ్యునల్ను ఆశ్రయించింది.
* 2020 మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి రెండో మధ్యంతర డివిడెండుగా ఒక్కో షేరుకు రూ.1.40 చొప్పున చెల్లించేందుకు బోర్డు ఆమోదించిందని టీవీఎస్ మోటార్ తెలిపింది.
* కార్యకలాపాలు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ రుణదాతల కమిటీ (సీఓసీ) ఈ నెల 12న సమావేశం కాబోతున్నట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. బిడ్ల దాఖలుకు గతంలో నిర్ణయించిన గడువు తేదీ మార్చి 10ని సవరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.