Devotional

25న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

TTD Ugadi Aasthaanam In Tirumala On March 25th

1.25న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం – ఆద్యాత్మిక వార్తలు – 12/03
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 25వ తేదీన ఉగాది ఆస్థానం జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 6గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, విష్వక్సేనులకు విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుంచి 9గంటల నడుమ విమానప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా చేపడతారు. ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం తితిదే రద్దు చేసింది.
2.అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్ల విరాళం
తితిదే నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన దాతలు రూ.1,11,00,232లు విరాళంగా అందించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ పసుపులేటి శరశ్చంద్ర]బాబు రూ.1,00,00,116లు, పసుపులేటి వేంకటశశిధర్ రూ.11,00,116లు విడివిడిగా రెండు డీడీలను మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డిని కలిసి అందించారు.
3.తిరుమల భక్తులకు థర్మల్ గన్లతో పరీక్షలు
తిరుమలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వైరస్ బాధితులను గుర్తించేందుకు థర్మల్ గన్లను వినియోగించనున్నట్లు చెప్పారు. వేసవిలో భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తితిదే ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.
15 నుంచి కాషన్ డిపాజిట్ విధానం: రూ.300 ప్రత్యేక దర్శనం ఆన్లైన్ టికెట్ల విధానంలో తేదీ మార్చుకునే వెసులుబాటు, రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తామని అదనపు ఈవో తెలిపారు. తిరుమలలో ఈనెల 15వ తేదీ నుంచి కరెంట్ బుకింగ్ గదుల కేటాయింపులో కాషన్ డిపాజిట్ విధానం అమలు చేస్తామన్నారు. .
4.మక్కా యాత్రికుల రాక ఆలస్యం
మక్కాకు వెళ్లిన రాయలసీమ ప్రాంతాలకు చెందిన పలువురు యాత్రికులు తిరిగి స్వగ్రామాలకు చేరడం ఆలస్యం అవుతోంది. గతనెల 24న చిత్తూరు జిల్లా మదనపల్లె, కురబలకోట, అంగళ్లు, అనంతపురంలోని కదిరి తదితర ప్రాంతాలకు చెదిన పలువురు బెంగళూరు నుంచి మక్కాకు వెళ్లారు. వీరంతా ఈనెల 9న రాత్రి స్వగ్రామాలకు చేరుకోవాల్సి ఉంది. మంగళవారానికీ వారు రాకపోవడంతో పలువురు ఫోన్లు చేశారు. మక్కా నుంచి తిరుగుప్రయాణమైన విమానంలో వేరే ప్రాంతాలకు చెందిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా లక్షణాలు ఉండటంతో విమానాన్ని ఒమన్ విమానాశ్రయంలో దింపేసినట్లు చెప్పారని.. రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్లిన వారికి కరోనా లక్షణాలు లేవని తేలడంతో స్వదేశానికి పంపనున్నట్లు బంధువులు తెలిపారు. బుధవారం వారంతా స్వగృహాలకు చేరుకోనున్నట్లు బంధువులు పేర్కొన్నారు.
5.ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ‘బ్రేక్’
ప్రజాప్రతినిధుల సిఫార్సులతో తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులను ఎన్నికల కోడ్ కారణంగా అనుమతించడంలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను తితిదే తిరస్కరిస్తోంది. ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే వారికే వీఐపీ బ్రేక్ దర్శనాలను కల్పిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని తితిదే అధికారులు తెలిపారు.
6. శబరిమలకు రావొద్దు
కేరళలో ప్రసిద్ధ శబరిమల పుణ్యక్షేత్రంపైనా కరోనా ప్రభావం పడింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులు అయ్యప్ప దర్శనానికి రావొద్దని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) సూచించింది. నెలవారీ పూజల నిమిత్తం శుక్రవారం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ నెల 18న మళ్లీ మూసివేస్తారు. టీబీడీ అధ్యక్షుడు వాసు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో శబరిమల దర్శనానికి రావొద్దని భక్తులకు సూచించారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టంచేశారు. కేరళలో తాజాగా మరో ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 14కు చేరింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేరళ సర్కారు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, థియేటర్లను ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశించింది. మరోవైపు, కర్ణాటక, పుణేలో ముగ్గురికి చొప్పున వైరస్ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 61కి పెరిగింది. బెంగళూరులో ప్రాథమిక పాఠశాలలకు నిరవధిక సెలవులు ప్రకటించారు. ఇద్దరు కరోనా బాధితులకు చికిత్స కోసం దేశంలో తొలిసారి రెండు యాంటీ హెచ్ఐవీ మందులను వినియోగించారు. కాగా, ఇరాన్లో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను వాయుసేన విమానం ద్వారా మంగళవారం స్వదేశానికి తీసుకొచ్చారు. ఘజియాబాద్లోని ప్రత్యేక కేంద్రంలో వారిని ఉంచారు. ఇరాన్లో ఇప్పటివరకు 291 మంది మరణించగా, 8,042 మంది వైరస్ బారినపడ్డారు.
7. పంచాంగము 12.03.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: ఫాల్గుణ
పక్షం: కృష్ణ బహుళ
తిథి: తదియ సా.05:18 వరకు
తదుపరి చవితి
వారం: గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం: చిత్ర రా.09:22 వరకు
తదుపరి స్వాతి
యోగం: ధృవ రా.12 :03 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: భద్రా ప.12:02 వరకు
తదుపరి బాలవ
వర్జ్యం: ఉ.06:34 – 08:02 వరకు
తదుపరి రా.తె.02:37 – 04:07
దుర్ముహూర్తం: 10:25 – 11:13
మరియు 03:13 – 04:01
రాహు కాలం: 01:55 – 03:25
గుళిక కాలం: 09:26 – 10:55
యమ గండం: 06:26 – 07:56
అభిజిత్ : 12:02 – 12:48
సూర్యోదయం: 06:26
సూర్యాస్తమయం: 06:25
వైదిక సూర్యోదయం: 06:29
వైదిక సూర్యాస్తమయం: 06:21
చంద్రోదయం: రా.09:17
చంద్రాస్తమయం: ఉ.08:30
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: దక్షిణం
చంద్ర నివాసం: పశ్చిమం
శ్రీవాదిరాజతీర్థ పుణ్యతిథి
బ్రహ్మ కల్పాది
శివాజీ జయంతి
సంకష్టహర చతుర్ధి
8. తిరుమల\|/సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు గురువారం,
12.03.2020
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 18C°-30C°
• నిన్న 57,352 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 01 కంపార్ట్మెంట్ లో
భక్తులు సర్వదర్శనం కోసం
వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
08 గంటలు
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 2.85 కోట్లు,
• నిన్న 15,198 మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికమ్‌
తా: కౌసల్యాదేవికి
సుపుత్రుడవగు ఓ
రామా! పురుషోత్తమా!
తూర్పు తెల్లవారుచున్నది.
దైవ సంబంధములైన
ఆహ్నికములను
చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free #18004254141
9. చరిత్రలో ఈ రోజు/మార్చి 12 బాలికల స్కౌట్స్ ప్రారంభం
మారిషస్ గణతంత్ర దినోత్సవం
1930: భారత స్వాతంత్ర్య ఉద్యమములో ప్రముఖ ఘట్టమైన దండి యాత్ర (200 మైళ్ళ దూరం) ప్రారంభమైంది.
1993: ముంబైలో బాంబు పేలుళ్ళు
1912: జూలియట్ గార్డన్ లో గర్ల్ (బాలికల) స్కౌట్స్ ప్రారంభించారు.
1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా దామోదరం సంజీవయ్య పదవీ విరమణ (11 జనవరి 1960 నుంచి 12 మార్చి 1962 వరకు).
1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం (12 మార్చి 1962 నుంచి 29 ఫిబ్రవరి 1964 వరకు).
2011: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం
1937: శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి జననం.
10. తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
ఈరోజు గురువారం 12-03-2020 ఉదయం 5 గంటల సమయానికి.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది…
శ్రీవా సర్వ దర్శనానికి 1 కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్న భక్తులు…….
శ్రీవారి సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది….
ప్రత్యేక ప్రవేశ దర్శనం (300/-), టైమ్ స్లాట్ సర్వదర్శనం, కాలినడక దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది….
నిన్న మార్చి 11 వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 57,352 మంది…
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.85 కోట్లు…
11. మే, జూన్‌ నెలల్లో ‘అదనపు కోటా’ రద్దు
వేసవి రద్దీ దృష్ట్యా మే, జూన్‌ నెలల్లో వృద్ధులు, దివ్యాంగులు, ఐదేళ్ల లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రతినెలా ఇచ్చే అదనపు కోటాను రద్దు చేస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. వేసవి సన్నాహాలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే, జూన్‌ నెలల్లో తిరుమలకు భక్తుల రాక అధికంగా ఉంటుందని, ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాల వేళల మార్పులో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నామని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఈ రెండు నెలలు క్షురకులకు సెలవులు రద్దు చేశామని, వారు మూడు షిప్టులు పనిచేసేలా ఆదేశాలిచ్చామని తెలిపారు.జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న భక్తులు తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. ప్రతి భక్తుడు విధిగా మాస్కులు ధరించి రావాలని, శానిటైజర్లు వినియోగించాలని సూచించారు. కరోనా బాధితులను గుర్తించేందుకు థర్మల్‌గన్‌లు, ఇతర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. కాగా వేసవి రద్దీ దృష్ట్యా తిరుమలలో గదుల అడ్వాన్సు బుకింగ్‌ను 28 శాతానికి కుదించి, కరెంట్‌ బుకింగ్‌ను 72 శాతానికి పెంచామని వివరించారు. భక్తులు 24 గంటల్లో గదులు ఖాళీ చేయించడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.విదేశాల నుంచి వస్తే 4 వారాలు రావద్దువిదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా దేశంలోకి అడుగుపెట్టిన నాలుగు వారాల వరకు తిరుమలకు రావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 28 రోజుల తర్వాతే తిరుమల సందర్శనకు రావాలని మంగళవారం ఒక ప్రకటనలో సూచించింది. తిరుమలను నిత్యం వేలాది భక్తులు సందర్శిస్తుంటారని, ఈ రద్దీలో కరోనా వైరస్‌ సులభంగా వ్యాప్తించే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న భక్తులు తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కోరారు.
12. సత్యదేవుడి సన్నిధిలో మహావైకుంఠ నారాయణ యాగం
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో బుధవారం మహా వైకుంఠ నారాయణ యాగ క్రతువును విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామిజీ ప్రారంభించారు. ముందుగా స్వామి, అమ్మవార్లను పల్లకీలో మేళతాళాల మధ్య యాగశాలకు తీసుకువచ్చి ప్రత్యేకవేదికపై ఆశీనులను గావించారు. నాలుగు గంటలకు సౌర, రుద్ర, గణపతి, చండీ, నారాయణ యాగాలను నిర్వహించారు. ఈసందర్భంగా స్వరూపానంద స్వామీజీ మాట్లాడుతూ…రాష్ట్రం సస్యశామలంగా ఉండడానికి, పాడిపంటలు సమృద్ధిగా ఉండడానికి, వాతావరణ సమతుల్యతకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. అన్నవరం వచ్చిన స్వామీజీకి ఈవో త్రినాథరావు, చైర్మన్‌ ఐవి.రోహిత్‌ పూర్ణకుంభ స్వాగతం పలికారు. సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు మాడుగుల నాగఫణిశర్మ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.