DailyDose

కొరోనాను భారీగా క్యాష్ చేసుకుంటున్న రైల్వే-వాణిజ్యం

Indian Railway Hikes Platform Prices Crazily-Telugu Business News Roundup Today

* కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 250 రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.50లకు పెంచుతున్నట్లు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్‌ సహా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే స్టేషన్లలో ఈ ధరను అమలు చేయనున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్లాట్‌ఫాంపై రద్దీని తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధర రేపటి నుంచి అమల్లోకి రానుంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పెంచిన ధర అమల్లో ఉంటుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. రైల్వేకు ఉన్న ఆదాయ వనరుల్లో ప్లాట్‌ఫాం టికెట్లు ఒకటి. సాధారణంగా పండగల సందర్భంలో రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రైల్వేశాఖ ఆయా రోజుల్లో ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను పెంచి, మళ్లీ పండగ సీజన్‌ అయిపోగానే యథావిధిగా మారుస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వేస్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలో నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో లాభపడి మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 810 పాయింట్లు నష్టపోయి.. 30,579 వద్ద ముగిసింది. నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోయి 8,967 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో యెస్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, ఐషర్‌ మోటర్స్‌, హీరో మోటర్స్‌, హిందుస్థాన్‌ యూనీలివర్‌ షేర్లు లాభాల్లో పయనించగా.. జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.

* కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రానున్న 15 రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని స్వయంగా అధ్యక్షుడు ట్రంపే వివరించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. 10 కంటే ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉన్న అన్ని సమావేశాల్ని రద్దు చేసుకోవాలని ఆదేశించారు. పరిస్థితి చాలా దయనీయంగా ఉందని శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పటి వరకు అమెరికాలో 4500 మందికి పైగా వైరస్‌ బారినపడగా.. వీరిలో 88 మంది మృత్యువాతపడ్డారు. వచ్చే జులై లేదా ఆగస్టులోగా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రావొచ్చని అభిప్రాయపడ్డారు. అంతకంటే ఎక్కువ రోజులు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. రెస్టారెంట్లు, బార్లు, వ్యాయామశాలలకు వెళ్లొద్దని సూచించారు. వృద్ధులు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. అందరు కలిసి కట్టుగా పనిచేస్తేనే వైరస్‌ ముప్పును ఎదుర్కోగలమని పిలుపునిచ్చారు.

* గత ఐదురోజుల్లో 5 వేల రూపాయల వరకూ తగ్గిన పదిగ్రాముల పసిడి మంగళవారం స్వల్పంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి బంగారంలో పెట్టుబడులకు మళ్లుతుండటంతో యల్లో మెటల్‌కు డిమాండ్‌ పెరిగింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 107 రూపాయలు పెరిగి రూ. 39,625 పలికింది. ఇక కిలో వెండి రూ. 155 తగ్గి రూ. 36,052కు దిగివచ్చింది. కాగా, కొద్ది రోజులు బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య సాగినా క్రమంగా స్థిరంగా ముందుకు సాగుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.