Agriculture

తగ్గిన మామిడి పూత దిగుబడి

Telugu Agricultural News Roundup-Indian Mango Yield Falls Low

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడిలో ఈ సంవత్సరం పూత ఆశించిన విధంగా రావటం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పూత వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా పూత ఆనవాళ్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మామిడి తోటల్లో ప్రస్తుతం రైతులు ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతులను జగిత్యాల జిల్లా ఉద్యానశాఖ అధికారి జె.ప్రతాప్‌సింగ్‌ వివరించారు.మామిడిలో.. సాగు చేస్తున్న రకం, వాతావరణ పరిస్థితులను బట్టి డిసెంబరు నుంచి జనవరి చివరి వరకు, కొన్ని చోట్ల ఫిబ్రవరి వరకు కూడా పూమొగ్గలు వస్తాయి. చలి ఎక్కువున్న ప్రాంతాల్లో పూమొగ్గలు రావటం ఆలస్యమవుతుంది. ఉష్ణోగ్రత, అకాల వర్షాలు, చెట్టు కొమ్మల్లో ఉండే పిండి పదార్థాలు, నత్రజని నిష్పత్తి వంటి అంశాలు పూతను ప్రభావితం చేస్తాయి. చెట్లలో పిండి పదార్థాలు ఎక్కువగా, నత్రజని తక్కువగా ఉన్నప్పుడు పూత తొందరగా, ఎక్కువగా వస్తుంది. ఈ పరిస్థితి రావాలంటే నవంబరులోపే నేలలో తేమ లేకుండా చేయాలి. చెట్లను బెట్టకు గురి చేయాలి. కానీ తెలంగాణలో గతేడాది కొన్ని ప్రాంతాల్లో నవంబరు వరకూ వర్షాలు కొనసాగటం, డిసెంబరులోనూ అకాల వర్షాలు కురవడంతో తోటల్లో తేమ పెరిగింది. చెట్లు బెట్టకు రాలేదు. దీంతో పూత ఆలస్యమవుతోంది. వర్షాల కారణంగా నవంబరులో చెట్లలో వచ్చిన చిగుర్లకు ఈ ఏడాది పూత రాదు. ఈ చిగుర్లకు వచ్చే సంవత్సరం పూత వస్తుంది. చెట్లలో కొత్త చిగుర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు పూమొగ్గల సంఖ్య తగ్గుతుంది.
*పూతరాని తోటల్లో..
పూత వచ్చేందుకు లీటరు నీటికి 5 గ్రా. చొప్పున ఫార్ములా-4 కలిపి చెట్లపై పిచికారి చేయాలి లేదా లీటరు నీటికి 10 గ్రా. చొప్పున పొటాషియం నైట్రేట్‌ కలిపి పిచికారి చేయవచ్చు. దీంతోపాటు తేలికపాటి నీటితడిస్తే.. పూమొగ్గలు ఉత్తేజితమై పూత తొందరగా, ఓకే సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది.
**వచ్చిన పూతను నిలిపేందుకు
* పూత రావటం.. వచ్చిన పూతను, పిందెలను నిలుపుకోవటం చాలా కీలకం. పూత పిందెగా మారడానికి లీటరు నీటికి 2 గ్రా. చొప్పున బోరాక్స్‌ కలిపి పూ మొగ్గలు తడిసేలా పిచికారి చేయాలి.
* పూత, పిందె రాలకుండా ఉండేందుకు 10 లీటర్ల నీటికి 2 మి.లీ. చొప్పున ప్లానోఫిక్స్‌ కలిపి పిచికారి చేయాలి. ఈ హార్మోన్‌ను పూమొగ్గ, పచ్చిపూత, నల్లపూత దశల్లో మూడుసార్లు పిచికారి చేయాలి. ఈ చర్యలతో పాటు పిందెకట్టే దశలో 20 రోజులకు ఒకసారి తేలికపాటి నీటి తడులివ్వాలి.సస్యరక్షణ
* తెల్లపూత దశలో అత్యవసరమైతే తప్ప మందులను చల్లొద్దు. ఈ దశలో పురుగుమందుల పిచికారీ వల్ల పూలలో పరపరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు మరణిస్తాయి. దీంతో పూలు ఫలధీకరణ చెందవు.
* పూత, పిందె దశల్లో చీడపీడలు నష్టం కలిగించే స్థాయిలో ఉన్నప్పుడు తగిన నివారణ చర్యలు చేపడితేనే మంచి ఫలితముంటుంది. పూత, పిందె దశల్లో తేనెమంచు పురుగులు, తామర పురుగులు ఆశించి రసం పీల్చటంవల్ల పూత రాలటమే కాకుండా పురుగులు విసర్జించిన తేనెలాంటి పదార్థంపై మసితెగులు ఆశిస్తుంది. మసితెగులు వల్ల కాడ నల్లగా మారుతుంది. పూత, పిందెలు రాలిపోతాయి.
* తామర పురుగులు, తేనెమంచు పురుగు అధికంగా ఉన్నప్పుడు.. లీటరు నీటికి.. ఫిప్రొనిల్‌ లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. కలిపి పిచికారి చేయాలి.
* ఆకులపై మసితెగులు ఉన్నప్పుడు 100 లీటర్ల నీటికి 2 కిలోల చొప్పున గంజిపొడి కలిపిన ద్రావణాన్ని చెట్లపై పిచికారి చేయాలి.
* బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం లీటరు నీటికి 3 గ్రా. లేదా హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారి చేయాలి. ఈ చర్యల ద్వారా పూత, పిందెలు ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి.
* నేలల స్థితిగతులు, యాజమాన్య పద్ధతులను బట్టి ఒక తోటకు, మరో తోటకు వ్యత్యాసముంటుంది. కాబట్టి రైతులు గుడ్డిగా తోటి రైతులను, మందుల విక్రయదారులను అనుసరించవద్దు. మామిడిపై వాతావరణ పరిస్థితులు తీవ్రమైన ప్రభావం చూపుతాయి. అందువల్ల రైతులు ఎప్పటికప్పుడు తోటలను గమనిస్తూ.. అసహజ లక్షణాలను నిపుణులతో నిర్ధారించుకుని తగిన చర్యలను చేపట్టడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు.