Politics

ఏపీలో సమగ్ర సర్వే

YS Jagan Reviews COVID19 Survey Arrangements

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని నిర్దేశించారు. వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లను దీని కోసం వినియోగించాలని సూచించారు. గురువారంలోగా ఈ సర్వే పూర్తి చేయాలని తెలిపారు. తర్వాత కూడా తాజా వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలని పేర్కొన్నారు. సర్వే సమగ్రంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. తద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలమని చెప్పారు. కరోనా వ్యాప్తి- నియంత్రణ చర్యలపై మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
* ఇప్పటివరకూ విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారితో కలిసిన వ్యక్తుల గురించే కాకుండా ప్రజలందరిపై దృష్టిపెట్టాలి.
* ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ లాక్‌డౌన్‌కు సహకరించాలి.
* ఇళ్లలో ఉండటం వల్ల సర్వేకు సహకరించిన వారవుతారు
* రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రజల నుంచి పూర్తి సహకారం ఆశిస్తున్నాం.
* కరోనా వ్యాప్తిని నిరోధించాలి. ఈ వైరస్‌ లక్షణాలున్నవారు ఎవరైనా ఉంటే వారికి సత్వరమే వైద్యసాయం అందించాలి.
* రాష్ట్రంలో ఇప్పటివరకూ పాజిటివ్‌గా తేలిన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, వారితో సన్నిహితంగా ఉన్నవారివే.
* ఇది సామాన్య ప్రజలకు వ్యాపించకుండా ఉండాలంటే వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి
* రెండోసారి సర్వే ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుంది.
* కరోనా లక్షణాలు ఉన్నవారు విధిగా హోం ఐసోలేషన్‌ పాటించాలి.