Business

అమెజాన్ వీడియో నాణ్యత తగ్గింది

Amazon Prime Streaming Quality Reduced

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా వినియోగదారులకు వినోదం పంచుతున్న ఈ సంస్థ వీడియోల నాణ్యతను తగ్గించాలని యోచిస్తోంది. కరోనా వైరస్‌ ప్రభావంతో దేశం మొత్తం ఎక్కడికక్కడ నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉండే ప్రజలు ఇంటర్నెట్‌ ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది. దీని వల్ల ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌లో ఏర్పడే ఇబ్బందులను తగ్గించేందుకు స్ట్రీమింగ్‌ బిట్‌రేట్‌ను తగ్గించేందుకు అమెజాన్‌ పరిశీలిస్తోంది. నెట్‌వర్క్‌ ప్రొవైడర్లపై ఏర్పడే ఒత్తిడిని తగ్గించేందుకు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తమ వీడియోలను హెచ్‌డీ క్వాలిటీ నుంచి ఎస్‌డీ క్వాలిటీకి తగ్గించాలని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాయ్‌) ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్‌ అభ్యర్థనపై అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తాజాగా స్పందించింది. ‘భారత్‌లో వినియోగదారులకు నాణ్యమైన స్ట్రీమింగ్‌తో వీడియోలు అందిస్తున్న మేము ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోగలం. అందుకే స్ట్రీమింగ్‌ బిట్‌ రేట్‌ను తగ్గించే చర్యలు ఇప్పటికే ప్రారంభించాం’ అని పేర్కొంది. మరో ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ మాత్రం ఇంకా తన స్పందన తెలపలేదు.