Agriculture

పెరటికోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

Pet Hens Chickens Rising Tips-Telugu Agricultural News Latest 2020

గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ల పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. పొదిగే కోళ్లు, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పశువైద్యాధికారి తెలిపారు.
**పెరటి కోళ్లను పెంచే పాకల్లో నేలపై గచ్చు లేదా సున్నం వేసి శుభ్రంగా ఉంచాలి. దీనిపై గడ్డి లేదా ఊకను పరిచి, నెలకోసారి మార్చాలి. తల్లి కోడి, పిల్లలకు ఇతర కోళ్లు, పుంజుల నుంచి హాని కలగకుండా చూడాలి. పొదిగే కోళ్ల దగ్గర మేత, నీళ్లు ఉంచాలి. వీటి పాకలు వేరుగా ఉండాలి. గుడ్లు పొదిగిన తర్వాత ఆ బుట్టలను శుభ్రం చేసి తిరిగి ఉపయోగించుకోవచ్చు. పాకలో మూడో భాగాన్ని కోళ్లు గుడ్లు పెట్టడానికి ఉపయోగించాలి. గుడ్లు పొదిగే కోళ్లు ఉండే ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. పాక గోడలను, తలుపులను ఏడాదికి రెండుసార్లు తప్పనిసరిగా శుభ్రం చేయాలి.
***బ్రూడింగ్‌ పాకలో..
బ్రూడింగ్‌ పాకలో గుడ్లు పెట్టే కోళ్లను మాత్రమే ఉంచాలి. వెదురు బుట్టలు, చెక్క పెట్టెలు, పగిలిన కుండలతో 15-20 గూళ్లను వరుసగా ఏర్పాటు చేయాలి. దీంతో అన్ని కోళ్లు ఒకేచోట గుడ్లు పెడతాయి. ఈ బుట్టల్లో ఇసుక, బూడిద కలిపిన మిశ్రమం మూడు వంతులు, ఎండుగడ్డి, మెత్తని ఇతర పదార్థాలను రెండు వంతులు నింపి దానిపై గుడ్లను పేర్చాలి. ఈ బుట్టలను ప్రశాంత వాతావరణం ఉన్న చీకటి ప్రదేశంలో ఉంచాలి. బాహ్యపరాన్న జీవుల నియంత్రణకు పొగాకు, వేపాకు పొడిని కొంతమేర బుట్టల్లో ఉంచాలి. ఇలా చేస్తే పొదుగుడు శాతం పెరుగుతుంది. కోడి పిల్లల పెంపకం : తల్లి, పిల్లలను ప్రత్యేకమైన పాకల్లో ఉంచాలి. ప్రతి కోడికి ప్రత్యేక గూడు, గోనె పట్టాను ఏర్పాటు చేయాలి. మొదటి వారం రోజులు పిల్లలను తల్లి దగ్గరే ఉంచాలి. పాక లోపల మేత, నీళ్లు అందుబాటులో ఉంచాలి. బుట్టలను, గోనె పట్టాలను రోజు శుభ్రం చేయాలి. 1-3 వారాలు వరకు కోడి పిల్లలను పాకలో లేదా బయట గంప కింద ఉంచాలి. తల్లిని అప్పుడప్పుడు బయటకు వదలాలి. అవసరాన్ని బట్టి సాయంత్రం పూట దాణా పెట్టాలి. ఎక్కువ పిల్లలు **పొదగాలంటే..
వెదురు బుట్టలను ఇసుక లేదా చింత గింజలతో నింపాలి లేదా బుట్ట అడుగుభాగంలో గోనె పట్టా వేసి పైన ఆకులను పరచాలి. బుట్టలో వేప ఆకులను పరిస్తే.. ఇసుక, చింత గింజల నుంచి వచ్చే వేడి తగ్గుతుంది. పొదుగుడు గంప మీద నేరుగా ఎండ పడకుండా చూడాలి. వర్షాకాలం లేదా చలికాలంలో పొదుగుడు గంపలో ఎండుగడ్డి లేదా వరి పొట్టు నింపాలి. 12-13 గుడ్లు కోడి కింద సరిపోతాయి. 15 మించి పెట్టకూడదు. చలికాలంలో పొదుగుడు గంపలను మూలన ఉంచి పైన నైలాన్‌ సంచిని కోడికి శ్వాస అందేలా కప్పాలి. గుడ్లు పెట్టడానికి నెల ముందు తల్లి కోడికి టీకాలు, నట్టల మందు తాగించాలి.